Banana fiber
-
అరటి నారతో వస్తువులు.. హీరోయిన్ విద్యాబాలన్ కూడా మెచ్చుకుంది
అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనిపించదు. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన కుదురుగా ఉండనీయదు. జీవనం పరీక్షగా అనిపిస్తుంటుంది. ‘అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? మనమే అవకాశాలను అందిపుచ్చుకోవాలా?! ఈ విధమైన సంఘర్షణే అరటినార వైపుగా అడుగులు వేయించింది’ అంటారు బళ్లారి వాసి విశ్వనాథ్. అరటినారతో గృహోపకరణాలను తయారుచేస్తూ తమ గ్రామమైన కంప్లిలో 20 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎకోఫ్రెండ్లీ వస్తువుల ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసిన విశ్వనాథ్ తన ప్రయత్నం వెనక ఉన్న కృషిని వివరించారు. ‘‘ప్రయత్నం లేకుండా ఫలితాలను ఆశించలేం అని తెలుసు. కానీ, కొంతకాలం మైండ్‌లో ఏ పని మీద దృష్టి పెట్టాలో తెలియకుండా ఉంటుంది. నా విషయంలో అదే జరిగింది. బీటెక్ చదువును మధ్యలో వదిలేశాను. ఇంట్లో అమ్మానాన్నలకు ఏ సమాధానమూ చెప్పలేక బెంగళూరులో ఏదైనా పని చేసుకోవచ్చని కొన్ని రోజులు ప్రయత్నించాను. ఏ పనీ సంతృప్తిని ఇవ్వలేదు. కరోనాటైమ్‌లో ఇంటి వద్దే కాలక్షేపం. బోలెడంత సమయం ఖాళీ. చదువు పూర్తి చేయలేకపోయానని అమ్మానాన్నల ముందు గిల్టీగా అనిపించేది. అరటితోటల్లోకి.. మా ప్రాంతంలో అరటితోటలు ఎక్కువ. నా చిన్నతనంలో అరటి నుంచి తీసే నారతో అమ్మావాళ్లతో కలిసి తాళ్లు, ఏవో ఒకట్రెండు ఐటమ్స్ తయారు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఎవరూ వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాలక్షేపానికి అరటి నారతో రాఖీలు, కీ చెయిన్లు తయారు చేయడం మొదలుపెట్టాను. మా ఊరైన కంప్లిలో మహిళలు ఊలు దారాలతో క్రొచెట్ అల్లికలు చేస్తుంటారు. ఆ క్రొచెట్ను అరటినారతో చేయిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచన వచ్చింది. ముందు నేను ప్రయత్నించాను. క్రోచెట్ అల్లికలను నేర్చుకున్నాను. బ్యాగులు, బుట్టలు చేయడం మొదలుపెట్టాను. ముందైతే జీరో వేస్ట్ ప్రోడక్ట్స్ అనే ఆలోచన ఏమీ లేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే. అయితే, అరటినారను తీసి, బాగా క్లీన్ చేసి, ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారుచేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి అనే రీసెర్చ్ సొంతంగా చేశాను. సిద్ధం చేసుకున్న అరటినారను క్రొచెట్ అల్లే మహిళలకు ఇచ్చి, నాకు కావల్సిన వస్తువులు తయారు చేయించడం మొదలుపెట్టాను. రాఖీతో మొదలు... నేను చేసే పనిని ఒక ప్లానింగ్‌గా రాసుకొని, బ్యాంకువాళ్లను సంప్రదిస్తే 50 వేల రూపాయలు రుణం మంజూరు చేశారు. ఆ మొత్తంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అరటి నార తీసి, ఎండబెట్టడం.. ప్రక్రియకు వాడటంతో పాటు మహిళలు వచ్చి అల్లికలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాను. మూడేళ్ల క్రితం ఇదే టైమ్‌లో మార్కెట్‌కి వెళ్లినప్పుడు రాఖీలను చూశాను. అవన్నీ కాటన్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవి. అవి చూసి రాఖీలను అరటినార, మట్టి ఉండలు, గవ్వలు, సీడ్ బాల్స్, తాటి ఆకులతో తయారు చేశాను. తెలిసిన వారికి వాటిని ఇచ్చాను. ప్రతి ఉత్పత్తి జీరో వేస్ట్ మెటీరియల్‌తో రూపొందించడంలో శ్రద్ధ తీసుకున్నాను. ‘విష్నేచర్’ పేరుతో హస్తకళాకారుల ఫోరమ్ నుంచి ఐడీ కార్డ్ ఉంది. దీంతో ఎక్కడ ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్స్, స్టాల్స్‌కు అవకాశమున్నా నాకు ఇన్విటేషన్ ఉంటుంది. నా వీలును, ప్రొడక్ట్స్‌ను బట్టి స్టాల్ ఏర్పాటు చేస్తుంటాను. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ మా అరటినార ఉత్పత్తులు వెళుతుంటాయి. వంద రకాలు.. ఊలు దారాలతో క్రొచెట్ చేసే మహిళలు ఇప్పుడు అరటినారతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్ బ్యాగ్స్, క్లచెస్, మిర్రర్, టేబుల్ మ్యాట్స్, ΄ప్లాంటేషన్ డెకార్, పెన్ హోల్డర్స్, తోరణాలు, బుట్టలు... దాదాపు 100 రకాల వస్తువులను తయారు చేస్తుంటాం. ఈ ఉత్పత్తులు ఐదేళ్లకు పైగా మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా పాడవవు. అయితే, తడి ఉన్న ఉత్పత్తులను నీడన ఎక్కడో పడేస్తే మాత్రం ఫంగస్ చేరుతుంది. శుభ్రపరిచినా ఎండలో బాగా ఆరబెట్టి, తిరిగి వాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ముందే చెబుతుంటాను. ఇరవైమంది మహిళలు ఒక్కొక్కరు నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు. గుర్తింపు, ఆదాయాన్ని పొందే మార్గాన్ని కనుక్కోవడంతో కొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ పనిని మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో నేచరల్ ఫేస్ స్క్రబ్స్, ఇతర ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఒక ప్యాకేజీగా ఇవ్వాలన్న తపనతో పని చేస్తున్నాను. నా పనిని మెచ్చుకున్నవారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వంటి ప్రముఖులు ఉన్నారు. మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నం, నా పనితీరుతో అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారు’’ అని వివరించారు విశ్వనాథ్. – నిర్మలారెడ్డి -
Fashion And Lifestyle: ఫుడ్‌ని ధరిద్దాం..
అరటిపండు, మొక్కజొన్న, ఆరెంజ్, సోయాబీన్, యాపిల్, పైనాపిల్.. ఇవన్నీ తినేవే. ధరించేవి కూడా!! ఫ్యాషన్ ప్రపంచం ఇక ప్రకృతిని ప్రేమించడానికి సిద్ధపడిపోయింది. ప్లాస్టిక్ వృథాను అరికట్టేందుకు, భూమిలో కలిసిపోయే ఫ్యాబ్రిక్‌ను రూపొందించాలనుకుంది. అంతేకాదు, ఆహారపదార్థాల వ్యర్థాల నుంచి తయారు చేసిన ఫ్యాబ్రిక్ సుతిమెత్తగా ఉండి మేనికి హాయిని ఇస్తుంది. ప్రకృతి ప్రేమికులుగా ఫ్యాషన్ ప్రియులు మారిపోతున్నారు. అందుకే డిజైనర్లూ తమ స్టైల్‌ని, మార్కెట్‌నూ మార్చుకుంటున్నారు. అలాంటి డిజైనర్ల లో మధురిమా సింగ్ ఒకరు. పువ్వులు– పండ్లు.. రంగులు దేశీయ చేనేతలకు సేంద్రీయ రంగులతో ప్రయోగాలు చేస్తుంది. కూరగాయల వ్యర్థాలు, వాడిన పువ్వులు, పండ్లు, విత్తనాలు మొదలైన వాటిని సేకరించి, వాటి నుంచి రంగులు తీసి, కాటన్ ఫ్యాబ్రిక్‌పైన అందంగా రూపుకడుతుంది. సంప్రదాయ, సమకాలీన పద్ధతుల్లో కళ్లకు, చర్మానికి హాయిగొలిపేలా మధురిమా షాహి ‘ధూరి’ దుస్తులు ముఖ్యంగా ఈ తరం మహిళ నడకకు హుందాతనాన్ని అద్దుతాయి. ఆహార వ్యర్థాల... ఫ్యాబ్రిక్ అరటి, మొక్కజొన్న, సోయా, పాలు, తామర, ఆరెంజ్, బాంబూ, యూకలిప్టస్ వంటి సహజ ఫైబర్లతో పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్‌ను ‘ధురి’ అనే ఫ్యాషన్ లేబుల్ ద్వారా తయారు చేస్తున్నారు మధురిమా సింగ్. వాటికి సహజసిద్ధమైన రంగులను ఉపయోగించి అందమైన, సౌకర్యవంతమైన డిజైన్స్ రూపొందిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీలో ధురి స్టూడియో ఏర్పాటు చేసి, తన ఆలోచనను విరివిగా అమలులోకి తీసుకొచ్చారు. సృజనాత్మక డిజైన్, ప్రకృతి సమతౌల్యత రెండింటికీ మధురిమ న్యాయం చేయాలనుకున్నారు. డిగ్రీ చేసిన మధురిమ ఎక్స్పోర్ట్ కంపెనీలతో పాటు ప్రముఖ డిజైనర్లతో కలిసి పనిచేశారు. ఉద్యోగ అనుభవాలతో డిజైనర్‌గా మారారు. అయితే, తన లేబుల్‌ను పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారైన దుస్తులకే పరిమితం చేశారు. మధురిమా సింగ్ ఫ్యాబ్రిక్, ఫ్యాషన్ డిజైనర్ -
అరటి నారలో అర్థముంది!
అరటి బొందల నుంచి తీసే నారకు దేశవిదేశాల్లో గిరాకీ ఎకరానికి రూ. 30 వేల విలువైన నార తీసేందుకు అవకాశం.. ఖర్చులు పోను రూ. 10 వేల వరకు నికరాదాయం కలవచర్ల కేవీకే రూపొందించిన యంత్రంతో అరటి నార తీత చాలా సులువు.. దేశవిదేశాల నుంచి ఆర్డర్లు సృష్టిలో వృథా అనేదేదీ లేదు. వృథా అనిపించే వాటికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. అరటి రైతుకు గెలల అమ్మకం ద్వారానే కాదు.. వృథాగా పారేసే అరటి బొందల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందే మార్గం ఉంది. అరటి బొందల నుంచి తీసే నారకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. తూర్పు గోదావరి జిల్లా కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు అరటి నార తీసే యంత్రాన్ని రూపొందించింది. దీంతో అరటి రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. అరటి తోటలో గెలలు నరికిన తర్వాత బొంద(చెట్టు)లను వృథాగా పారేయడం పరిపాటి. వీటి నుంచి తీసే నార వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. హేండ్ మేడ్ టిష్యూ పేపర్, డెకరేషన్ పేపర్, నర్సరీ పౌచెస్, క్యారీ బ్యాగ్స్, డోర్ మేట్స్, కార్పెట్స్, తాళ్లు, ఆర్ట్ పేపర్, క్రాఫ్ట్ పేపర్, బాండ్ పేపర్లు, పెన్ స్టాండ్స్, టేబుల్ డెకరేటివ్స్, ల్యాంప్ షేడ్స్తోపాటు వస్త్రాల తయారీలోనూ అరటి నారను వాడుతున్నారు. యంత్ర సహాయం లేకుండా ఒక మనిషి రోజుకు అర కేజీ వరకు మాత్రమే పొట్టుతో కూడిన నారను తీయడం సాధ్యం. దీంతో రైతులు నార తీతపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశంలోనే మొట్టమొదటిగా అరటి నార తీసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు ఈ యంత్రం ద్వారా రోజులో 12 నుంచి 15 కిలోల నాణ్యమైన నారను తీయగలుగుతున్నారు. తద్వారా వృథాగా పారేసే అరటి బొందల నుంచి నార తీయడంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుండడం విశేషం. కేవీకే యంత్రానికి జాతీయ అవార్డు అరటి బొందల ద్వారా నారను తీసే యంత్రం తయారు చేస్తే చెత్త సమస్య పరిష్కారం కావడంతోపాటు.. అరటి రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందన్న దృష్టితో కలవచర్ల కేవీకేకు చెందిన శాస్త్రవేత్తలు యంత్రం రూపకల్పనకు కృషి చేశారు. దేశంలోనే మొట్టమొదటిగా 2002లో అరటి నార తీసే యంత్రాన్ని విజయవంతంగా రూపొందించారు. డా. వెంకట సుబ్రమణియన్, డాక్టర్ దేవ్‌సింగ్, ఇంజినీర్ ఐ. శ్రీనివాస్‌ల తోడ్పాటుతో డాక్టర్ రూపాకుల సుధాకర్ చేసిన కృషి ఫలితంగా ఈ యంత్రం రూపుదాల్చింది. ఒన్ హెచ్‌పీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. దీని నిర్వహణ వ్యయం స్వల్పం కావడం విశేషం. 2005లో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ(ఎన్ఆర్డీసీ) డా. సుధాకర్‌కు మెరిటోరియస్ ఇన్వెన్షన్ అవార్డుతోపాటు రూ. లక్ష నగదు బహుమతిని అందించి సత్కరించింది. ఈ యంత్రం ప్రస్తుత ఖరీదు రూ. 55 వేలు. ఇప్పటికి 350 యంత్రాలను కేవీకే విక్రయించింది. మన రాష్టంలో పలువురు రైతు బృందాలతోపాటు 19 రాష్ట్రాలు, వెస్టిండీస్, శ్రీలంక దేశాల్లోని వారికి కూడా ఈ యంత్రాంలను విక్రయించినట్లు డా. సుధాకర్ తెలిపారు. ఆస్ట్రేలియాకూ త్వరలో ఈ యంత్రాన్ని పంపనున్నట్లు చెప్పారు. రాజమండ్రి సీటీఆర్ఐ డెరైక్టర్ కె.దామోదరరెడ్డి, కల్వచర్ల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ విఎస్జీఆర్ నాయుడు ప్రోత్సాహంతో కేవీకే శాస్త్రవేత్తలు అరటి నార తీయడంతో పాటు వివిధ చేతి వృత్తుల్లో రైతు మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఎకరానికి 150 కిలోల అరటి నార.. పక్వానికి వచ్చిన గెలలు నరికిన తర్వాత బొందలను కేవీకే రూపొందించిన యంత్రంతో నార తీయడానికి నలుగురు మనుషులు అవసరమవుతారు. ఎకరంలో 1200 వరకు అరటి చెట్లుంటాయి. వీటి నుంచి కనీసం 150 కిలోల నాణ్యమైన అరటి నారను తీయవచ్చు. సాధారణమైన అరటి నారను హేండ్ మేడ్ పేపర్ తయారీదారులు కిలో రూ. 200కు కొనుగోలు చేస్తున్నారు. నారను చక్కగా దువ్వి, పొట్టు లేకుండా ప్రాసెస్ చేసి అమ్మితే కిలోకు రూ. 300 నుంచి 400 వరకు ధర లభిస్తుంది. దేశంలో ఏటా వంద కోట్ల అరటి బొందలను నార తీయకుండానే వృథాగా పారేస్తున్నారని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల అరటి బొందలను చెత్తకుప్పలో వృథాగా పడేస్తున్నట్లు అంచనా. ఏడాది పొడవునా అరటి దిగుబడి వస్తుంటుంది కాబట్టి అన్ని కాలాల్లోనూ అరటి నార ఉత్పత్తికి అవకాశం ఉంది. అరటి నార ఎగుమతిలో ఫిలిప్పీన్స్ ముందంజలో ఉంది. జపాన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు, అమెరికా తదితర దేశాల్లో అరటి నారను విస్తృతంగా వినియోగిస్తున్నారు. కాబట్టి, అరటి నార ఎగుమతులకు అవకాశాలు చాలా ఉన్నాయి. - ఎల్. శ్రీనివాసరావు, బ్యూరో చీఫ్, రాజమండ్రి ఫొటోలు: గంధం వెంకట రమణ డొప్పలు తీసిన రోజే నార తీయాలి బలంగా, దృఢంగా ఉన్న చెట్టు నుంచి నాణ్యమైన నార వస్తుంది. తక్కువ రసాయనిక ఎరువులతో లేదా ప్రకృతి సేద్య పద్ధతిలో సాగైన అరటి చెట్ల నార బలంగా ఉంటుంది. ఏ రకం అరటి బొందల నుంచైనా 150 గ్రాముల చొప్పున నార తీయవచ్చు. కూర అరటి, అమృతపాణి చెట్ల నుంచి 200 గ్రాముల వరకు వస్తుంది. అరటి తోటలున్న రైతులు బృందాలుగా ఏర్పడి ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. అరటి డొప్పలు తీసిన రోజునే నార తీసి నీడపట్టున ఆరబెట్టాలి. ఆలస్యమైతే నార రంగు మారి నాణ్యత తగ్గుతుంది. - డాక్టర్ రూపాకుల సుధాకర్ (98661 06885), అరటి నార తీసే యంత్రం రూపకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల, తూ.గో. జిల్లా