అరటి నారలో అర్థముంది!
- అరటి బొందల నుంచి తీసే నారకు దేశవిదేశాల్లో గిరాకీ
- ఎకరానికి రూ. 30 వేల విలువైన నార తీసేందుకు అవకాశం.. ఖర్చులు పోను రూ. 10 వేల వరకు నికరాదాయం
- కలవచర్ల కేవీకే రూపొందించిన యంత్రంతో అరటి నార తీత చాలా సులువు.. దేశవిదేశాల నుంచి ఆర్డర్లు
సృష్టిలో వృథా అనేదేదీ లేదు. వృథా అనిపించే వాటికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. అరటి రైతుకు గెలల అమ్మకం ద్వారానే కాదు.. వృథాగా పారేసే అరటి బొందల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందే మార్గం ఉంది. అరటి బొందల నుంచి తీసే నారకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. తూర్పు గోదావరి జిల్లా కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు అరటి నార తీసే యంత్రాన్ని రూపొందించింది. దీంతో అరటి రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది.
అరటి తోటలో గెలలు నరికిన తర్వాత బొంద(చెట్టు)లను వృథాగా పారేయడం పరిపాటి. వీటి నుంచి తీసే నార వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. హేండ్ మేడ్ టిష్యూ పేపర్, డెకరేషన్ పేపర్, నర్సరీ పౌచెస్, క్యారీ బ్యాగ్స్, డోర్ మేట్స్, కార్పెట్స్, తాళ్లు, ఆర్ట్ పేపర్, క్రాఫ్ట్ పేపర్, బాండ్ పేపర్లు, పెన్ స్టాండ్స్, టేబుల్ డెకరేటివ్స్, ల్యాంప్ షేడ్స్‌తోపాటు వస్త్రాల తయారీలోనూ అరటి నారను వాడుతున్నారు.
యంత్ర సహాయం లేకుండా ఒక మనిషి రోజుకు అర కేజీ వరకు మాత్రమే పొట్టుతో కూడిన నారను తీయడం సాధ్యం. దీంతో రైతులు నార తీతపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశంలోనే మొట్టమొదటిగా అరటి నార తీసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు ఈ యంత్రం ద్వారా రోజులో 12 నుంచి 15 కిలోల నాణ్యమైన నారను తీయగలుగుతున్నారు. తద్వారా వృథాగా పారేసే అరటి బొందల నుంచి నార తీయడంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుండడం విశేషం.
కేవీకే యంత్రానికి జాతీయ అవార్డు
అరటి బొందల ద్వారా నారను తీసే యంత్రం తయారు చేస్తే చెత్త సమస్య పరిష్కారం కావడంతోపాటు.. అరటి రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందన్న దృష్టితో కలవచర్ల కేవీకేకు చెందిన శాస్త్రవేత్తలు యంత్రం రూపకల్పనకు కృషి చేశారు. దేశంలోనే మొట్టమొదటిగా 2002లో అరటి నార తీసే యంత్రాన్ని విజయవంతంగా రూపొందించారు. డా. వెంకట సుబ్రమణియన్, డాక్టర్ దేవ్‌సింగ్, ఇంజినీర్ ఐ. శ్రీనివాస్‌ల తోడ్పాటుతో డాక్టర్ రూపాకుల సుధాకర్ చేసిన కృషి ఫలితంగా ఈ యంత్రం రూపుదాల్చింది. ఒన్ హెచ్‌పీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. దీని నిర్వహణ వ్యయం స్వల్పం కావడం విశేషం. 2005లో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ(ఎన్‌ఆర్‌డీసీ) డా. సుధాకర్‌కు మెరిటోరియస్ ఇన్వెన్షన్ అవార్డుతోపాటు రూ. లక్ష నగదు బహుమతిని అందించి సత్కరించింది.
ఈ యంత్రం ప్రస్తుత ఖరీదు రూ. 55 వేలు. ఇప్పటికి 350 యంత్రాలను కేవీకే విక్రయించింది. మన రాష్టంలో పలువురు రైతు బృందాలతోపాటు 19 రాష్ట్రాలు, వెస్టిండీస్, శ్రీలంక దేశాల్లోని వారికి కూడా ఈ యంత్రాంలను విక్రయించినట్లు డా. సుధాకర్ తెలిపారు. ఆస్ట్రేలియాకూ త్వరలో ఈ యంత్రాన్ని పంపనున్నట్లు చెప్పారు. రాజమండ్రి సీటీఆర్‌ఐ డెరైక్టర్ కె.దామోదరరెడ్డి, కల్వచర్ల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ విఎస్‌జీఆర్ నాయుడు ప్రోత్సాహంతో కేవీకే శాస్త్రవేత్తలు అరటి నార తీయడంతో పాటు వివిధ చేతి వృత్తుల్లో రైతు మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.
ఎకరానికి 150 కిలోల అరటి నార..
పక్వానికి వచ్చిన గెలలు నరికిన తర్వాత బొందలను కేవీకే రూపొందించిన యంత్రంతో నార తీయడానికి నలుగురు మనుషులు అవసరమవుతారు. ఎకరంలో 1200 వరకు అరటి చెట్లుంటాయి. వీటి నుంచి కనీసం 150 కిలోల నాణ్యమైన అరటి నారను తీయవచ్చు. సాధారణమైన అరటి నారను హేండ్ మేడ్ పేపర్ తయారీదారులు కిలో రూ. 200కు కొనుగోలు చేస్తున్నారు. నారను చక్కగా దువ్వి, పొట్టు లేకుండా ప్రాసెస్ చేసి అమ్మితే కిలోకు రూ. 300 నుంచి 400 వరకు ధర లభిస్తుంది.
దేశంలో ఏటా వంద కోట్ల అరటి బొందలను నార తీయకుండానే వృథాగా పారేస్తున్నారని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల అరటి బొందలను చెత్తకుప్పలో వృథాగా పడేస్తున్నట్లు అంచనా. ఏడాది పొడవునా అరటి దిగుబడి వస్తుంటుంది కాబట్టి అన్ని కాలాల్లోనూ అరటి నార ఉత్పత్తికి అవకాశం ఉంది. అరటి నార ఎగుమతిలో ఫిలిప్పీన్స్ ముందంజలో ఉంది. జపాన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు, అమెరికా తదితర దేశాల్లో అరటి నారను విస్తృతంగా వినియోగిస్తున్నారు. కాబట్టి, అరటి నార ఎగుమతులకు అవకాశాలు చాలా ఉన్నాయి.
- ఎల్. శ్రీనివాసరావు, బ్యూరో చీఫ్, రాజమండ్రి
ఫొటోలు: గంధం వెంకట రమణ
డొప్పలు తీసిన రోజే నార తీయాలి
బలంగా, దృఢంగా ఉన్న చెట్టు నుంచి నాణ్యమైన నార వస్తుంది. తక్కువ రసాయనిక ఎరువులతో లేదా ప్రకృతి సేద్య పద్ధతిలో సాగైన అరటి చెట్ల నార బలంగా ఉంటుంది. ఏ రకం అరటి బొందల నుంచైనా 150 గ్రాముల చొప్పున నార తీయవచ్చు. కూర అరటి, అమృతపాణి చెట్ల నుంచి 200 గ్రాముల వరకు వస్తుంది. అరటి తోటలున్న రైతులు బృందాలుగా ఏర్పడి ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. అరటి డొప్పలు తీసిన రోజునే నార తీసి నీడపట్టున ఆరబెట్టాలి. ఆలస్యమైతే నార రంగు మారి నాణ్యత తగ్గుతుంది.
- డాక్టర్ రూపాకుల సుధాకర్ (98661 06885),
అరటి నార తీసే యంత్రం రూపకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల, తూ.గో. జిల్లా