అపారం రైతుల జ్ఞానం! | Organic farming Special Story | Sakshi
Sakshi News home page

అపారం రైతుల జ్ఞానం!

Published Tue, Aug 6 2019 9:06 AM | Last Updated on Tue, Aug 6 2019 9:06 AM

Organic farming Special Story - Sakshi

చిరుధాన్యాలు, పప్పుధాన్యాల మిశ్రమ సేంద్రియ సాగులో నిమగ్నమైన జహీరాబాద్‌ మహిళా రైతులు (ఫైల్‌)

ఏమిటి? :జహీరాబాద్‌ ప్రాంతంలో మహిళా రైతులు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర వర్షాధార పంటలను సాగు చేసుకుంటూ సంక్షోభం లేని వ్యవసాయ పద్ధతిని గత 30 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. ఈ సంగతి తెలియనిదేమీ కాదు.

ఇప్పుడు కొత్త సంగతి ఏమిటంటే..
వీరు అనుసరిస్తున్న జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయ పద్ధతిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిగట్టుకొని ఏడాది పాటు అధ్యయనం చేసి సమగ్ర నివేదికను వెలువరించారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ పరిశోధనా సంచాలకులు డా. ఆర్‌. ఉమారెడ్డి, హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ సోషల్‌ స్టడీస్‌(సెస్‌) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బి. సురేష్‌రెడ్డి, డీడీఎస్‌ డైరెక్టర్‌ పి.వి.సతీష్, చిన్న నరసమ్మ, దంతులూరి తేజస్వి కలిసి న్యూఫీల్డ్‌ ఫౌండేషన్‌(అమెరికా) తోడ్పాటుతో ఈ అధ్యయనం చేశారు. ‘ఇంటర్‌ఫేసింగ్‌ ఫార్మర్స్‌ సైన్స్‌ విత్‌ ఫార్మల్‌ సైన్స్‌’ పేరిట ఈ విలక్షణ అధ్యయన నివేదికను వెలువరించారు.

ఎక్కడ?
హైదరాబాద్‌ బేగంపేటలోని సెస్‌ ఆడిటోరియంలో జాతీయ గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్‌ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డా. డబ్ల్యూ. ఆర్‌. రెడ్డి, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌) డైరెక్టర్‌ జనరల్‌ డా.ఉషారాణి, సెస్‌ డైరెక్టర్‌ ప్రొ. రేవతి ఈ నివేదికను ఇటీవల ఆవిష్కరించారు. జహీరాబాద్‌ ప్రాంతంలో మహిళా రైతులు సాంప్రదాయ సేంద్రియ పద్ధతుల్లో వర్షాధారంగా ఒకటికి 20 పంటలను కలిపి పండిస్తున్నారు. అప్పుల్లేని, ఆత్మహత్యల్లేని జీవవైవిధ్య వ్యవసాయం వారిది. డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వీరిని సంఘటితపరచి ముందుకు నడిపిస్తోంది. వారి వ్యవసాయ సంస్కృతిని, దాని చుట్టూ అల్లుకున్న సంప్రదాయ పర్యావరణ, జీవవైవిధ్య జ్ఞానాన్ని శ్రద్ధగా గమనిస్తే– వ్యవసాయ సంక్షోభం నుంచి మన దేశాన్ని బయటపడేసే మార్గం మనకు కనిపిస్తుంది. ప్రకృతికి అనుగుణమైన సేద్య జీవనాన్ని అనుసరిస్తున్న వారికి ఉన్న అవగాహనా శక్తి గొప్పది. చిన్న రైతులు ఇప్పుడు పెద్ద రైతులుగా ఎదిగారు. సంతోషదాయకమైన, ఆరోగ్యదాయకమైన జీవనాన్ని గడుపుతున్న మహిళా రైతులను మనసారా అభినందించారు.

ఎవరేమన్నారు?
‘రైతుల సంప్రదాయ జ్ఞానం గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చెప్పని ఎన్నో గొప్ప విషయాలు ఈ అధ్యయన కాలంలో రైతుల పొలాల్లో చూసి నేర్చుకున్నాను. వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. పశువులు బాగున్నాయి. భూమి ఆరోగ్యంగా ఉంది. ఎకరానికి ఏటా రూ. 10 వేల వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షానికి, నేలకు తగిన విత్తనాల ఎంపిక, నిల్వ, వినియోగం తదితర అనేక విషయాల్లో వీరి జ్ఞానం అమోఘం. ఈ జ్ఞానాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించాలి. రైతుల జ్ఞానం ఆధారంగా వ్యవసాయ విధానాల రూపకల్పన జరగాలి. మన దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభానికి ఇదే పరిష్కారం..’ అన్నారు ‘సెస్‌’ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సురేష్‌రెడ్డి.

‘పొలంలో ఒకే పంట పెడితే పండొచ్చు, పండకపోవచ్చు. మేం గవర్నమెంటు ఎరువు, కరెంటు, బోర్లపైన ఆధారపడటం లేదు. ఒకే పొలంలో 25 పంటలు పెడుతున్నం. కొన్ని పంటలు రాకపోయినా కొన్ని వస్తయి. తిండి కొనుక్కోవాల్సిన పని లేదు. పత్తి పెట్టిన రైతులు అప్పులై చచ్చిపోతున్నరు. మాకు అప్పులు అవసరం లేదు. మేం చచ్చిపోవాల్సిన అవసరమే రాదు..’ అని రైతు మొగలమ్మ చెప్పింది.
‘ఈ నివేదిక చాలా బాగుంది. రైతులు ఎదుర్కొంటున్న  సమస్యలన్నిటికీ ఇందులో సమాధానాలున్నాయి. డీడీఎస్‌ మహిళా రైతులకున్న ఆత్మస్థయిర్యం, సంతోషం చాలా గొప్పది. రైతులకేమీ తెలీదు మనకే తెలుసు అని శాస్త్రవేత్తలు అనుకోకూడదు..’ అన్నారు ‘మేనేజ్‌’ డీజీ డా. ఉషారాణి.

‘వాతావరణ మార్పులు, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆలోచించదగిన నివేదిక ఇది. 30 ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ పద్ధతిలో గొప్ప గుణాలను ప్రాచుర్యంలోకి తేవటం హర్షణీయం. నేనూ కొర్రలూ, జొన్నలూ తింటూ ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రైతుల జ్ఞానాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలి..’ అన్నారు ఎన్‌.ఐ.ఆర్‌.డి. డీజీ డా. డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి.

వారాంతాల్లో డీడీఎస్‌ మహిళా రైతుల పొలాల్లోనే శిక్షణ
జహీరాబాద్‌ ప్రాంతంలో డీడీఎస్‌ సెంటర్‌ ఫర్‌ అగ్రోఎకాలజీ (పచ్చశాల) ఆధ్వర్యంలో మహిళా రైతులు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ప్రకృతి సిద్ధమైన ఆకుకూరలు, ఔషధ మొక్కల మిశ్రమ సేంద్రియ సాగు, పెరటి తోటల సాగు పద్ధతులపై రైతులు, నగరవాసులకు వారాంతాల్లో (శని, ఆదివారాల్లో) తమ పొలాల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సు 24 వారాల పాటు కొనసాగుతుంది. వసతి, మిల్లెట్‌ భోజనాలతో కలిపి బోధనా రుసుము 24 వారాలకు రూ. 12 వేలు, 12 వారాలకు రూ. 10 వేలు, 6 వారాలకు రూ. 6 వేలు. ఆసక్తి గల వారు ఆగస్టు 10 లోగా రిజిస్టర్‌ చేసుకోవాలి.  https://forms.gle/Ca2eHv6SGLJ5y2JX7F  మొబైల్‌:77992 21500

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement