crop change
-
పంటలు మార్చండి, లాభాలు పొందండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బంది పడే కంటే రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. వరికి ప్రత్యామ్నాయమే మేలు అని, తెలంగాణ రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, మినుములు, పత్తి, పెసర్లు, శనగల వంటి పంటలు సాగు చేయాలని చెప్పారు. పంట మార్పిడి విధానం అవలంబించి అధిక దిగుబడులు, లాభాలు గడించాలన్నారు. గద్వాల ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మరణించిన నేప థ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన గురువారం గద్వాలకు వచ్చారు. రోడ్డు మార్గంలో బస్సులో వచ్చిన సీఎం.. ముందుగా ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగుపయనంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన సాగు చేస్తున్న మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. రైతులు, వ్యవసాయాధికారులతో ముచ్చటించారు. అదేవిధంగా కొత్తకోట మండల పరిధిలోని విలియంకొండ తండా రోడ్డు వద్ద కల్లంలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. అక్కడే రోడ్డు పక్కన పెద్దగూడేనికి చెందిన కౌలు రైతు గోకరి వెంకటయ్య సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. కొన్ని వేరుశనగ మొక్కలను భూమి నుంచి తీసి కాయల నాణ్యతను పరిశీలించారు. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని ముఖ్యమంత్రికి రైతు వెంకటయ్య వివరించారు. ఈ సందర్భంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని అక్కడే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సూచించారు. ముఖ్యమంత్రి అకస్మాత్తుగా చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. సీఎం వెంట రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు ఉన్నారు. కాన్వాయ్‌ని అడ్డుకునే యత్నం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కొత్తబస్టాండ్ దాటిన తర్వాత జాతీయ రహదారిపై సీఎం కాన్వాయ్‌ని స్థానిక బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించి కాన్వాయ్ సాఫీగా ముందుకు వెళ్లేలా చేశారు. మినుము రైతుతో సీఎం ముచ్చట సీఎం కేసీఆర్: మినుము పంట ఎందుకు వేశావు ? రైతు మహేశ్వర్‌రెడ్డి: నీళ్లు తక్కువ తీసుకుంటుంది. ఆరు తడి పంటల కింద వేశాను సర్. సీఎం: ఎన్ని రోజుల్లో చేతికొస్తది ? రైతు: 90 రోజుల్లో వస్తది. సీఎం: ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది ? రైతు: 8 నుంచి 12 క్వింటాళ్ల మధ్య వస్తది. సీఎం: పెట్టుబడి ఖర్చు ఎంతవుతది ? రైతు: మందులు, ఎరువులు, కూలీలు కలిపి మొత్తం ఖర్చు ఎకరాకు రూ.20 వేలు అవుతది. సీఎం: మార్కెట్లో ఎంత ధర పలుకుతోంది ? రైతు: ఎంఎస్పీ క్వింటాల్‌కు రూ.6,300 ఉంది. మార్కెట్లో రూ.8 వేలకు పైనే ఉంది సార్. సీఎం: అమ్మితే మీకు ఎంత మిగుల్తది ? రైతు: ఖర్చులు పోనూ రూ.20 వేలు మిగుల్తది. సీఎం: ఎక్కడెక్కడ మినుము వేస్తారు? రైతు: పెంచికలపాడు, ఈర్లదిన్నె, జనుంపల్లి, గుమ్మడం, యాపర్లలో ఎక్కువగా వేస్తారు సర్. -
పంటలు మారితే బతుకు బంగారం
రైతమ్మలు, రైతన్నలు, వ్యవసాయ కార్మికులు.. అష్టకష్టాలు పడి ఆరుగాలం చెమట చిందిస్తే.. ఆ తడితో మొలిచి పండిన గింజలే మనందరి ఆకలి తీరుస్తున్నాయి.అందుకు అన్నదాతకు ప్రతి ముద్దకూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దొరికీ దొరకని సాయంతో.. నిండీ నిండని డొక్కలతో.. చిన్నా చితకా కమతాల్లో నేలతల్లినే నమ్ముకొని మొక్కవోని మనోబలంతో ముందడుగేసే మట్టి మనుషులందరికీ నిండు మనసుతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతోంది ‘సాగుబడి’. ప్రకృతి మాత కనుసన్నల్లో సాగే వ్యవసాయంలో కష్టనష్టాలు.. ఒడిదొడుకులెన్నో. జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయిన 2018 మనకు అందించిన మార్గదర్శనం చేసే ఊసులను స్మరించుకుంటూ.. ప్రకృతికి ప్రణమిల్లుతూ.. సరికొత్త ఆశలతో ముందడుగు వేద్దాం! భారతీయుల్లో 30 శాతం మందికి రక్తహీనత ఉంది. భూతాపోన్నతి వల్ల చాలా ప్రాంతాల్లో సాగు నీటి కొరత తీవ్రంగా ఉంది. వర్షపాతం తగ్గిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ రైతులు వరి, గోధుమ పంటలను వదిలి... మొక్కజొన్న, చిరుధాన్య పంటలు సాగు చేయడం ప్రారంభిస్తే సాగు నీటి బాధలు 33% తీరిపోతాయని ఒక ముఖ్య అధ్యయనం(2018) తేల్చింది. అంతేకాదు, పౌష్టికాహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవచ్చని అమెరికాకు చెందిన ఎర్త్ ఇన్స్టిట్యూట్, కొలంబియా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా చేసిన అధ్యయనం తేల్చింది. 1996–2009 మధ్యకాలంలో ధాన్యం ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఎంత నీరు ఖర్చయిందో లెక్కగట్టారు. వరి సాగుకు అత్యధికంగా సాగు నీరు ఖర్చవుతోంది. వరికి బదులు మొక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాలు సాగు చేస్తే సాగు నీరు ఆదా కావడమే కాకుండా.. ఐరన్ (27%), జింక్ (13%) వంటి పోషకాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ‘సైన్స్ అడ్వాన్సెస్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం విశ్లేషించింది. అన్ని జిల్లాలకూ ఒకే పరిష్కారం కుదరదు. ప్రతి జిల్లా స్థితిగతులను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించాలి అని కొలంబియా యూనివర్సిటీ ఎర్త్ ఇన్స్టిట్యూట్కి చెందిన కైలె డావిస్ అంటున్నారు. అధిక నీటిని వాడుకుంటూ అధిక ఉద్గారాలను వెలువరిస్తున్న వరికి బదులు.. అంతకన్నా పోషక విలువలున్న, కొద్దిపాటి నీటితో పండే మిల్లెట్స్‌ను పండించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలందరికీ అందించవచ్చు. వీటిని సేంద్రియంగానే పండించవచ్చు అని ఆయన అంటున్నారు. 2018ని భారత్ జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. -
సేంద్రియ మారాణి!
వాంకుడోతు మారోణి.. తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల గిరిజన తండా ఆమె ఊరు. చదువు లేదు. అయినా, గుండెల నిండా చైతన్యం నింపుకున్న రైతు. సేంద్రియ వ్యవసాయం చేస్తుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటూ పాటిస్తుంది. తాను, తన కుటుంబం పచ్చగా ఉండటంతోపాటు.. తోటి రైతులు కూడా చల్లగుండాలనుకుంటుంది. అందుకోసం తమ తండాలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసింది. శక్తి మేరకు కష్టపడటంతో పాటు దేవుడి దయ కూడా కావాలనుకొంటుంది. అందుకే వాళ్ల రైతు సంఘానికి బాలాజీ పేరు పెట్టుకుంది. రోజుకు ముప్పూటా ఇంటిల్లిపాదీ తినే పచ్చజొన్న, కొర్ర, శ్రీవరితోపాటు ఒకటికి నాలుగు తిండి పంటలతో పాటు కొంత మేరకు పత్తి వేస్తుంటుంది. పోయిన సీజన్లో ఎకరం పత్తి పెట్టి.. నానా బాధలు పడి ఖర్చులు రాబట్టుకుంది. కానీ, తన కష్టం వృథా పోయిందని, రూ. 20 వేల వరకు నష్టం వచ్చిందని అంటుంది. అందుకే, ఈసారి మాత్రం పత్తి పెట్టనని తెగేసి చెబుతోంది.. చిన్నపాటి మహిళా రైతు మరోణి! వాంకుడోతు మారోణిది దయ్యబండ అనే తండా. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉంది ఆ తండా. చిన్న రైతు కుటుంబం ఆమెది. భర్త పేరు చిన్న రాములు. ఇద్దరు కుమారులు. ఓ కూతురు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పెద్ద కొడుకు, కోడులు వేరు కాపురం ఉంటున్నారు. చిన్న కొడుకు, కోడలితో పాటు కలిసి ఉంటూ మారోణి ఒడుపుగా వ్యవసాయం చేస్తున్నది. మొదట్లో ఎడ్లబండిపై భర్తతో కలిసి ఊరూరూ తిరిగి చెరకు నరకడం, కొన్నాళ్లు ఊళ్లకు వెళ్లి సీతాఫలాలు, ఉప్పు అమ్మటం అలవాటుగా ఉండేది. భర్తకు కంటి చూపు మందగించటంతో గత కొద్ది ఏళ్లుగా తండాలోనే స్థిరంగా ఉంటూ.. వ్యవసాయం చేస్తున్నారు. దయ్యబండ తండా మహిళా గిరిజన రైతులు పిలుపు స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేంద్రియ, శ్రీవరి సాగు పద్ధతులను అలవరచుకొని ముందడుగు వేస్తున్నారు. పచ్చజొన్న రొట్టె.. గటక.. మారోణి కుటుంబానికి సొంతం రెండెకరాల కుష్కి(మెట్ట), ఒక ఎకరం తరి(మాగాణి) పొలం ఉంది. మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. మారోణి ఈ సంవత్సరం పది క్వింటాళ్ల మొక్కజొన్నలు, క్వింటన్నర కందులు, 4 క్వింటాళ్ల పచ్చజొన్నలు పండించింది. ఎన్ని పండినా పచ్చజొన్నలు మాత్రం అమ్మరు. ఇంట్లో పిల్లా పెద్దా అందరూ మూడు పూటలా జొన్న రొట్టె తింటారు. గటక తాగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. పొలం పనులు చాలా వరకు సొంతంగానే చేసుకుంటారు. 3 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. ఎకరానికి ఏటా రూ. 10 వేలు కౌలు. బోరులో నీరు తక్కువ ఉండటంతో ఎకరంన్నరలో శ్రీవరి సాగు చేసింది. పంట చేతికి రాబోతుండగా రాళ్లవాన, గాలిదుమారం వచ్చి.. 40 బస్తాల ధాన్యం రాలటంతో.. 30 బస్తాల ధాన్యమే చేతికొచ్చింది. ‘ఎకరంలో పత్తి పెడితే.. పెట్టుబడి తిరిగి రావడమే కష్టమైంది. తమ కష్టం వృథా అయ్యింది. ఆ మేరకు రూ. 20 వేలు నష్టం వచ్చింది. ఈసారి మొక్కజొన్న, కందులు, కొర్రలు, సజ్జలు, శ్రీవరి పెడతా. పత్తి పెట్టేది లేద’ని మారోణి తేల్చి చెప్పారు. రైతు సంఘాలు.. విత్తన బ్యాంకు.. తండాలో రైతులు 20 మంది చొప్పున రెండు సంఘాలు పెట్టుకున్నారు. బాలాజీ రైతు సంఘం పెట్టుకొని నాలుగేళ్లు అయింది. వీటిల్లో సభ్యులు చాలా వరకు గిరిజన మహిళా రైతులే. మొదట్లో నెలకు తలకు రూ.50 మదుపు చేసేవారు. ఇప్పుడు రూ. 100 జమ చేస్తున్నారు. తొలకరికి రైతుకు రూ. 10 – 20 వేల వరకు అప్పు ఇస్తున్నారు. వందకు నెలకు రూ.1 వడ్డీ. నెలకు రూ.వెయ్యి/రెండు వేలు తిరిగి కట్టేస్తున్నారు. తోటి మహిళా రైతులతో సంఘం సమావేశం నిర్వహిస్తున్న మారోణి కాలం సరిగ్గా లేకపోవటమో, పంటలు సరిగ్గా పండకపోయినప్పుడు అప్పు ఎలా కడతారు? అనడిగితే.. ‘అట్లేం లేదు సారూ. ఏదో కష్టం చేస్తం. ఇంటికాడ ఉంటమా. సంఘం పెట్టుకున్న తర్వాత తెలివి వచ్చింది. అటూ ఇటూ మీటింగులకు వెళ్లి రావటం వల్ల విత్తనాలు వచ్చినై. విత్తన బ్యాంకు పెట్టినం. ఇప్పుడు మా దగ్గర తైదలు, కొర్రలు, సజ్జలు, పచ్చజొన్నలు, ఎర్రకందులు, తెల్లకందులు, అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఉన్నయి. సంఘం సభ్యులకు కిలో విత్తనాలు ఇస్తే వచ్చే సంవత్సరం రెండు కిలోలు తిరిగి ఇస్తరు. వేరే ఊరోళ్లకైతే జొన్న విత్తనాలు కిలో రూ. 60కి, కందులు రూ.150కి.. అమ్ముతున్నం.. సంఘం వచ్చినంక జర మంచిగనే ఉంది..’ అంటున్నారు మారోణి. మేలైన, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్న మారోణిని మా మంచి రాణిగా తోటి రైతులు ప్రశంసిస్తున్నారు. స్వయంగా కౌలు రైతు కూడా అయిన మారోణి కౌలు రైతుల హక్కుల సాధన కోసం పోరాడుతున్నారు. ఇందిరాగాంధీ శ్రమ శక్తి అవార్డును గత ఏడాది మారోణి స్వంతం చే సుకోవడం ఎంతైనా సముచితం. కౌలు రైతులకు న్యాయం ఎక్కడ? వరి సాగులో శ్రీ పద్ధతిని అనుసరించడం, అదేవిధంగా అధిక లాభాలు అందించే చిరుధాన్యాలు, కంది వేస్తున్నాను. పంట మార్పిడితో మంచి దిగుబడులు సాధించాను. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపడం వల్ల చీడపీడల నుంచి రక్షణతో పాటుగా పంట దిగుబడి నూటికి నూరు శాతం పెరిగింది. వ్యవసాయం, పాడి గేదెల పెంపకం రెండూ లాభసాటిగా ఉన్నాయి. మహిళా రైతులు కూడా మంచి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఒకటికి నాలుగు రకాల పంటలు పండిస్తే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే, పంట నష్టపోయినా పరిహారం రావటం లేదు. మా వరి ధాన్యం సగానికి పైగా రాలిపోయింది. అధికారులు వచ్చి రాసుకున్నారు. అయినా రూపాయి రాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వటం లేదు. ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి సహాయం కూడా ప్రభుత్వం భూమి యజమానికే ఇస్తున్నది. కౌలు రైతులకు న్యాయం జరగటం లేదు. వాంకుడోతు మారోణి (95530 35321), దయ్యబండ తండా,తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా – టీవీ రమణాకర్, సాక్షి,తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా -
పంట మార్పిడికి పక్కాప్రణాళిక
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వేరుశనగలాంటి ఒకే పంట విధానానికి స్వస్తి పలికేందుకు పంట మార్పిడిని ప్రోత్సహించేలా గ్రామస్థాయిలో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక(విలేజ్ యాక్షన్‌ప్లాన్) తయారు చేయాలని జాయింట్ కలెక్టర్ - 2 ఖాజామొహిద్దీన్ సూచించారు. స్థానిక కృష్ణ కళామందిరంలో గురువారం వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అధ్యక్షతన విలేజ్ యాక్షన్ప్లాన్పై అనంతపురం, ఉరవకొండ వ్యవసాయ డివిజన్ల ఏడీఏ, ఏవో, ఏఈవో, ఎంపీఈవోలతో సమావేశం నిర్వహించారు. అందులో జేసీ - 2 మాట్లాడుతూ వేరుశనగ విస్తీర్ణాన్ని బాగా తగ్గించి దాని స్థానంలో ఇతర పంటలు సాగుచేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా ఐదారు రకాల పంటలు వేస్తే ఏదో ఒకటి చేతికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా కేవలం వేరుశనగ పంటను నమ్ముకోవడం వËల్లే ఏటా రైతులు నష్టపోతున్నారని అన్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ వేరుశనగ పంటను ప్రోత్సహిస్తూనే చిరుధాన్యాలు, నవధాన్యపు, పప్పుధాన్యపు పంటలను సాగులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంట మార్పిడిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఆత్మ పీడీ డాక్టర్ పెరుమాళ్ల నాగన్న, ఇతర అధికారులు, డాట్ సెంటర్, కేవీకే, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.