స్ఫూర్తి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది.
కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.
‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.
‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.
పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.
‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.
మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల.
నాన్న చెప్పిన మాట
‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న!
– బిర్రు బాలకిషన్,
సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment