
రెవెన్యూ కార్యాలయం ఆవరణలో కర్రతో మహిళా రైతు
సాక్షి, ములుగు: ములుగు మండలం పత్తిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపల్లికి చెందిన మహిళా రైతు కాశిరాజు రమ శనివారం ములుగు రెవెన్యూ కార్యాలయ ఆవరణలో హల్‌చల్ చేసింది. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బంధువులతో కలిసి చేతిలో కర్ర పట్టుకుని రెవెన్యూ అధికారులను ఉద్దేషిస్తూ అసభ్య పదజాలంతో దుర్భషలాడింది. నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నా తనకు చెందిన భూమికి పట్టా ఇవ్వడం లేదని మండిపడింది.
అనంతరం కర్రతో వీఆర్వో తిరుపతితో పాటు ఇతరుల ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసింది, గమనించిన రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు రెవెన్యూ కార్యాలయాలనికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆమెను బంధువులు తీసుకెళ్లారు. కాగా, ఈ విషయమై పత్తిపల్లి వీఆర్వో తిరుపతిని వివరణ కోరగా మహిళా రైతు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆమె చెబుతున్న సర్వే నెంబర్‌లో ఆ పేరుతో సెంటుభూమి లేదని, ఆమె తండ్రికి ఎకరం భూమి ఉన్నా అమ్ముకున్నారని పేర్కొన్నారు.