land pass book
-
సర్వేశ్వర నేత్రం.. పరిష్కారం కానున్న భూ వివాదాలు
సాక్షి, నరసరావుపేట: దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళించి, రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష రీసర్వే పల్నాడు జిల్లాలో జోరుగా సాగుతోంది. చెదలు పట్టిన భూ రికార్డులు, ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో అడ్డూఅదుపూలేని అక్రమాలు ఓ వైపు, న్యాయపరమైన చిక్కులు మరోవైపు. వీటన్నింటికీ పరిష్కారం చూపి రైతులు భూవివాదాల నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం భూ స్వచ్ఛీకరణకు రీ సర్వే ద్వారా శ్రీకారం చుట్టింది. సర్వే తర్వాత ప్రతి రైతుకూ హద్దులు నిర్ణయించడంతోపాటు రాళ్లను పాతి ప్రత్యేక నంబర్లను కేటాయించనుంది. 1904 తర్వాత... ఆంగ్లేయుల పాలనలో 1904లో చివరి సారిగా పూర్తి స్థాయిలో భూ సర్వే జరిపి రికార్డులు పొందుపరిచారు. ప్రతి 30 ఏళ్లకు ఓసారి సర్వే అండ్ రీ సెటిల్మెంట్ జరగాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో చేయలేదు. రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టేలా రికార్డుల స్వచ్ఛీకరణతోపాటు భూ రీసర్వేకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో దశాబ్దాలుగా ఉన్న భూ చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. డ్రోన్ల ద్వారా సర్వే.. రాళ్లతో హద్దులు సర్వే చేపడుతున్న గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రికార్డులను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మొదటగా డ్రోన్ కెమెరాలతో పాయింట్లను గుర్తిస్తున్నారు. ఆ పాయింట్లు, రోవర్ ఆధారంగా పొలాల్లోకి దిగి మాన్యువల్ సర్వే చేపడుతున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు హద్దులు గుర్తించి రాళ్లు పాతుతున్నారు. ప్రస్తుతం 10 వేల హద్దు రాళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని అక్టోబర్ 15నాటికి పాతనున్నారు. 26 గ్రామాల్లో కొత్త హక్కుపత్రాలు జిల్లాలో ల్యాండ్ అండ్ సర్వే అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు సమన్వయంతో సర్వే ప్రక్రియ చేపడుతున్నారు. మొదటి దశలో జిల్లాలో 81 రెవెన్యూ గ్రామాల్లో 1,98,680 ఎకరాలను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,38,024 ఎకరాల సర్వే పూర్తయింది. తొలివిడతగా 26 గ్రామాల్లోని 7,145 మంది రైతులకు అక్టోబర్ 2 నుంచి కొత్త హక్కు పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో రెండు డ్రోన్లు, 51 రోవర్ల సహాయంతో రీ సర్వే జరుగుతోంది. 300 మంది విలేజ్ సర్వేయర్లను పది బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికీ ఓ సర్వేయర్, ముగ్గురు డెప్యూటీ సర్వేయర్లు పనిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో స్వచ్ఛీకరణ వందేళ్ల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో భూముల రీ సర్వే జరుగుతోంది. ఎవరు సాగు చేస్తున్నారు, హద్దులేంటి, ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న విషయాలను సమగ్రంగా పరిశీలించి రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నాం. పూర్తి పాదర్శకంగా, వివాదాలు పరిష్కారమయ్యేలా సర్వే జరుగుతోంది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో భూ సర్వే పూర్తికావడానికి 3, 4 నెలలు పడుతోంది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్టోబర్ 2 నుంచి క్యూఆర్ కోడ్ కలిగిన భూహక్కు పత్రాలు, మ్యాప్‌లను రైతులకు అందజేయనున్నాం. ఆయా గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లోనే భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. – శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా -
పాస్ పుస్తకం ఇవ్వడం లేదని టవర్ ఎక్కిన వ్యక్తి
సాక్షి, మెదక్ : తన భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ ఇవ్వడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లంబాడి కిషన్ అనే వ్యక్తిని సంవత్సర కాలం నుచి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎమ్మార్వో భిక్షపతి కనీనం కనికరం లేకుండా దురుసుగా మాట్లాడారని, తన పాస్ పుస్తకం రాబట్టుకోడానికి వేరే మార్గం కనిపించకనే టవర్ ఎక్కినట్లు బాధితుడు కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఎమ్మార్వో పాస్ పుస్తకం ఇస్తానని హామీ ఇచ్చినా, కిషన్ మాత్రం విద్యుత్ టవర్ దిగడం లేదు. -
రెవెన్యూ కార్యాలయంలో మహిళా రైతు హల్చల్
సాక్షి, ములుగు: ములుగు మండలం పత్తిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపల్లికి చెందిన మహిళా రైతు కాశిరాజు రమ శనివారం ములుగు రెవెన్యూ కార్యాలయ ఆవరణలో హల్చల్ చేసింది. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బంధువులతో కలిసి చేతిలో కర్ర పట్టుకుని రెవెన్యూ అధికారులను ఉద్దేషిస్తూ అసభ్య పదజాలంతో దుర్భషలాడింది. నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నా తనకు చెందిన భూమికి పట్టా ఇవ్వడం లేదని మండిపడింది. అనంతరం కర్రతో వీఆర్వో తిరుపతితో పాటు ఇతరుల ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసింది, గమనించిన రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు రెవెన్యూ కార్యాలయాలనికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆమెను బంధువులు తీసుకెళ్లారు. కాగా, ఈ విషయమై పత్తిపల్లి వీఆర్వో తిరుపతిని వివరణ కోరగా మహిళా రైతు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆమె చెబుతున్న సర్వే నెంబర్లో ఆ పేరుతో సెంటుభూమి లేదని, ఆమె తండ్రికి ఎకరం భూమి ఉన్నా అమ్ముకున్నారని పేర్కొన్నారు. -
ప్రవాసీలకు త్వరలోనే పట్టాలు!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్రానికి చెందిన ఎన్నారైలకు ఊరట లభించింది. ఆధార్ కార్డులు లేకపోవడంతో భూమి పట్టాల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం దొరికింది. విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు ఆధార్ మంజూరీలో ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారత్‌కు వచ్చే ఎన్నారైలకు పాస్‌పోర్టుల సాయంతో తక్షణమే ఆధార్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆధార్ కోసం 180 రోజులు వేచి చూడకుండా.. సాధ్యమైనంత త్వరగా వీటిని మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఎన్నారైలకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి మార్గం సుగమమైంది. ప్రవాసీలకు ఆధార్ కార్డు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కొత్త పాస్ పుస్తకాలను జారీ చేసిన రాష్ట్ర సర్కార్.. వీటికి ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసింది. అంతేగాకుండా నేరుగా భూ యజమానే రావాలని షరతు విధించింది. దీంతో స్వదేశానికి వచ్చినా.. ఆధార్ లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. దీనిపై కలెక్టరేట్ల చుట్టూ ఎన్నారైలు ఎన్ని చక్కర్లు కొట్టినా.. ప్రభుత్వం పరిష్కార మార్గం చూపకపోవడంతో నిరాశతోనే వెనుదిరిగారు. లక్షకు పైగా మందికి ఉపశమనం ప్రవాసీలకు ఆధార్ కార్డు ఇవ్వాలనే నిర్ణయంతో లక్షకు పైగా మందికి ఉపశమనం కలగనుంది. ఎన్నారైలుగా ఉండి ఆధార్ కార్డు కలిగి ఉండటం నేరం కనుక.. అధిక శాతం మందికి ఈ కార్డుల్లేవు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయంతో విదేశాల్లో గణనీయంగా ఉన్న మన రాష్ట్ర వాసులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇంకా పెండింగ్‌లో ఉండగా.. ఇందులో 1.05 లక్షల వరకు ఎన్నారైలకు సం బంధించినవే ఉన్నాయని అధికారవర్గాలు చెబు తున్నాయి. ఆధార్ కార్డుల పొందిన వెంటనే వీరూ త్వరలోనే పట్టాలు పొందనున్నారు. -
రద్దుకానున్న పాసుపుస్తకం..?
ఇబ్బందులు తప్పవని పలువురి అభిప్రాయం ఉదయగిరి: రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరుగుతోందని, దీనిని నివారించేందుకు పాస్ పుస్తకం రద్దు ఒక్కటే మార్గమని ప్రస్తుత ప్రభుత్వం పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్‌ను రద్దుచేసేందుకు చేస్తున్న కసరత్తు అసలుకే ముప్పుగా పరిణమించే పరిస్థితి నెలకొంది. రెవెన్యూలో అవినీతిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం ఏమిటని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎలుక పడితే ఇంటికే నిప్పు పెట్టుకున్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేవీ క్రిష్ణమూర్తి రాష్ట్రంలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి పాస్‌పుస్తకాలు, టైటిల్డీడ్లను రద్దుచేసే యోచన విషయమై సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూలో ప్రతి చిన్న పనికి పెద్ద మొత్తంలో లంచాలు పిండేస్తూ కార్యార్థుల్ని ఇబ్బందిపెడుతున్నందున అతి ముఖ్యమైన పట్టాదారు పాస్‌పుస్తకాల జారీనే రద్దుచేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలియజేశారు. దీనిని వీలైనంత త్వరగా అమలులోకి తేవాలని కూడా ఆయన సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్డీడ్లు రద్దుచేసి ‘మనభూమి’ వెబ్సైట్లో ఉండే భూమి హక్కుదారులకు టెన్-1, అడంగళ్ కాపీలు ఆధారంగా బ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని తెలియజేశారు. ఇంతవరకు బాగానేవున్నా దీంతో తలెత్తే సమస్యలపై మాత్రం సమావేశంలో చర్చించలేదు. మంత్రి చెప్పిన మాటలనే తాపీగా విన్న జాయింట్ కలెక్టర్లు తాపీగా సమావేశం నుంచి వచ్చేశారు. పొంచిఉన్న ప్రమాదం: ప్రభుత్వం మనభూమి వెబ్సైట్లో భూమి హక్కుదారుల పేర్లు ఉంటాయి. వాటి ఆధారంగా రెవెన్యూకు ఎలాంటి సంబంధం లేకుండా హక్కు పత్రాలను పొందవచ్చని చెబుతోంది. దీంతో అధికారులకు లంచం ఇవ్వవలసిన అవసరం ఉండదనేది ప్రభుత్వం వాదన. మనభూమి వెబ్సైట్లో భూమి హక్కుదారులపేర్లు లేకుంటే ఒకసారి నమోదు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వ పెద్దల యోచన. అయితే ఆచరణలో ఇది అనుకున్నంత తేలిక కాదని అటు అధికారులు, ఇటు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వెబ్సైట్లో పేర్లను తారుమారు చేయడం పెద్ద సమస్యేమీ కాదని అధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న విధానంలో పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్డీడ్తో పాటు మీసేవలో టెన్-1, అడంగళ్ హక్కుదారుడుకు ఉంటాయి. కొత్త విధానంలో కేవలం అడంగళ్, టెన్-1 మాత్రమే ఉంటాయి. ఈరోజు ఒక సర్వే నంబరుకు సంబంధించి ఒకరి పేరుంటే మరుసటి రోజు అదే సర్వే నంబరులో వేరే వారి పేరు ఉండే అవకాశముంది. అప్పుడు భూసమస్య ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చు. పైగా మీసేవలో ప్రైవేటు వ్యక్తులు ఆపరేటర్లుగా ఉండటంతో పేర్లు తారుమారు పెద్ద సమస్య కాదని అధికారులే చెబుతున్నారు. పైగా ప్రభుత్వ భూమికి కూడా టెన్-1 అడంగళ్ పొందే అవకాశం ఉంది. దీని ఆధారంగా కూడా బ్యాంకులు రుణాలు తీసుకునే అవకాశముంది. ప్రస్తుత విధానంలో రెవెన్యూలో ఏ అధికారీ బాధ్యులుగా ఉండే అవకాశం లేకపోవడంతో భూసమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని ఓ ఆర్డీవో వ్యాఖ్యానించడం విశేషం. ఇంతటి ప్రాధాన్యత గల వ్యవహారంలో ప్రభుత్వం పిల్లచేష్టలుగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ప్రభుత్వం టైటిల్‌డీడ్, పాస్‌పుస్తకాల రద్దు యోచనను పునఃసమీక్షించాలని పలువురు అధికారులు, రైతులు కోరుతున్నారు.