రద్దుకానున్న పాసుపుస్తకం..?
ఇబ్బందులు తప్పవని పలువురి అభిప్రాయం
ఉదయగిరి: రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరుగుతోందని, దీనిని నివారించేందుకు పాస్ పుస్తకం రద్దు ఒక్కటే మార్గమని ప్రస్తుత ప్రభుత్వం పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్‌ను రద్దుచేసేందుకు చేస్తున్న కసరత్తు అసలుకే ముప్పుగా పరిణమించే పరిస్థితి నెలకొంది. రెవెన్యూలో అవినీతిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం ఏమిటని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎలుక పడితే ఇంటికే నిప్పు పెట్టుకున్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపిస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేవీ క్రిష్ణమూర్తి రాష్ట్రంలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లను రద్దుచేసే యోచన విషయమై సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూలో ప్రతి చిన్న పనికి పెద్ద మొత్తంలో లంచాలు పిండేస్తూ కార్యార్థుల్ని ఇబ్బందిపెడుతున్నందున అతి ముఖ్యమైన పట్టాదారు పాస్‌పుస్తకాల జారీనే రద్దుచేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలియజేశారు.
దీనిని వీలైనంత త్వరగా అమలులోకి తేవాలని కూడా ఆయన సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లు రద్దుచేసి ‘మనభూమి’ వెబ్‌సైట్‌లో ఉండే భూమి హక్కుదారులకు టెన్-1, అడంగళ్ కాపీలు ఆధారంగా బ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని తెలియజేశారు. ఇంతవరకు బాగానేవున్నా దీంతో తలెత్తే సమస్యలపై మాత్రం సమావేశంలో చర్చించలేదు. మంత్రి చెప్పిన మాటలనే తాపీగా విన్న జాయింట్ కలెక్టర్లు తాపీగా సమావేశం నుంచి వచ్చేశారు.
పొంచిఉన్న ప్రమాదం: ప్రభుత్వం మనభూమి వెబ్‌సైట్‌లో భూమి హక్కుదారుల పేర్లు ఉంటాయి. వాటి ఆధారంగా రెవెన్యూకు ఎలాంటి సంబంధం లేకుండా హక్కు పత్రాలను పొందవచ్చని చెబుతోంది. దీంతో అధికారులకు లంచం ఇవ్వవలసిన అవసరం ఉండదనేది ప్రభుత్వం వాదన. మనభూమి వెబ్‌సైట్‌లో భూమి హక్కుదారులపేర్లు లేకుంటే ఒకసారి నమోదు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వ పెద్దల యోచన. అయితే ఆచరణలో ఇది అనుకున్నంత తేలిక కాదని అటు అధికారులు, ఇటు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్‌లో పేర్లను తారుమారు చేయడం పెద్ద సమస్యేమీ కాదని అధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న విధానంలో పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్‌తో పాటు మీసేవలో టెన్-1, అడంగళ్ హక్కుదారుడుకు ఉంటాయి.
కొత్త విధానంలో కేవలం అడంగళ్, టెన్-1 మాత్రమే ఉంటాయి. ఈరోజు ఒక సర్వే నంబరుకు సంబంధించి ఒకరి పేరుంటే మరుసటి రోజు అదే సర్వే నంబరులో వేరే వారి పేరు ఉండే అవకాశముంది. అప్పుడు భూసమస్య ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చు. పైగా మీసేవలో ప్రైవేటు వ్యక్తులు ఆపరేటర్లుగా ఉండటంతో పేర్లు తారుమారు పెద్ద సమస్య కాదని అధికారులే చెబుతున్నారు. పైగా ప్రభుత్వ భూమికి కూడా టెన్-1 అడంగళ్ పొందే అవకాశం ఉంది. దీని ఆధారంగా కూడా బ్యాంకులు రుణాలు తీసుకునే అవకాశముంది.
ప్రస్తుత విధానంలో రెవెన్యూలో ఏ అధికారీ బాధ్యులుగా ఉండే అవకాశం లేకపోవడంతో భూసమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని ఓ ఆర్డీవో వ్యాఖ్యానించడం విశేషం. ఇంతటి ప్రాధాన్యత గల వ్యవహారంలో ప్రభుత్వం పిల్లచేష్టలుగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ప్రభుత్వం టైటిల్‌డీడ్, పాస్‌పుస్తకాల రద్దు యోచనను పునఃసమీక్షించాలని పలువురు అధికారులు, రైతులు కోరుతున్నారు.