
సాక్షి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పేరుగావించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ మేరకు శనివారం సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.
కాగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలోనే వచ్చే భక్తులు ప్రస్తుతం ఏడాది పొడవునా తమకు అనుకూలమైన సమయంలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు రావడంతో అడవి అంతా జనసంద్రమవుతుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.