నేటి నుంచే మినీ జాతర
మినీ జాతరకు ‘మేడారం’ ముస్తాబైంది.. విద్యుద్దీపాలతో సమ్మక్క-సారలమ్మ తల్లుల గద్దెలను అందంగా అలంకరించారు.. బుధవారం నుంచి శనివారం వరకు దారులన్నీ భక్తులతో కిక్కిరిసి పోనున్నారుు.. పది రోజుల ముందు నుంచే వేల సంఖ్యలో భక్తులు మొక్కులు
చెల్లిస్తున్నారు.. మంగళవారం ఒక్కరోజే ఐదు వేల మంది దర్శించుకున్నారు.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఎత్తు ‘బంగారం’ సమర్పించారు.. తలనీలాలు ఇచ్చుకున్నారు.. శివసత్తులు పూనకాలతో ఊగారు.. ఈ నాలుగు రోజులు సందడి నెలకొననుంది..
- ములుగు/తాడ్వారుు
మేడారం (తాడ్వాయి): మహా జాతర జరిగిన సరిగ్గా ఏడాది తర్వాత మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం మండమెలిగే పండుగతో మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రా రంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచే భక్తుల రాక పెరిగింది. భక్తులతో జంపన్నవాగు పులకించిపోరుుంది. ఒక్కరోజే సుమా రు 5 వేల మంది అడవి తల్లులను దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారుు. జాతర పరిసరాల్లో దుకాణాలు వెలి శారుు. భక్తులు చీరసారెలు, వనదేవతలకు ఇష్టమైన బంగారాన్ని (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు ఇలా...
బుధవారం సమ్మక్క గుడిని పూజారులు శుద్ధి చేస్తారు. ఆడపడుచులు పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి సమ్మక్క గద్దెను అలంకరిస్తారు. అనంతరం దుష్టశక్తులు ప్రభావం చూపకుండా మేడారంలోని రెండు ప్రధాన రహదారుల పొలిమేరల్లో పూజారులు ధ్వజస్తంభాలు పాతి... రోడ్డుకు అడ్డంగా నీళ్లు ఆరగించి... మామిడాకుల తోరణాలు, కోడిపిల్లను కడతారు. అనంతరం సిద్దిబోయిన మునేందర్ ఇంటి నుంచి పసుపు, కుంకుమలతో గుడికి వెళ్లి సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆర్ధరాత్రి సమయంలో గుడి నుంచి ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను తీసుకుని డోలివాయిద్యాల నడుమ తల్లి గద్దెపై ప్రతిష్టిస్తారు. రాత్రంతా గద్దెలపై జాగారాలతో సంబరాలు జరుపుకుంటారు. గురువారం పొద్దుపొడవక ముందే గద్దెపై నుంచి తల్లిని గుడికి తీసుకొచ్చి పూజలు చేస్తారు.
అదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ గుడిలో బుధవారం ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు గుడిని శుద్ధి చేస్తారు. హడారాల కుండాలను పసుపు, కుంకుమలతో అలంకరించి ధూపదీపాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం పూజలు నిర్వహించిన ఆనంతరం రాత్రి సమయంలో పూజారులు సాక తీసుకుని మేడారం దేవతల గద్దెల వద్ద సమ్మక్క పూజరులకు సాకహనం ఇచ్చిపుచ్చుకుని వారితో కలిసి సంబరాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం కూడా సారలమ్మ గుడిలో పూజలు చేసి మేకపోతు బలిస్తారు. అనంతరం పూజారులు తమ ఇళ్లలో పూజలు చేయడంతో తంతు ముగుస్తుంది.