![Odisha Farmer Distributes Free Vegetables In Villages - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/5/photo.jpg.webp?itok=KVKwaQw4)
భువనేశ్వర్ : కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలవుతుండటంతో పలువురు ఉపాధి కోల్పోగా ఒడిషాలోని భద్రక్ జిల్లాలో ఓ మహిళ తమ పొలంలో సాగైన కూరగాయలను పేదలకు ఉచితంగా పంచి ఔదార్యం చాటుకున్నారు. ఛాయారాణి సాహు(57) అనే మహిళా రైతు, తన భర్త సర్వేశ్వర్‌తో కలిసి కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో పేద కుటుంబాలకు రెండు నుంచి మూడు కిలోల కూరగాయలను పంపిణీ చేశారు. ఐదు పంచాయితీల పరిధిలోని 15 గ్రామాల్లో 60 క్వింటాళ్లకు పైగా కూరగాయలను ఆమె పంపిణీ చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
ఇక కోవిడ్-19 విధుల్లో ఉన్న పోలీసులు, సెక్యూరిటీ గార్డుల కోసం ఈ రైతు దంపతులు 20 లీటర్ల పాలను అందచేశారు. మే 17న మూడో విడత లాక్‌డౌన్ ముగిసే వరకూ ఈ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. గత 20 ఏళ్లుగా తమకున్న ఏడెకరాల్లో ఛాయారాణి కూరగాయలను పండిస్తున్నారు. 22 ఆవులను పెంచుతూ డైరీని కూడా ఆమె నిర్వహిస్తున్నారు. దేశం కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో తాను తన వంతుగా ఈ సాయం చేస్తున్నానని ఛాయారాణి చెప్పుకొచ్చారు. కాగా ఆమె ఔదార్యాన్ని ప్రశంసిస్తూ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment