అన్నదాత మెడకు అప్పు ఉరి
పది మంది ఆత్మహత్య
* అందులో ఒకరు మహిళా రైతు
* ఇద్దరికి గుండెపోటు
సాక్షి నెట్‌వర్క్: వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు మెడకు అప్పుల ఉరి చుట్టుకుంటోంది. కాలం కలసి రాక.. సరైన గిట్టుబాటు ధర లేక దిగాలు పడుతున్న అన్నదాతపై అప్పుల భారం పెరుగుతుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. తెలంగాణ జిల్లాల్లో సోమవా రం పది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో ఒకరు మహిళా రైతు. మరో ఇద్దరు గుండెపోటుతో మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లికి చెందిన సప్పిడి మాసయ్య(38) పదకొండు ఎకరాల్లో పంటలు వేయడానికి సుమారు రూ. 10 లక్షల అప్పు చేశాడు.
వర్షాభావ పరిస్థితుల్లో పంటల దిగుబడి తగ్గింది. దీంతో అప్పులు తీరే మార్గం కనిపించక పురుగుల మందు తాగాడు. ఇదే జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన సాకలి జంగయ్య(46) తనకున్న ఎకరం 20 గుంటలతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంట ఎండి పోవడం, రూ. 3 లక్షల అప్పుల పాలవడంతో ఉరేసుకున్నాడు. బల్మూర్ మండలం చెన్నారంలో సంకెళ్ల చిన్నయ్య (60) ఐదు బోర్లులు వేసి అప్పులపాలై ఉరేసుకున్నాడు. మానవపాడు మండలం ఉండవెల్లికి చెందిన రైతు సుధాకర్ గౌడ్ మూడేళ్లుగా కందులు, పొగాకు పంటలు వేసి నష్టపోయాడు.
అప్పులపాలయ్యాడు. దీంతో ఈ నెల 17న తన పొలంలో గుళికల మందు మింగాడు. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన చింతల సత్యనారాయణ(44) తన రెండు ఎకరాల్లో గతేడాది నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. సాగు, కూతురు వివాహానికి కలిపి మొత్తం రూ. 7 లక్షల వరకు అప్పు చేశాడు. పంట ఎండిపోయింది. అప్పులు తీర్చలేక తన పొలం వద్ద ఉరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరుకు చెందిన తలారి మల్లేశ్(40) వ్యవసాయం కోసం ప్రైవేటుగా రూ. లక్ష, బ్యాంకులో రూ. 50 వేలు రుణం తీసుకున్నాడు.
అప్పు తీరే మార్గం కనిపించక ఆది వారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కు చెందిన రాథోడ్ దేవు(60) పత్తిపంట వర్షపు నీటిలో మునిగి పోయింది. దీంతో మన స్తాపం చెంది పురుగుల మందు తాగాడు. ఇదే జిల్లా సిర్పూర్(యూ) మండలం రాగాపూర్‌కు చెందిన చిక్రం నాగోరావు(55) పత్తి పంట వర్షాలకు నాశనం కావడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లికి చెం దిన రైతు లింగురాం(60) ఇంట్లో ఉరివేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు హన్మాల శివరాజయ్య(55) అప్పులు తీర్చలేక గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు.
విద్యుత్ తీగలు పట్టుకొని..
మెదక్ జిల్లా మనూరు మండలం తుమ్నూర్‌కు చెందిన రైతు పంచగామ విఠల్(35) అప్పులు పెరుగుతుండడంతో దిక్కుతోచని స్థితిలో విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విఠల్‌కు తనకున్న మూడు ఎకరాల్లో ఆరు బోర్లు వేయించాడు. అందులో ఐదు బోర్లు ఫెయిలయ్యాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొటాల్‌పల్లి రైతు మల్యాల సురేశ్(31) రూ. 3 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక ట్రాన్‌ఫార్మర్ ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. షాక్‌కు గురైన సురేష్‌ను హైదరాబాద్‌కు తరలించారు.
అమ్మా.. పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇవ్వు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెం దిన మహిళా కౌలు రైతు మాడ సాగరిక(24) మూడేళ్లుగా ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తోంది. ఆమె భర్త నారాయణరెడ్డి ఇటుకబట్టీలో కూలికి వెళ్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల్లో ఏనాడూ పంట సరిగా చేతికి రాలేదు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ. 5.50 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాది పత్తి ఎర్రబొమ్మిడి రోగంతో పూర్తిగా దెబ్బతింది. దీంతో మనస్తాపం చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగింది.
‘అమ్మా ఏమీ అనుకోవద్దు.. పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు అప్పులోళ్లకు ఇవ్వు. విన్ను, విక్కు(కొడుకుల ముద్దుపేర్లు)లను ఎవరికైనా దత్తత ఇవ్వు.. లేదా అనాథ ఆశ్రమంలో చేర్పించు.. ఇంకా ఉన్న అప్పుల వివరాలు బీరువాలో ఉన్నాయి..’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టింది.