కాళేశ్వరం : కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన చల్లా స్వరూప(38) అనే మహిళా రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకుంది. గత రెండేళ్లగా తమకున్న ఐదెకరాల భూమిలో స్వరూప, శ్రీనివాస్ దంపతులు పత్తిపంటను సాగుచేస్తున్నారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోయారు. ఇదే క్రమంలో గురువారం స్వరూప, శ్రీనివాస్ తమ పత్తి చేనులో కలుపు తీస్తుండగా మేడిగడ్డ బ్యారేజీ సర్వే అధికారులు వచ్చి మీ భూమి మొత్తం పోతుందని తెలిపారు. ఇప్పటికే రూ.5లక్షల అప్పు ఉన్నామని, భూమి కూడా పోతే ఎలా బతకాలని మనస్తాపం చెందింది. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనికితోడు కుమార్తె మానస వికలాంగురాలు కావడంతో ఆమెపై మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వరూప భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పులబాధతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో భూమి కోల్పోతున్నందున ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్నారు.
మహిళా రైతు ఆత్మహత్య
Published Fri, Aug 12 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
Advertisement