Women Farmers Day
-
500 రోజులైనా వెనక్కి తగ్గేది లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు.. వేలాదిగా మోహరించిన పారా మిలటరీ బలగాలు.. ఆందోళనకారులపై ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్న లాఠీలు..పరిస్థితి చేయిదాటితే నిలువరించేందుకు వాటర్ కేనన్లు, బాష్పవాయు గోళాలు.. 100 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లోని ఏ ప్రాంతంలో చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన ప్రారంభించిన రైతులతో కేంద్రప్రభుత్వం 11 విడతల్లో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంతేగాక సుప్రీంకోర్టు జోక్యంతో ఏర్పాటైన కమిటీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు అంగీకరించలేదు. దీంతో వ్యవసాయ చట్టాల విషయంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎముకలు కొరికే చలిలో, భారీ వర్షంలోనూ ఆందోళనలను కొనసాగించిన రైతులు, ఇప్పుడు ఉత్తరాదిన మండిపోయే ఎండల్లోనూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా గత 100 రోజులుగా రైతుల ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నవంబర్ 26న రైతులు తమ నిరసన ప్రారంభించిన రోజు ఏ విధంగానైతే వాతావరణం ఉందో, ఇప్పటికీ అలాగే ఉంది. ట్రాక్టర్లు, ట్రాలీలు, లంగర్లు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు, తాత్కాలిక ఆసుపత్రులు, గుడారాలు 100 రోజులు అయినప్పటికీ అలానే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆందోళన ప్రారంభించిన రైతుల సంకల్పం ఎక్కడా చెక్కుచెదరలేదు. గతేడాది నిరసన ప్రారంభమైనప్పుడు దేశ రాజధానిలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు ఇప్పుడు నిరసన వేదికకు 4–5 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ అనంతరం 14 మంది పంజాబ్ రైతుల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. మూడు నెలల్లో తీవ్రమైన చలి కారణంగా రైతు ఉద్యమంలో 108 మంది రైతులు కన్నుమూశారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన శనివారానికి (మార్చి 6వ తేదీ) 100 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత సజీవంగా ఉంచేందుకు ఢిల్లీ వెలుపల ఉన్న కుండ్లి–మనేసర్–పాల్వాల్ వెస్ట్రన్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐదు గంటలపాటు అడ్డుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా గతంలోనే ప్రకటించింది. శనివారం రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించేందుకు ఇళ్ళు, కార్యాలయాలపై నల్ల జెండాలు ఎగురవేయాలని ఎస్కేఎం కోరింది. ఈ చర్యతో ప్రభుత్వం మళ్ళీ తమతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. జనవరి 26న రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు జరిగాక రైతు ఉద్యమంలో మార్పు మొదలైంది. విధ్వంసానికి వ్యతిరేకంగా పలు సంఘాలు రైతు ఉద్యమం నుంచి దూరమవుతున్నట్లుగా ప్రకటించాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు విధ్వంసాన్ని తప్పుబట్టాయి. ఆ సమయంలో రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ రంగంలోకి దిగారు. రైతులు తమ డిమాండ్లను సాధించుకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి 500 రోజులు పట్టినా ఆందోళనలను ఆపే ప్రసక్తిలేదని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. ఎంఎస్పీ దిలావ్ అభియాన్‌కు శ్రీకారం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా కిసాన్ దివస్‌గా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్త నిరసనలలో మహిళలు ఎక్కువగా పాల్గొంటారని రైతు సంఘాలు తెలిపాయి. మార్చి 15వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా గుర్తించనున్నాయి. ఈ రోజును కార్పొరేటీకరణ వ్యతిరేక దినంగా పాటించాలన్న కార్మిక సంఘాల పిలుపునకు ఎస్కేఎం మద్దతు ప్రకటించింది. వీటికితోడు దేశమంతటా కనీస మద్దతు ధరపై ప్రజల్లోనూ అవగాహనను పెంచేలా ఎంఎస్íపీ దిలావ్ అభియాన్ వంటి వినూత్న కార్యక్రమానికి ఎస్కేఎం శ్రీకారం చుట్టనుంది. మొదట ఈ విభిన్న కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేశారు. -
పచ్చని బంగారం శ్రీగంధం!
కవిత మిశ్రా.. విలక్షణ మహిళా రైతు.. శ్రీగంధం వంటి విలువైన కలప పంటతోపాటు 10 రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, ఆవులు, గొర్రెలు, పందెం కోళ్లతో పాటు మొక్కల నర్సరీ పెంచుతున్నారు. 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దేశానికే అద్భుత నమూనా క్షేత్రంగా మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏటా రూ. 25 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఇటీవల కవితను కేంద్ర వ్యవసాయ శాఖ ‘ఆనర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ పురస్కారంతో సత్కరించడం విశేషం. ఈ అవార్డును తన క్షేత్రంలో వ్యవసాయ కార్మికులకు అంకితం ఇచ్చిన ఉత్తమ రైతు కవిత.. స్ఫూర్తిదాయకమైన ఆమె వ్యవసాయాను భవాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా మాన్వి తాలూకా కవితల్ గ్రామం ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా స్వస్థలం. ఎమ్మెస్సీ, కంప్యూటర్ డిప్లొమా పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందారు. నియామక లేఖను భర్తకు చూపిస్తే.. ‘ఉద్యోగం వద్దులే. మన భూమిలో వ్యవసాయం చెయ్యి’ అన్నారట. భర్త మాటలకు ఆమె కుంగిపోలేదు. సవాలుగా తీసుకున్నారు. ఏసీ గదిలో కంప్యూటర్ ముందు పనిచేయాలన్న అభిలాష ఉన్నప్పటికీ.. పెద్దగా సారం లేని, ఇంచున్నర నీరున్న బోరుతో కూడిన తమ 8 ఎకరాల మెట్ట భూమిలోకి అడుగుపెట్టారు. తొలుత రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో దానిమ్మ తోటను సాగు చేసి బ్యాక్టీరియా తెగుళ్లవల్ల లక్షలాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు. ఆ చేదు అనుభవం నుంచి మెట్ట ప్రాంత రైతుగా రెండు గుణపాఠాలు నేర్చుకున్నారు. 1. ఒకే పంటను సాగు చేయకూడదు. ఒకే పొలంలో అనేక పంటలు, అంతర పంటలు సాగు చేయాలి. కేవలం పంటల మీదే ఆధారపడకూడదు. పశువులు, చిన్న జీవాలు, కోళ్లను సైతం పెంచుతూ.. అనేక విధాలుగా నిరంతరం ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. 2. ప్రకృతికి ఎదురీదటం కాదు, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి మేలు. ఈ గ్రహింపుతో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. శ్రీగంధం సాగుతోపాటు 10 రకాల సీజనల్ పండ్ల చెట్లు నాటి.. దేశం గర్వించదగిన ఆదర్శ మహిళా రైతుగా ఎదిగారు. ఆగ్రోఫారెస్ట్రీ, సమీకృత వ్యవసాయంలో అన్ని విషయాలపైనా ఆమెకు స్వీయానుభవంతోపాటు లోతైన అవగాహన ఉండటంతో.. ప్రాంతీయ, జాతీయ స్థాయి వర్క్‌షాపులలో రైతుగా తనకున్న అపారమైన జ్ఞానాన్ని పంచుతున్నారు. శ్రీగంధం+10 రకాల పండ్ల చెట్లు 2,100 శ్రీగంధం చెట్లతో పాటు వెయ్యి దానిమ్మ, 600 మామిడి, 300 జామ, 450 సీతాఫలం, 100 నేరేడు, 100 మునగ, 100 ఉసిరి, 200 నిమ్మ, 100 కొబ్బరి చెట్లను 8 ఎకరాల్లో కవిత పెంచుతున్నారు. పొలంలో ఒక్క చదరపు అడుగు కూడా ఖాళీగా వదలకుండా పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు. ట్రాక్టర్ కాదుకదా ఎద్దుల నాగలితో కూడా దుక్కి చెయ్యరు. ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవులు, వానపాములే భూమిని గుల్లపరిచి సారవంతం చేస్తాయంటారామె. డ్రిప్ మైక్రోట్యూబ్స్ ద్వారా ప్రతి పది రోజులకోసారి చెట్లకు జీవామృతం, పంచగవ్య, దశపర్ణికషాయం మార్చి మార్చి ఇస్తున్నారు. 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. ఆవులు.. గొర్రెలు.. పందెం కోళ్లు.. చెట్లు చిన్నగా ఉన్న దశలో కొన్ని ఏళ్ల పాటు కూరగాయలు, వేరుశనగ తదితర సీజనల్ అంతర పంటలు సాగు చేసుకునేవారు కవిత. 5 ఆవులు, 30 గొర్రెలు, 150 సేలం నుంచి తెచ్చిన డ్రాగన్ ఫైటర్స్ రకం పందెం కోళ్లను పెంచుతున్నారు. శ్రీగంధం, ఇతర పండ్ల విత్తనాలు సేకరించి, వాటితో మొక్కలు పెంచి అమ్ముతున్నారు. ఈ ఏడాది 6–7 క్వింటాళ్ల శ్రీగంధం విత్తనాలను సేకరించారు. కిలో విత్తనాలను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. ఏడాది వయసున్న శ్రీగంధం మొక్కను రూ.30కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల రైతులు కవిత నర్సరీ నుంచి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. రైతుకు రోజూ, వారం, నెల, సీజన్, 15 ఏళ్లకు.. నిరంతరం ఏదో ఒక విధంగా ఆదాయం వచ్చేలా సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించడం వ్యవసాయంపై కవితకు ఉన్న అపారమైన అవగాహన, శ్రద్ధకు నిదర్శనం. తోటలోనే ఇల్లు నిర్మించుకొని కవిత కుటుంబం నివసిస్తోంది. 5 వ్యవసాయ కార్మికుల కుటుంబాలతో సహా తోటలోనే మకాం ఉంటున్నారు. దీంతో ఆమె తన తోటను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రస్తుతం ఏడాదికి 8 ఎకరాల్లో రూ. 25 లక్షల వరకు ఆదాయం పొందుతున్నానని కవిత గర్వంగా చెబుతారు. మైక్రోచిప్‌తో శ్రీగంధం చెట్లకు రక్షణ శ్రీగంధం వంటి విలువైన జాతి చెట్లు పెరుగుతున్నాయంటే.. వాటితోపాటే అభద్రత కూడా పెరుగుతున్నట్లే. అయితే, ఏడేళ్లు పెరిగిన చెట్టుకు మైక్రో చిప్‌ను అమర్చడం ద్వారా అది దొంగల పాలు కాకుండా కాపాడుకోవచ్చని కవిత మిశ్రా తెలిపారు. తన తోటలో శ్రీగంధం చెట్లకు త్వరలో మైక్రోచిప్‌లను అమర్చుకోబోతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 2,500 ఖర్చవుతుంది. కర్నాటక ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ వుడ్‌సైన్స్ టెక్నాలజీలో సర్వర్‌తో అనుసంధానం అయి ఉండే ఈ చిప్ వల్ల.. ఎవరైనా చెట్టును తాకిన వెంటనే సర్వర్‌కు, రైతు మొబైల్‌కు, పోలీస్ స్టేషన్‌కు కూడా హెచ్చరిక సందేశం వస్తుంది. తద్వారా విలువైన శ్రీగంధం చెట్లను సులువుగా రక్షించుకోవచ్చని కవిత తెలిపారు. ప్రతి రైతూ ఒక ఎకరంలోనైనా శ్రీగంధం నాటాలి.. ఆత్మాభిమానం కలిగి ఉండే రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా తెలివితో ప్రణాళికాబద్ధంగా సమీకృత ప్రకృతి సేద్యం చేయాలని కవిత సూచిస్తున్నారు. ప్రతి రైతూ తమకున్న మొత్తం పొలంలో కాకపోయినా.. కనీసం ఒక ఎకరంలోనైనా ఈ పద్ధతిలో శ్రీగంధం, పండ్ల మొక్కలు వేసుకోవాలని సూచిస్తున్నారు. శ్రీగంధం 15 ఏళ్లకు ఎకరానికి కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీగంధం చెట్ల మధ్య నాటిన సీజనల్ పండ్ల చెట్లు బోనస్‌గా రైతుకు అందుతాయని, రైతులు ఉద్యోగుల మాదిరిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది మేలైన సాగు పద్ధతి అని కవిత మిశ్రా(94487 77045) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. అరుదైన విద్యాధిక ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా. ఆమె దీక్ష, దక్షతలకు ‘సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ఎకరానికి 300 శ్రీగంధం చెట్లు.. 2011లో కర్ణాటక ప్రభుత్వం శ్రీగంధం సాగుకు రైతులను అనుమితిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ కొత్తల్లోనే 12“12 అడుగుల దూరంలో ఎకరానికి 300 శ్రీగంధం మొక్కలు నాటారు. శ్రీగంధం తనంతట తాను పెరిగే చెట్టు కాదు. పక్కన ఉన్న చెట్ల వేర్లపై ఆధారపడి బతుకుతుంది. ప్రతి శ్రీగంధం మొక్కకు 6 అడుగుల దూరంలో మామిడి, జామ, చింత, నేరేడు, కరివేపాకు మొక్కలు విధిగా నాటాలన్నది కవిత అభిప్రాయం. నాటిన 15 ఏళ్లకు శ్రీగంధం కోతకు వస్తుంది. కాండంలో చేవ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ధర లభిస్తుంది. చెట్టుకు 20 కిలోల చేవ వచ్చినా ఎకరానికి 6 వేల కిలోల చేవ కలప దిగుబడి వస్తుంది. కిలో రూ. 8 వేల చొప్పున ఎకరానికి రూ. 4 కోట్ల 80 లక్షల ఆదాయం వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. ఆమె శ్రీగంధం తోట వయసు 6 ఏళ్ల 8 నెలల. మరో 8 ఏళ్లకు కోతకు వస్తుంది. చెట్టుకు 70 కిలోల శ్రీగంధం చావ వచ్చింది! 2002లో బత్తాయి తోట సాళ్ల మధ్యలో 20 శ్రీగంధం మొక్కలు నాటా. 10 సంవత్సరాల వరకు నీళ్లిచ్చా. ఆ తర్వాత వేసవిలో నీళ్లిచ్చి బతికించా. 14.5 ఏళ్లు పెరిగిన తర్వాత ఏడాదిన్నర క్రితం అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకొని చెట్లు నరికి అమ్మాను. చెట్టు కాండం లోపల చావ కలప (హార్డ్ ఉడ్) ఎంత ఎక్కువ వస్తే రైతుకు అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కొన్ని చెట్లకు 70 కిలోల వరకు వచ్చింది. కిలో రూ. 6 వేలకు అమ్మాను. ఆ చెట్టుకు 4,20,000 వచ్చింది. తాటి చెట్ల నీడ వల్ల కొన్ని చెట్లకు చావ 20–30 కిలోలు మాత్రమే వచ్చింది. ఈ చెట్ల గింజలు పడి మా భూముల్లో కొన్ని మొక్కలు మొలిచి, పెరుగుతున్నాయి. ఉద్యాన కమిషనర్ వెంకట్రామ్రెడ్డి చొరవతో ఇప్పుడు శ్రీగంధం మొక్కలతోపాటు డ్రిప్ కూడా రైతులకు ఇవ్వనున్నారు. శ్రీగంధం చెట్లు పెంచిన తర్వాత వాటిని నరకడానికి అటవీ శాఖ అనుమతుల కోసం తిరగాల్సి వస్తున్నది. అయితే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సులభంగా అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న చీఫ్ కన్సర్వేటర్ ఇటీవల చెప్పారు. ప్రతి రైతూ శ్రీగంధం చెట్లు వేసుకుంటే.. మున్ముందు మంచి ఆదాయం వస్తుంది. – విస్తారపు రెడ్డి (63043 91957), పసునూరు, నాంపల్లి మండలం, నల్లగొండ జిల్లా ఎర్ర నేలలు శ్రీగంధం సాగుకు అనువైనవి! కర్ణాటకలోని కవిత మిశ్రా ఆదర్శ రైతు. శ్రీగంధం చెట్లతో పాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, కోళ్లు, ఆవులు పెంచుతున్నారు. నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. రోజూ, ఆరు నెలలకు, 15 ఏళ్లకు ఆదాయం వచ్చేలా అనేక జాతుల చెట్లు, పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. ఆమె విజయగాథ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో శ్రీగంధం సాగును ప్రోత్సహిస్తున్నాం. నీటికొరత, ఎర్ర, గ్రావెల్ నేలలున్న తెలంగాణకు శ్రీగంధం సాగు చాలా అనువైనది. ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ఎకరానికి 3 ఏళ్లలో 18 వేల నుంచి 20 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ప్రతి రైతూ శ్రీగంధం మొక్కలు కనీసం పదైనా వేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుంది. అంతేకాదు, కార్బన్‌డయాక్సయిడ్‌ను పీల్చుకోవడం ద్వారా పర్యావరణానికి ఈ చెట్లు ఎంతో మేలు చేస్తాయి. మన దేశం సహా 8 దేశాల్లోనే శ్రీగంధం పెరుగుతుంది. కాబట్టి గిరాకీ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ములుగులోని ఉద్యాన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 18 లక్షల శ్రీగంధం మొక్కలు పెంచుతున్నాం. జూలై–ఆగస్టు నాటికి మొక్క రూ. 15–20 ధరకు రైతులకు అందిస్తాం. ముందుగా పేర్లు నమోదు చేయించుకున్న రైతులకే శ్రీగంధం మొక్కలు ఇస్తాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ ప్రసాద్(83744 49007)ను సంప్రదించవచ్చు. – ఎల్. వెంకట్రామ్రెడ్డి, కమిషనర్, తెలంగాణ ఉద్యాన శాఖ కవిత తోటలో ఉద్యాన కమిషనర్ తదితరులు తన తోటలో బత్తాయిలు, సీతాఫలాలతో కవిత మిశ్రా -
చాకిరీ 60% భూమి 14%!
వ్యవసాయంలో మహిళల శ్రమ వాటా రోజు రోజుకూ పెరుగుతోంది. అయినా, మహిళా రైతులుగా వారికి గుర్తింపు పెద్దగా దక్కటం లేదు. పితృస్వామిక వ్యవస్థ, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మహిళా రైతుల హక్కులకు గుర్తింపు లేకుండా పోతోంది. ఈ నెల 15న జాతీయ మహిళా రైతుల హక్కుల దినోత్సవం. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం కూడా. కమతాలు చీలిపోయి చిన్నవి అవుతున్న కొద్దీ, వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతున్న కొద్దీ పురుషులు ఇతర రంగాలవైపు దృష్టి సారించడం పెరుగుతోంది. అనివార్యంగా వ్యవసాయ పనులన్నీ మహిళలపైనే పడుతున్నాయి. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ అంచనా ప్రకారం మన దేశంలో ఆహారోత్పత్తిలో మహిళల శ్రమ 60–80 శాతం. పాడి పరిశ్రమలో 90%. ఇది ఇంటిపనికి అదనం. 2010–11 వ్యవసాయ గణాంకాల ప్రకారం.. దేశంలో 11 కోట్ల 87 లక్షల మంది సాగుదారులుంటే ఇందులో 30.3% మంది మహిళా రైతులు. 14.43 కోట్ల వ్యవసాయ కూలీల్లో 42.6% మహిళలు.అయినా, మహిళలకు భూమిపై హక్కు 14% మాత్రమే. 2015 జనాభా గణన ప్రకారం.. వ్యవసాయ రంగంలో ఉన్న 86 శాతం మంది మహిళల పేరు మీద సెంటు భూమి కూడా లేదు. మహిళలకు భూమి హక్కు వచ్చినప్పుడే రైతుగా ప్రభుత్వ సహాయాన్ని, రుణాలను, శిక్షణావకాశాలను పొందగలుగుతారు. అభివృద్ధి చెందుతున్న మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించి గుర్తింపు ఇస్తే వ్యవసాయ ఉత్పత్తి 2.5–4% వరకు పెరుగుతుందని ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేస్తోంది. వ్యవసాయ పనుల్లోని ప్రతి దశలోనూ నడ్దివిరిచే చాకిరీ చేసే మహిళల శ్రమ తగ్గించే యంత్రపరికరాలను, వారికి తగినట్టుగా తక్కువ బలాన్ని వినియోగించాల్సిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేయడం అవసరం. ఇప్పుడున్న యంత్ర పరికరాలన్నీ పురుషులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసినవే. మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసే యంత్ర పరికరాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మహిళా రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది! -
నాన్న వెంటే నడిచి రైతునయ్యా..!
నేడు మహిళా రైతు దినోత్సవం వ్యవసాయం... అనగానే అది మగాళ్ల జోన్ అనుకుంటారు. మహిళలు రాణించే రంగం కాదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంటుంది. లెక్కలేనంత మంది మహిళలు వ్యవసాయరంగంలో పని చేస్తుంటారు. వాళ్లెవరినీ రైతులనలేం. కానీ మహిళల్లో రైతులున్నారని నిరూపిస్తున్నారు గుంటూరుకు చెందిన మల్లీశ్వరి. ఆమె ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్నారు. వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ బోధనలను అక్షరాలా పాటిస్తున్నారు. మహిళారైతు దినోత్సవం సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని ఇక్రిశాట్లో జరుగుతున్న సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీతో... ‘‘మా అమ్మగారి ఊరు కృష్ణాజిల్లా తేలప్రోలు. నన్ను గుంటూరు జిల్లా నూతక్కిలో ఇచ్చారు. మా అమ్మానాన్నల పెళ్లయిన పదేళ్లకు పుట్టాను. దాంతో మా నాన్నగారికి నేనంటే గారం ఎక్కువ. ఆయన వెంటే తిప్పుకునేవారు. అలా పొలం వెళ్లడం అలవాటైంది. ఆయనపని చేస్తుంటే నేనూ చేలో దిగి ఆయన వెంటే తిరుగుతూ ఉండేదాన్ని. మా అత్తగారిది కూడా వ్యవసాయ కుటుంబమే. నాకు పెళ్లయిన ఈ పాతికేళ్లలో దాదాపుగా పదిహేనేళ్లు రసాయన ఎరువులతోనే పంటలు పండించాం. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి పిండికట్టలు (రసాయన ఎరువులు) తగ్గించుకుంటూ వచ్చాం. అయినా గట్టెక్కడం కష్టమే అనుకుంటున్నప్పుడు వ్యవసాయాధికారులు వర్మీ కంపోస్టు గురించి చెప్పారు. దానిని ప్రయత్నించాం. అది కూడా చిన్న ఖర్చేమీ కాదు. అలా ఎదురీదుతున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది. విజయవాడలోని పోరంకికి 2008లో పాలేకర్ (సుభాష్ పాలేకర్) గారొచ్చారు. ఆయన సేద్యం గురించి చాలా సంగతులు చెప్పారు. ఆయన హిందీలో చెప్తుంటే చదువుకున్నోళ్లు తెలుగులో వివరించారు. ఆ సదస్సుకి మా ఆయన వెళ్లి, పాలేకర్ గారు ప్రకృతి సేద్యం గురించి రాసిన పుస్తకాలు (తెలుగు అనువాదాలు) తెచ్చారు. వాటిని చదివి అలాగే చేశాం. ఆ తర్వాత 2010లో పాలేకర్గారు గుంటూరులో సదస్సుకు వచ్చారు. ఆ సదస్సుకు నేను కూడా వెళ్లాను. రసాయన క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువుల వల్ల నేల ఎంత నిస్సారమవుతుందో పూసగుచ్చినట్లు చెప్తుంటే మనసు కదిలిపోయింది. నేలను నమ్ముకుని బతికే వాళ్లం నేలతల్లిని బీడువారిస్తే తర్వాత ఏం తింటాం... అనిపించింది. ఏమైనా సరే ఇలాగే పండించాలనుకున్నాను. వెంటనే ఒక ఆవును కొన్నాం. ఆ ఆవు మాకు, మా ఆరెకరాల సేద్యానికీ ఆధారం. అభయ హస్తమిచ్చిన అరటి... ప్రకృతి సేద్యంలో మేమేసిన మొదటి పంట అరటి. మామూలుగా పండే పంటకంటే రెండు హస్తాలు ఎక్కువే వచ్చాయి. రుచి కూడా బాగుంది. ప్రకృతి వ్యవసాయంలో అరటికి ఎకరానికి ఏడెనిమిది వేల ఖర్చు వస్తుంది. గాలివానల వంటివి వస్తే చేయగలిగిందేమీ ఉండదు. కానీ విపత్తులు లేకుంటే రాబడి లక్షరూపాయలకు తగ్గదు. ఇప్పుడు మేము చెరకు, బొప్పాయితో పాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం. రసాయన ఎరువులు వేయకుండా పండిన కూరగాయ కానీ పండు కానీ ఒకసారి తింటే... ఇక ఆ ఎరువులతో పండించిన వాటి జోలికెళ్లరు. నాకిప్పుడు 42 ఏళ్లు. పిల్లల ప్రసవాలప్పుడు తప్ప ఇప్పటి వరకు ఒక్క మందుబిళ్ల కూడా మింగలేదు. రసాయన ఎరువులతో చచ్చుబడిపోయిన మా పొలం ఈ సేద్యంతో గుల్లబారి సారవంతంగా మారింది. బూజు తెగులు, పేనుబంక తెగుళ్లకు ఆవుమూత్రం చల్లితే తెల్లారేసరికే గుణం కనిపిస్తుంది. ఇంట్లో కానీ పొలంలో కానీ చెదలు పడితే ఆవుమూత్రం కలిపిన నీటిని చిలకరిస్తే చాలు. ఆవు పేడ, ఆవు మూత్రం, నల్లబెల్లం, మినప్పిండి, మట్టి కలిపి 48 గంటల సేపు మురగబెడితే జీవామృతం తయారవుతుంది. దీంతోపాటు మేము ఏ రోజు పేడ ఆ రోజు పొలంలో చల్లేస్తాం. స్వయంగా చూడడంతోనే ధైర్యం! పాలేకర్గారు చెప్పిన మాటలు మాలో బాగా నాటుకున్నప్పటికీ మనసులో ఏదో భయం. కానీ మమ్మల్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి అక్కడ రసాయన ఎరువులు వేసిన తోటలను, సహజ పద్ధతుల్లో పండించిన బత్తాయి, కమలా తోటలను చూపించారు. సహజపద్ధతుల్లో పండించిన చెట్లు నిగనిగలాడుతూ ఆకులు కూడా నేవళంగా (తాజాగా) కనిపించాయి. దాంతో మేమూ చేయగలమనే ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ సదస్సుకి అన్ని రాష్ట్రాల నుంచి నాలుగువందల మంది మహిళారైతులు వచ్చారు. నా అనుభవాలను చెప్పడంతోపాటు వారి అనుభవాలను నేను వింటే ఇంకా చాలా తెలుస్తాయి.’’ సంభాషణ: వాకా మంజులారెడ్డి