ఢిల్లీలోని ధర్నా ప్రాంగణంలో జరిగే మహిళా దినోత్సవాలకు పటియాల నుంచి వెళ్తున్న మహిళా రైతులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు.. వేలాదిగా మోహరించిన పారా మిలటరీ బలగాలు.. ఆందోళనకారులపై ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్న లాఠీలు..పరిస్థితి చేయిదాటితే నిలువరించేందుకు వాటర్ కేనన్‌లు, బాష్పవాయు గోళాలు.. 100 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లోని ఏ ప్రాంతంలో చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన ప్రారంభించిన రైతులతో కేంద్రప్రభుత్వం 11 విడతల్లో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంతేగాక సుప్రీంకోర్టు జోక్యంతో ఏర్పాటైన కమిటీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు అంగీకరించలేదు. దీంతో వ్యవసాయ చట్టాల విషయంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
ఎముకలు కొరికే చలిలో, భారీ వర్షంలోనూ ఆందోళనలను కొనసాగించిన రైతులు, ఇప్పుడు ఉత్తరాదిన మండిపోయే ఎండల్లోనూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా గత 100 రోజులుగా రైతుల ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నవంబర్ 26న రైతులు తమ నిరసన ప్రారంభించిన రోజు ఏ విధంగానైతే వాతావరణం ఉందో, ఇప్పటికీ అలాగే ఉంది. ట్రాక్టర్లు, ట్రాలీలు, లంగర్లు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు, తాత్కాలిక ఆసుపత్రులు, గుడారాలు 100 రోజులు అయినప్పటికీ అలానే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆందోళన ప్రారంభించిన రైతుల సంకల్పం ఎక్కడా చెక్కుచెదరలేదు. గతేడాది నిరసన ప్రారంభమైనప్పుడు దేశ రాజధానిలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు ఇప్పుడు నిరసన వేదికకు 4–5 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ అనంతరం 14 మంది పంజాబ్ రైతుల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. మూడు నెలల్లో తీవ్రమైన చలి కారణంగా రైతు ఉద్యమంలో 108 మంది రైతులు కన్నుమూశారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.
నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన శనివారానికి (మార్చి 6వ తేదీ) 100 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత సజీవంగా ఉంచేందుకు ఢిల్లీ వెలుపల ఉన్న కుండ్లి–మనేసర్–పాల్వాల్ వెస్ట్రన్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐదు గంటలపాటు అడ్డుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా గతంలోనే ప్రకటించింది. శనివారం రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించేందుకు ఇళ్ళు, కార్యాలయాలపై నల్ల జెండాలు ఎగురవేయాలని ఎస్‌కేఎం కోరింది. ఈ చర్యతో ప్రభుత్వం మళ్ళీ తమతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. జనవరి 26న రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు జరిగాక రైతు ఉద్యమంలో మార్పు మొదలైంది. విధ్వంసానికి వ్యతిరేకంగా పలు సంఘాలు రైతు ఉద్యమం నుంచి దూరమవుతున్నట్లుగా ప్రకటించాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు విధ్వంసాన్ని తప్పుబట్టాయి. ఆ సమయంలో రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ రంగంలోకి దిగారు. రైతులు తమ డిమాండ్లను సాధించుకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి 500 రోజులు పట్టినా ఆందోళనలను ఆపే ప్రసక్తిలేదని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు.
ఎంఎస్‌పీ దిలావ్ అభియాన్‌కు శ్రీకారం
మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా కిసాన్ దివస్‌గా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్త నిరసనలలో మహిళలు ఎక్కువగా పాల్గొంటారని రైతు సంఘాలు తెలిపాయి. మార్చి 15వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా గుర్తించనున్నాయి. ఈ రోజును కార్పొరేటీకరణ వ్యతిరేక దినంగా పాటించాలన్న కార్మిక సంఘాల పిలుపునకు ఎస్‌కేఎం మద్దతు ప్రకటించింది. వీటికితోడు దేశమంతటా కనీస మద్దతు ధరపై ప్రజల్లోనూ అవగాహనను పెంచేలా ఎంఎస్íపీ దిలావ్ అభియాన్ వంటి వినూత్న కార్యక్రమానికి ఎస్‌కేఎం శ్రీకారం చుట్టనుంది. మొదట ఈ విభిన్న కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment