పరిశోధన స్థానంలోని పొలాల్లోకి దిగి విత్తనాలు వెదజల్లుతున్న మహిళా రైతు లక్ష్మి
వ్యవసాయ కుటుంబాల్లో పుట్టినప్పటికీ వ్యవసాయం చేయటం కొందరు యువతీ యువకులు నమోషిగా భావిస్తూ ఉంటే.. వ్యవసాయంలో ఉన్న వారేమో పెట్టుబడి తిరిగి వస్తుందో లేదోనని బయపడుతూ ఉంటారు. కానీ, అందుకు భిన్నమైన యువ ఆదర్శ రైతు లక్ష్మి. చదువుకున్నది తక్కువే అయినా వ్యవసాయంలో నిస్సంకోచంగా ప్రయోగాలు చేస్తూ సత్పలితాలు సాధించి శభాష్ అన్పించుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు చేసే పని మీద నమ్మకం ఆమెను విలక్షణంగా నిలిపింది. చివరకు కేంద్ర ప్రభుత్వ దృష్టిని సైతం ఆకర్షించేలా చేసింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 92వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ‘ఐసిఎఆర్ – జగ్జీవన్‌రామ్ అభినవ్ కిసాన్ పురస్కార్–2019 (జోన్10)’ కు లక్ష్మి ఇటీవలే ఎంపికయ్యారు.
రూపిరెడ్డి లక్ష్మి స్వగ్రామం కొండపల్కల. ఇది కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో ఉంది. లక్ష్మీ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. పెద్దగా చదువుకోలేదు. అయినా, తెలివితేటల్లో తక్కువేమీ కాదు. భర్త తిరుపతి రెడ్డితో కలిసి పొలంలోని ప్రతి పనిలోనూ నిమగ్నమై చక్కబెట్టుకోవడంలో ఆమె దిట్ట. వారికి ఇద్దరు మగ పిల్లలు. ఒకరిని అగ్రికల్చర్ బిఎస్సీ చదివించారు. రెండో కుమారుడు బిటెక్ చదువుతున్నాడు.
ఎకరానికి నాలుగైదు బస్తాల అధిక దిగుబడి
15 ఎకరాల్లో వరి సాగు పనులను ఈ రైతు దంపతులు సాధ్యమైనంత వరకు కూలీల అవసరం లేకుండా తామే చేసుకుంటారు. రెండు సీజన్లలోనూ ఇంతే. ట్రాక్టర్‌తో పొలం దున్నడం నుంచి ధాన్యాన్ని మార్కెట్‌లో అమ్మేవరకు అన్ని పనుల్లోనూ లక్ష్మి స్వయంగా క్రియాశీలంగా పాల్గొంటారు. మెరుగైన యాజమాన్య పద్దతులు పాటిస్తూ, ప్రతి సీజన్‌లో 450–500 క్వింటాళ్ల ధాన్యం పండిస్తారు. సాధారణంగా రైతులు వరి నారు పోసి, పొలం దున్ని, జంబు (దమ్ము) చేసి, కూలీల చేత నాటు వేయిస్తుంటారు. లక్ష్మి మాత్రం వరి విత్తనాలు వెదజల్లి పంట పండిస్తున్నారు. ఈ పద్ధతిలో నాలుగైదు బస్తాలు ఎక్కువగా దిగుబడి తీస్తున్నారు.
ఎకరానికి రూ. 7–8 వేల ఖర్చు ఆదా
వానాకాలం పంటలో అయితే పొలం దున్నడం, నారు పోయడం, నాటు వేయడం మానుకొని.. పొలాన్ని దుక్కి చేసి, తడిపి వరి విత్తనాలను లక్ష్మి వెదజల్లుతారు. నెలకు నాలుగైదు సార్లు ఆరు తడి పంటగా నీళ్లు పెడుతుంటారు. మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. రబీ సీజన్‌లో.. ట్రాక్టర్‌తో పొలం దున్ని, ఒక రోజు నానబెట్టి మొలక గట్టిన వరి విత్తనాలను పొలంలో వెదజల్లుతారు. ప్రధాన పొలంలో కొత్త మొలకవచ్చే వరకు వేచి చూసి, అవసరాన్ని బట్టి నీరు పెడుతుంటారు. కలుపు మందులు పిచికారీ చేస్తుంటారు. తాము అనుసరిస్తున్న మెరుగైన పద్ధతుల వల్ల ఎకరాకు రూ. 7–8 వేల వరకు ఖర్చు తగ్గిందని, 15 ఎకరాల్లో దాదాపు రూ. లక్ష వరకు ఖర్చు తగ్గిందని లక్ష్మి గర్వంగా చెపుతున్నారు.
ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ సోనా వంటి సన్న రకాలు సాగు చేస్తే, రబీలో ఎంటియు–1010, ఐఆర్–64, జెజిఎల్–24423 వంటి రకాలు సాగు చేస్తారు. ముఖ్యంగా పొలంలో వరి పంట కోసిన తర్వాత మిగిలే కొయ్యకాళ్లను తగులబెట్టరు. దున్నేసి కంపోస్టుగా మారుస్తారు. జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలు వేసి.. పూతకు రాగానే కలియదున్నుతున్నారు. దీంతో, పంటకు పెద్దగా పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటివి వేయరు. అలాగే, రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును వీలైనంతగా తగ్గించుకుంటున్నారు. గత ఐదేళ్ల నుంచి ఈ పద్ధతిలో సాగు చేస్తూ లక్ష్మి, తిరుపతి రెడ్డి దంపతులు తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు.
ప్యాంట్, షర్ట్ ధరించి..
వినూత్న పద్ధతుల ద్వారా వరి సాగు చేస్తూ, ఖర్చు తగ్గిస్తున్న ఈ రైతు దంపతుల కృషిని ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్శిటీ, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం గుర్తించి సముచితంగా సత్కరించాయి. ఇటీవల పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానానికి వచ్చిన లక్ష్మి ప్యాంట్, షర్ట్ ధరించి స్వయంగా పొలంలోకి దిగి మొలక కట్టిన వరి విత్తనాలను చకచకా ఒడుపుగా వెదజల్లి శాస్త్రవేత్తలను, రైతులను ఆశ్చర్య చకితులను చేశారు. వ్యవసాయ విద్యార్థులతోనూ తన అనుభవాలను పంచుకుంటున్నారు. ‘లక్ష్మి ఎప్పటికప్పుడు ఖర్చు తగ్గించే కొత్త వ్యవసాయ పద్ధతులపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయాన్ని ఇష్టంగా చేస్తుంది. వరిలో నాటు వేసిన పద్ధతి కంటే కూడా వెదజల్లే పద్ధతిలో ఎక్కువ దిగుబడి తీస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు’ అని పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ డా. ఉమారెడ్డి ప్రశంసించారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల అగ్రికల్చర్
‘ఇదేం వ్యవసాయమన్నారు..’
వ్యవసాయంలో ఖర్చులు తగ్గిస్తేనే లాభం. అందుకే ఖర్చు తగ్గించే పద్దతులపై దృష్టి పెట్టాను. ఎప్పుడైనా కొత్తగా చేసేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, వాటిని ఎదిరించి నిలబడితేనే విజయం వశమవుతుంది. నారు పోయకుండా విత్తనం వెదజల్లితే ఎంతోమంది ఇదేం వ్యవసాయమన్నారు. కానీ, నాపై నాకు నమ్మకం ఉంది. నేను అర్థం చేసుకున్న పనులు ఐదేళ్లుగా చేస్తూనే ఉన్నాను. అధిక దిగుబడులు సాధిస్తూనే ఉన్నాను.– రూపిరెడ్డి లక్ష్మీ తిరుపతిరెడ్డి (94905 35102), కొండపల్కల, మానకొండూర్ మండలం, కరీంనగర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment