bet chickens
-
నాటు కోడి గుడ్లు దొరక్క ఇబ్బందులు.. రంగంలోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్.. లక్షల్లో సంపాదన
సాక్షి, అమరావతి బ్యూరో: చదివింది ఎంసీఏ. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగళూరులో ఉద్యోగం. లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యంతో సొంత ఊరికి వచ్చాడు. ఇక్కడ తన పిల్లలకు నాటు కోడి గుడ్లు పెట్టాలనుకున్నాడు. మార్కెట్లో ఎంత వెతికినా దొరకలేదు. పైగా, నాటు కోడి పేరుతో జరుగతున్న మోసాలను గమనించాడు. అసలైన జాతి కోళ్లను పెంచితే మంచి గిరాకీ ఉంటుందని గ్రహించాడు. తీరిక వేళల్లో కోళ్లు పెంచాలన్న ఆలోచన తట్టింది. కానీ, కోళ్ల పెంపకంపై అవగాహన లేదు. దీంతో పందెం కోళ్ల పెంపకంపై తెలిసిన వారి నుంచి కొంత, ఆన్లైన్లో మరికొంత సమాచారాన్ని సేకరించాడు. రూ.15 వేల పెట్టుబడితో కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో లభించే మేలు జాతి దేశీయ రకం కోళ్లతో పాటు విదేశీ జాతులను సేకరించి వాటి సంకరంతో కొత్త జాతి కోళ్లను వృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పందెం రాయుళ్లు కోళ్ల కోసం ఇప్పుడు వడ్లమూడికి వస్తున్నారు. ఇలా సాఫ్ట్‌వేర్‌తో పాటు కోళ్ల పెంపకంలోనూ రాణిస్తున్నాడు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి యువకుడు ఘట్టమనేని శ్రావణ్‌కుమార్. పుంజుల వీర్యాన్ని సేకరించి కోళ్ల పందెంలో దూకుడుగా బరిలో దిగటానికి కొంతమంది విదేశీ మేలు జాతి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. శ్రావణ్ మాత్రం దేశీయ రకం కోళ్ల జాతితో శాస్త్రీయ పద్ధతుల్లో మరింత మెరుగైన కోళ్ల ఉత్పత్తి చేస్తున్నాడు. ఎంపిక చేసుకున్న మేలు రకం పుంజుల వీర్యాన్ని సేకరించి నిల్వ చేస్తాడు. దాన్ని కొబ్బరినీళ్లు, సెలైన్ వాటర్‌లో కలిపి దేశీయ జాతి పెట్టలకు అందజేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పెట్టలు త్వరగా అలసిపోవు. అధిక, నాణ్యమైన గుడ్లను పెట్టే శక్తి వస్తుంది. ఆశించినట్లే మేలు రకం దేశీయ కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రెండేళ్లుగా కష్టపడి దేశీయ జాతిలో మంచి కోళ్లను సృష్టించానని, మరింత అభివృద్ధి చేసిన తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెడతానని శ్రావణ్ చెబుతున్నాడు. ఆన్లైన్లో అమ్మకాలు నాణ్యమైన ఉత్పత్తితో పాటు మెరుగైన మార్కెటింగ్ ఉంటేనే అమ్మకాలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని శ్రావణ్ సోషల్ మీడియాలో ఘట్టమనేని ఫామ్స్ పేరిట ప్రత్యేక పేజీను తయారు చేసుకున్నాడు. తన వద్ద ఉన్న కోళ్ల ఫొటోలను అందులో పోస్ట్ చేస్తున్నాడు. వాటిని చూసి ఆర్డర్లు వస్తుండగా, మరికొంత మంది నేరుగా ఫామ్‌కి వచ్చి కొంటున్నారు. మోసానికి తావులేకుండా, కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టు అమ్మకాలు చేస్తుండటంతో మార్కెట్లో మంచి పేరు వచ్చిందని శ్రావణ్ చెబుతున్నాడు. సంక్రాంతి టార్గెట్‌గా శ్రావణ్ దగ్గర కోడిగుడ్డు, అప్పుడే పుట్టిన పిల్ల మొదలు రెండేళ్ల వయసు గల కోళ్లు ఉంటాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా వాటిని పెంచుతున్నాడు. తోక పుట్టుక, కోడి కాళ్లు, శరీరాకృతి ఆధారంగా రేటు వస్తుంది. వచ్చే సంక్రాంతి పండుగ టార్గెట్‌గా ఇప్పటి నుంచే కోళ్ల పెంపకం మొదలుపెట్టాడు. వడ్లమూడి, ఒంగోలు, బాపట్ల, వేటపాలెంలలో షెడ్లను ఏర్పాటు చేశాడు. తూర్పు జాతి, మెట్టవాటం, పచ్చకాకి, కాకిడేగ, సేతువు, నెమలి వంటి పలు రకాల కోళ్లు పెంచుతున్నాడు. ఒక్కొక్క గుడ్డు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నాడు. 15 రోజుల కోడి పిల్ల రూ.1,500, మూడు నెలల పిల్లలు రూ.3 వేలు, ఆరు నెలల పిల్లలు రూ.10 వేలు దాకా అమ్ముతున్నాడు. జాతిని బట్టి ఒక్కో కోడి రూ.3 లక్షల దాకా ఉంటాయని శ్రావణ్ చెబుతున్నాడు. అవసరంతో మొదలుపెట్టి... అదనపు ఆదాయంగా మార్కెట్లో అసలైన నాటు కోడి మాంసం, గుడ్లు లభించడంలేదు. దీంతో నేనే కోళ్ల పెంపకం మొదలుపెట్టాలన్న ఆలోచన మొదలైంది. తర్వాత ఇది అదనపు ఆదాయంగా మారింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 2 రెండు గంటల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తా. ఖాళీ సమయంలో కోళ్లను చూసుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నా భార్య, అమ్మ, నాన్న నాకు సహాయంగా ఉంటున్నారు. పందెం కోళ్లకు అడ్రస్ ఘట్టమనేని ఫామ్స్ అని చెప్పుకొనేలా చేయడమే నా లక్ష్యం. – ఘట్టమనేని శ్రావణ్‌కుమార్ -
పచ్చని బంగారం శ్రీగంధం!
కవిత మిశ్రా.. విలక్షణ మహిళా రైతు.. శ్రీగంధం వంటి విలువైన కలప పంటతోపాటు 10 రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, ఆవులు, గొర్రెలు, పందెం కోళ్లతో పాటు మొక్కల నర్సరీ పెంచుతున్నారు. 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దేశానికే అద్భుత నమూనా క్షేత్రంగా మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏటా రూ. 25 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఇటీవల కవితను కేంద్ర వ్యవసాయ శాఖ ‘ఆనర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ పురస్కారంతో సత్కరించడం విశేషం. ఈ అవార్డును తన క్షేత్రంలో వ్యవసాయ కార్మికులకు అంకితం ఇచ్చిన ఉత్తమ రైతు కవిత.. స్ఫూర్తిదాయకమైన ఆమె వ్యవసాయాను భవాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా మాన్వి తాలూకా కవితల్ గ్రామం ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా స్వస్థలం. ఎమ్మెస్సీ, కంప్యూటర్ డిప్లొమా పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందారు. నియామక లేఖను భర్తకు చూపిస్తే.. ‘ఉద్యోగం వద్దులే. మన భూమిలో వ్యవసాయం చెయ్యి’ అన్నారట. భర్త మాటలకు ఆమె కుంగిపోలేదు. సవాలుగా తీసుకున్నారు. ఏసీ గదిలో కంప్యూటర్ ముందు పనిచేయాలన్న అభిలాష ఉన్నప్పటికీ.. పెద్దగా సారం లేని, ఇంచున్నర నీరున్న బోరుతో కూడిన తమ 8 ఎకరాల మెట్ట భూమిలోకి అడుగుపెట్టారు. తొలుత రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో దానిమ్మ తోటను సాగు చేసి బ్యాక్టీరియా తెగుళ్లవల్ల లక్షలాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు. ఆ చేదు అనుభవం నుంచి మెట్ట ప్రాంత రైతుగా రెండు గుణపాఠాలు నేర్చుకున్నారు. 1. ఒకే పంటను సాగు చేయకూడదు. ఒకే పొలంలో అనేక పంటలు, అంతర పంటలు సాగు చేయాలి. కేవలం పంటల మీదే ఆధారపడకూడదు. పశువులు, చిన్న జీవాలు, కోళ్లను సైతం పెంచుతూ.. అనేక విధాలుగా నిరంతరం ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. 2. ప్రకృతికి ఎదురీదటం కాదు, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి మేలు. ఈ గ్రహింపుతో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. శ్రీగంధం సాగుతోపాటు 10 రకాల సీజనల్ పండ్ల చెట్లు నాటి.. దేశం గర్వించదగిన ఆదర్శ మహిళా రైతుగా ఎదిగారు. ఆగ్రోఫారెస్ట్రీ, సమీకృత వ్యవసాయంలో అన్ని విషయాలపైనా ఆమెకు స్వీయానుభవంతోపాటు లోతైన అవగాహన ఉండటంతో.. ప్రాంతీయ, జాతీయ స్థాయి వర్క్‌షాపులలో రైతుగా తనకున్న అపారమైన జ్ఞానాన్ని పంచుతున్నారు. శ్రీగంధం+10 రకాల పండ్ల చెట్లు 2,100 శ్రీగంధం చెట్లతో పాటు వెయ్యి దానిమ్మ, 600 మామిడి, 300 జామ, 450 సీతాఫలం, 100 నేరేడు, 100 మునగ, 100 ఉసిరి, 200 నిమ్మ, 100 కొబ్బరి చెట్లను 8 ఎకరాల్లో కవిత పెంచుతున్నారు. పొలంలో ఒక్క చదరపు అడుగు కూడా ఖాళీగా వదలకుండా పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు. ట్రాక్టర్ కాదుకదా ఎద్దుల నాగలితో కూడా దుక్కి చెయ్యరు. ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవులు, వానపాములే భూమిని గుల్లపరిచి సారవంతం చేస్తాయంటారామె. డ్రిప్ మైక్రోట్యూబ్స్ ద్వారా ప్రతి పది రోజులకోసారి చెట్లకు జీవామృతం, పంచగవ్య, దశపర్ణికషాయం మార్చి మార్చి ఇస్తున్నారు. 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. ఆవులు.. గొర్రెలు.. పందెం కోళ్లు.. చెట్లు చిన్నగా ఉన్న దశలో కొన్ని ఏళ్ల పాటు కూరగాయలు, వేరుశనగ తదితర సీజనల్ అంతర పంటలు సాగు చేసుకునేవారు కవిత. 5 ఆవులు, 30 గొర్రెలు, 150 సేలం నుంచి తెచ్చిన డ్రాగన్ ఫైటర్స్ రకం పందెం కోళ్లను పెంచుతున్నారు. శ్రీగంధం, ఇతర పండ్ల విత్తనాలు సేకరించి, వాటితో మొక్కలు పెంచి అమ్ముతున్నారు. ఈ ఏడాది 6–7 క్వింటాళ్ల శ్రీగంధం విత్తనాలను సేకరించారు. కిలో విత్తనాలను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. ఏడాది వయసున్న శ్రీగంధం మొక్కను రూ.30కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల రైతులు కవిత నర్సరీ నుంచి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. రైతుకు రోజూ, వారం, నెల, సీజన్, 15 ఏళ్లకు.. నిరంతరం ఏదో ఒక విధంగా ఆదాయం వచ్చేలా సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించడం వ్యవసాయంపై కవితకు ఉన్న అపారమైన అవగాహన, శ్రద్ధకు నిదర్శనం. తోటలోనే ఇల్లు నిర్మించుకొని కవిత కుటుంబం నివసిస్తోంది. 5 వ్యవసాయ కార్మికుల కుటుంబాలతో సహా తోటలోనే మకాం ఉంటున్నారు. దీంతో ఆమె తన తోటను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రస్తుతం ఏడాదికి 8 ఎకరాల్లో రూ. 25 లక్షల వరకు ఆదాయం పొందుతున్నానని కవిత గర్వంగా చెబుతారు. మైక్రోచిప్‌తో శ్రీగంధం చెట్లకు రక్షణ శ్రీగంధం వంటి విలువైన జాతి చెట్లు పెరుగుతున్నాయంటే.. వాటితోపాటే అభద్రత కూడా పెరుగుతున్నట్లే. అయితే, ఏడేళ్లు పెరిగిన చెట్టుకు మైక్రో చిప్‌ను అమర్చడం ద్వారా అది దొంగల పాలు కాకుండా కాపాడుకోవచ్చని కవిత మిశ్రా తెలిపారు. తన తోటలో శ్రీగంధం చెట్లకు త్వరలో మైక్రోచిప్‌లను అమర్చుకోబోతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 2,500 ఖర్చవుతుంది. కర్నాటక ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ వుడ్‌సైన్స్ టెక్నాలజీలో సర్వర్‌తో అనుసంధానం అయి ఉండే ఈ చిప్ వల్ల.. ఎవరైనా చెట్టును తాకిన వెంటనే సర్వర్‌కు, రైతు మొబైల్‌కు, పోలీస్ స్టేషన్‌కు కూడా హెచ్చరిక సందేశం వస్తుంది. తద్వారా విలువైన శ్రీగంధం చెట్లను సులువుగా రక్షించుకోవచ్చని కవిత తెలిపారు. ప్రతి రైతూ ఒక ఎకరంలోనైనా శ్రీగంధం నాటాలి.. ఆత్మాభిమానం కలిగి ఉండే రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా తెలివితో ప్రణాళికాబద్ధంగా సమీకృత ప్రకృతి సేద్యం చేయాలని కవిత సూచిస్తున్నారు. ప్రతి రైతూ తమకున్న మొత్తం పొలంలో కాకపోయినా.. కనీసం ఒక ఎకరంలోనైనా ఈ పద్ధతిలో శ్రీగంధం, పండ్ల మొక్కలు వేసుకోవాలని సూచిస్తున్నారు. శ్రీగంధం 15 ఏళ్లకు ఎకరానికి కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీగంధం చెట్ల మధ్య నాటిన సీజనల్ పండ్ల చెట్లు బోనస్‌గా రైతుకు అందుతాయని, రైతులు ఉద్యోగుల మాదిరిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది మేలైన సాగు పద్ధతి అని కవిత మిశ్రా(94487 77045) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. అరుదైన విద్యాధిక ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా. ఆమె దీక్ష, దక్షతలకు ‘సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ఎకరానికి 300 శ్రీగంధం చెట్లు.. 2011లో కర్ణాటక ప్రభుత్వం శ్రీగంధం సాగుకు రైతులను అనుమితిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ కొత్తల్లోనే 12“12 అడుగుల దూరంలో ఎకరానికి 300 శ్రీగంధం మొక్కలు నాటారు. శ్రీగంధం తనంతట తాను పెరిగే చెట్టు కాదు. పక్కన ఉన్న చెట్ల వేర్లపై ఆధారపడి బతుకుతుంది. ప్రతి శ్రీగంధం మొక్కకు 6 అడుగుల దూరంలో మామిడి, జామ, చింత, నేరేడు, కరివేపాకు మొక్కలు విధిగా నాటాలన్నది కవిత అభిప్రాయం. నాటిన 15 ఏళ్లకు శ్రీగంధం కోతకు వస్తుంది. కాండంలో చేవ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ధర లభిస్తుంది. చెట్టుకు 20 కిలోల చేవ వచ్చినా ఎకరానికి 6 వేల కిలోల చేవ కలప దిగుబడి వస్తుంది. కిలో రూ. 8 వేల చొప్పున ఎకరానికి రూ. 4 కోట్ల 80 లక్షల ఆదాయం వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. ఆమె శ్రీగంధం తోట వయసు 6 ఏళ్ల 8 నెలల. మరో 8 ఏళ్లకు కోతకు వస్తుంది. చెట్టుకు 70 కిలోల శ్రీగంధం చావ వచ్చింది! 2002లో బత్తాయి తోట సాళ్ల మధ్యలో 20 శ్రీగంధం మొక్కలు నాటా. 10 సంవత్సరాల వరకు నీళ్లిచ్చా. ఆ తర్వాత వేసవిలో నీళ్లిచ్చి బతికించా. 14.5 ఏళ్లు పెరిగిన తర్వాత ఏడాదిన్నర క్రితం అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకొని చెట్లు నరికి అమ్మాను. చెట్టు కాండం లోపల చావ కలప (హార్డ్ ఉడ్) ఎంత ఎక్కువ వస్తే రైతుకు అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కొన్ని చెట్లకు 70 కిలోల వరకు వచ్చింది. కిలో రూ. 6 వేలకు అమ్మాను. ఆ చెట్టుకు 4,20,000 వచ్చింది. తాటి చెట్ల నీడ వల్ల కొన్ని చెట్లకు చావ 20–30 కిలోలు మాత్రమే వచ్చింది. ఈ చెట్ల గింజలు పడి మా భూముల్లో కొన్ని మొక్కలు మొలిచి, పెరుగుతున్నాయి. ఉద్యాన కమిషనర్ వెంకట్రామ్రెడ్డి చొరవతో ఇప్పుడు శ్రీగంధం మొక్కలతోపాటు డ్రిప్ కూడా రైతులకు ఇవ్వనున్నారు. శ్రీగంధం చెట్లు పెంచిన తర్వాత వాటిని నరకడానికి అటవీ శాఖ అనుమతుల కోసం తిరగాల్సి వస్తున్నది. అయితే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సులభంగా అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న చీఫ్ కన్సర్వేటర్ ఇటీవల చెప్పారు. ప్రతి రైతూ శ్రీగంధం చెట్లు వేసుకుంటే.. మున్ముందు మంచి ఆదాయం వస్తుంది. – విస్తారపు రెడ్డి (63043 91957), పసునూరు, నాంపల్లి మండలం, నల్లగొండ జిల్లా ఎర్ర నేలలు శ్రీగంధం సాగుకు అనువైనవి! కర్ణాటకలోని కవిత మిశ్రా ఆదర్శ రైతు. శ్రీగంధం చెట్లతో పాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, కోళ్లు, ఆవులు పెంచుతున్నారు. నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. రోజూ, ఆరు నెలలకు, 15 ఏళ్లకు ఆదాయం వచ్చేలా అనేక జాతుల చెట్లు, పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. ఆమె విజయగాథ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో శ్రీగంధం సాగును ప్రోత్సహిస్తున్నాం. నీటికొరత, ఎర్ర, గ్రావెల్ నేలలున్న తెలంగాణకు శ్రీగంధం సాగు చాలా అనువైనది. ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ఎకరానికి 3 ఏళ్లలో 18 వేల నుంచి 20 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ప్రతి రైతూ శ్రీగంధం మొక్కలు కనీసం పదైనా వేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుంది. అంతేకాదు, కార్బన్‌డయాక్సయిడ్‌ను పీల్చుకోవడం ద్వారా పర్యావరణానికి ఈ చెట్లు ఎంతో మేలు చేస్తాయి. మన దేశం సహా 8 దేశాల్లోనే శ్రీగంధం పెరుగుతుంది. కాబట్టి గిరాకీ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ములుగులోని ఉద్యాన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 18 లక్షల శ్రీగంధం మొక్కలు పెంచుతున్నాం. జూలై–ఆగస్టు నాటికి మొక్క రూ. 15–20 ధరకు రైతులకు అందిస్తాం. ముందుగా పేర్లు నమోదు చేయించుకున్న రైతులకే శ్రీగంధం మొక్కలు ఇస్తాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ ప్రసాద్(83744 49007)ను సంప్రదించవచ్చు. – ఎల్. వెంకట్రామ్రెడ్డి, కమిషనర్, తెలంగాణ ఉద్యాన శాఖ కవిత తోటలో ఉద్యాన కమిషనర్ తదితరులు తన తోటలో బత్తాయిలు, సీతాఫలాలతో కవిత మిశ్రా -
పందెం కోళ్లు
ఖరీదైన ఆహారం... ప్రత్యేక శిక్షణ కోడి పుంజులకు రాజభోగం సిద్ధం చేస్తున్న నూకన్ననాయుడు ఒక్కో పుంజు ధర రూ.5 వేల నుంచి 30 వేలు నక్కపల్లి: సంక్రాంతి వస్తోందంటే చాలు పందెం కోళ్లు ఒళ్లు విరుచుకుంటాయి. ప్రత్యర్థిని ఎదుర్కోడానికి సర్వ శక్తులూ కూడగట్టుకొని పందాలకు సిద్ధమవుతాయి. ఈ పందాలకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తుంటారు. లక్షలు, కోట్లలో కూడా పందాలు కాస్తుంటారు. పందెం రాయుళ్లు మేలుజాతి కోడిపుంజుల అన్వేషణలో పడతారు. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి, జాతి పుంజులపై బెట్టింగ్‌లు కట్టడానికి వెనుకాడరు. ఇటువంటి పందెం రాయుళ్ల కోసం నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టకు చెందిన పైల నూకన్ననాయుడు మేలుజాతి, ఖరీదైన కోడిపుంజుల పెంపకాన్ని చేపట్టాడు. మరో 20 రోజుల్లో సంక్రాంతి సంబరాలు ఊపందుకోనున్న నేపథ్యంలో మేలు జాతిరకాల కోడిపుంజులను తయారు చేసే పనిలో తలమునకలై ఉన్నాడు. ‘పందేలు వేసుకుంటారో లేక కొత్త అల్లుళ్లకు పందెం పుంజుల మాంసంతో విందు భోజనం పెట్టడానికి కొనుక్కుంటారో నాకనవసరం. జాతిరకాలైన కోడిపుంజులను సిద్ధం చేస్తున్నానని’ నూకన్ననాయుడు చెబుతున్నాడు. గ్రామీణ ప్రాంతంలో ఇతని వద్ద ఉన్న మేలు(జాతి)రకాల కోడిపుంజులు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడాలేవు. ఇవి ఒక్కొక్కటి రూ.5 వేల నుంచి 30 వేల రూపాయల ధర పలుకుతున్నాయి. భీమవరం, ఏలూరు, నర్సాపురం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి బడాబాబులు వచ్చి ఇతని వద్ద ఖరీదైన పుంజులు కొని తీసుకెళ్తుంటారు. పందెం కోళ్లలో ప్రధానంగా చెప్పుకునే పచ్చ కాకి, నల్లచవల, పసింగాల డేగ, నెమలి, సేతువ, పువల, రసంగి, నెమలి డేగ, కాకి డేగ, కాకి కువల, తెల్ల నెమలి, మైలా వంటి జాతిర కాలైన కోడిపుంజులు ఉన్నాయి. జాతి రకాలయిన కోడి పెట్టలను కొని తెచ్చి గుడ్లు పెట్టించి స్వయంగా ఉత్పత్తి చేపడుతున్నాడు. ఏడేళ్ల నుంచి ఇతను జాతిరకాలైన కోడిపుంజుల పెంపకంపైనే జీవనోపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం ఇతని వద్ద లక్షలాది రూపాయల విలువైన సుమారు 20 కోడిపుంజులు, పెట్టలు ఉన్నాయి. వీటికి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఒక్కొక్క కోడిపుంజుకు నెలకు రూ.3వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాడు. ఖరీదైన పౌష్టికాహారం కోడిపుంజు పుట్టిన ఏడు నెలల వరకు చోళ్లు, గోధుమ, ధాన్యం ఆహారంగా పెడతారు. ఏడో నెలదాటిన తర్వాత కోడి కూతకు వస్తుంది. అప్పటి నుంచి 3 నెలలపాటు బలమైన ఆహారం ఇస్తారు. ప్రతి రోజు పది బాదం పిక్కలు, ఒక పచ్చి కోడిగుడ్డు, మిరియాల పొడి, అశ్వగంధి, 50 గ్రాముల మాంసం, ఆహారంగా ఇస్తారు. ఇలా రెండు నెలలపాటు మేపి పందెం పుంజులుగా తయారు చేస్తారు. పందాల్లో అలుపు తట్టుకోవడం కోసం ప్రతిరోజు 30 నిమిషాలపాటు నీటిలో ఈతకు వదుల్తారు. నాలుగు కిలోల బరువు, ఏడాది వయసు వచ్చే వరకు మంచి పౌష్టికాహారంతో ఈ కోడి పుంజులను పెంచుతామని నూకన్నాయుడు తెలిపాడు. రెండునెలలపాటు పుంజులను ఈవిధంగా పెం చినందుకు ఒక్కొక్క దానికి రూ.3 వేల నుంచి 4 వేలు ఖర్చవుతుం దంటున్నాడు. ఇలా తయారయిన పుంజును రూ.20 వేల నుంచి 30 వేలకు విక్రయిస్తామని చెబుతున్నాడు. ఈ వృత్తి ప్రారంభించి ఇప్పటివరకు సుమారు 600కు పైగా జాతి కోడిపుంజులను అమ్మానని తెలిపాడు. పుంజుల బరువు ఎక్కువై పందాల్లో ఎగురలేవనే అనుమానం వచ్చినప్పుడు కూడా బరువు తగ్గించడం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటామంటున్నాడు. ఇటువంటి బరువు పెరిగిన కోడిపుంజులకు ఆముదం పట్టించి, వేడినీళ్లతో మసాజ్ చేస్తామంటున్నాడు. ఇలా చేస్తే శరీరం గట్టిపడి పుంజు తేలికవుతుందని, సులువుగా ఎగురగలుతుందంటున్నాడు. -
‘బరి’తెగింపు
సంక్రాంతి జాతరకు తెరలేచింది కత్తులు దూయనున్న పందెంకోళ్లు పేకాట, చిత్తులాటకు రంగం సిద్ధం పోలీసుల హెచ్చరికలు బేఖాతరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పెద్ద పండుగ పేరుతో.. సంప్రదాయం ముసుగులో పందెంకోళ్లు కత్తులు దూసుకునేందుకు రె‘ఢీ’ అయ్యాయి. పోలీసుల హెచ్చరికలు ‘మామూలే’నంటూ వాటిని పందెంరాయుళ్లు బేఖాతరు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు సంక్రాంతి సంబరాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ క్రమంలో కోడిపందేల బరులకు అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరైతే పోలీసులతో ముందస్తు రాయ‘బే’రాలు నడుపుతున్నారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తొచ్చేది కోడిపందేలేనని చెప్పక తప్పదు. పందెంరాయుళ్లు జిల్లాలోనే కాకుండా సరిహద్దులు దాటి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించే పందేల్లో పాల్గొనడం రివాజుగా వస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు పెద్దఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒకవైపు కోడిపందేలను అడ్డుకుంటామని పోలీసులు చేస్తున్న హెచ్చరికలు ‘మామూలే’నంటూ పందెంరాయుళ్లు‘బరి’తెగిస్తున్నారు. ఎక్కడా కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జె.ప్రభాకరరావు శనివారం పోలీస్ అధికారులకు హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఎక్కడైనా నిర్వహించినట్లు సమాచారం అందితే సంబంధిత ప్రాంత పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు హడావుడి చేస్తున్నా.. సోమవారం ఉదయానికి పరిస్థితి తమకు అనుకూలంగా మారిపోతుందనే భరోసాతో పందెంరాయుళ్లు ఉన్నారు. కోడిపందేల కేంద్రాల వద్ద మద్యంతోపాటు ఇతర వ్యాపారాలకు సంబంధించి దుకాణాలు ఏర్పాటుచేసేందుకు వేలంపాటలు నిర్వహించే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు పేకాట, చిత్తులాటల శిబిరాలను కూడా సిద్ధం చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిళ్లు.. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయా డివిజన్లలోని పోలీస్ అధికారులు ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. కోడిపందేల కేంద్రాల్లో జూదం పెచ్చుమీరకుండా చూడాలని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలకు ఉన్నతాధికారి ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రానికి పందేలకు అనుమతులు వచ్చేశాయంటూ కొందరు ప్రచారం కూడా మొదలెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో పందేలకు అనుమతిచ్చారని, జిల్లాలోనూ ఇచ్చేస్తారని ప్రచారం జరగడంతో పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. వదంతులు నమ్మవద్దు : ఎస్పీ జిల్లాలో కోడిపందేల నిర్వహణకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడిపందేల నిర్వహణకు అనుమతులు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1217 మంది పేకాటరాయుళ్లను అరెస్టుచేసి వారి నుంచి రూ. 5.98 లక్షలు, కోడిపందేలకు సంబంధించి 268 మందిని అరెస్టు చేసి రూ. 1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో 520 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా కోడిపందేలు, పేకాట నిర్వహిస్తుంటే 9491063910, 1090 నంబర్లకు సమాచారం అందిచాలని చెప్పారు. పందేలు జరిగేది ఎక్కడెక్కడ.. భారీస్థాయిలో కోడిపందేలకు పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైతే తాత్కాలికంగానైనా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బందరు మండలంలోని పోలాటితిప్ప గ్రామ సమీపంలోని కరకట్ట పక్కనే పందేలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. చాట్రాయి మండలంలో ఆరుగొలనుపేట, రెడ్డిగూడెం మండలం రంగాపురం మామిడితోటల్లో పందేలు నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పెడన నియోజకవర్గంలోని పెందుర్రు, అర్తమూరు, నాగేశ్వరరావుపేట, తుమ్మిడి గ్రామాల్లో పందేలు వేసేందుకు రంగం సిద్ధమైంది. కైకలూరు నియోజకవర్గంలోని భుజబలపట్నం, ఆవకూరు, తాడినాడ, కొచ్చర్లలో పందేల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.