‘బరి’తెగింపు
- సంక్రాంతి జాతరకు తెరలేచింది
- కత్తులు దూయనున్న పందెంకోళ్లు
- పేకాట, చిత్తులాటకు రంగం సిద్ధం
- పోలీసుల హెచ్చరికలు బేఖాతరు
జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పెద్ద పండుగ పేరుతో.. సంప్రదాయం ముసుగులో పందెంకోళ్లు కత్తులు దూసుకునేందుకు రె‘ఢీ’ అయ్యాయి. పోలీసుల హెచ్చరికలు ‘మామూలే’నంటూ వాటిని పందెంరాయుళ్లు బేఖాతరు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు సంక్రాంతి సంబరాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ క్రమంలో కోడిపందేల బరులకు అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరైతే పోలీసులతో ముందస్తు రాయ‘బే’రాలు నడుపుతున్నారు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తొచ్చేది కోడిపందేలేనని చెప్పక తప్పదు. పందెంరాయుళ్లు జిల్లాలోనే కాకుండా సరిహద్దులు దాటి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించే పందేల్లో పాల్గొనడం రివాజుగా వస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు పెద్దఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒకవైపు కోడిపందేలను అడ్డుకుంటామని పోలీసులు చేస్తున్న హెచ్చరికలు ‘మామూలే’నంటూ పందెంరాయుళ్లు‘బరి’తెగిస్తున్నారు. ఎక్కడా కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జె.ప్రభాకరరావు శనివారం పోలీస్ అధికారులకు హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఎక్కడైనా నిర్వహించినట్లు సమాచారం అందితే సంబంధిత ప్రాంత పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు హడావుడి చేస్తున్నా.. సోమవారం ఉదయానికి పరిస్థితి తమకు అనుకూలంగా మారిపోతుందనే భరోసాతో పందెంరాయుళ్లు ఉన్నారు. కోడిపందేల కేంద్రాల వద్ద మద్యంతోపాటు ఇతర వ్యాపారాలకు సంబంధించి దుకాణాలు ఏర్పాటుచేసేందుకు వేలంపాటలు నిర్వహించే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు పేకాట, చిత్తులాటల శిబిరాలను కూడా సిద్ధం చేస్తున్నారు.
పోలీసులపై ఒత్తిళ్లు..
రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయా డివిజన్లలోని పోలీస్ అధికారులు ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. కోడిపందేల కేంద్రాల్లో జూదం పెచ్చుమీరకుండా చూడాలని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలకు ఉన్నతాధికారి ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రానికి పందేలకు అనుమతులు వచ్చేశాయంటూ కొందరు ప్రచారం కూడా మొదలెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో పందేలకు అనుమతిచ్చారని, జిల్లాలోనూ ఇచ్చేస్తారని ప్రచారం జరగడంతో పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.
వదంతులు నమ్మవద్దు : ఎస్పీ
జిల్లాలో కోడిపందేల నిర్వహణకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడిపందేల నిర్వహణకు అనుమతులు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1217 మంది పేకాటరాయుళ్లను అరెస్టుచేసి వారి నుంచి రూ. 5.98 లక్షలు, కోడిపందేలకు సంబంధించి 268 మందిని అరెస్టు చేసి రూ. 1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో 520 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా కోడిపందేలు, పేకాట నిర్వహిస్తుంటే 9491063910, 1090 నంబర్లకు సమాచారం అందిచాలని చెప్పారు.
పందేలు జరిగేది ఎక్కడెక్కడ..
భారీస్థాయిలో కోడిపందేలకు పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైతే తాత్కాలికంగానైనా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బందరు మండలంలోని పోలాటితిప్ప గ్రామ సమీపంలోని కరకట్ట పక్కనే పందేలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు.
చాట్రాయి మండలంలో ఆరుగొలనుపేట, రెడ్డిగూడెం మండలం రంగాపురం మామిడితోటల్లో పందేలు నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
పెడన నియోజకవర్గంలోని పెందుర్రు, అర్తమూరు, నాగేశ్వరరావుపేట, తుమ్మిడి గ్రామాల్లో పందేలు వేసేందుకు రంగం సిద్ధమైంది.
కైకలూరు నియోజకవర్గంలోని భుజబలపట్నం, ఆవకూరు, తాడినాడ, కొచ్చర్లలో పందేల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.