ఘట్టమనేని శ్రావణ్‌కుమార్ వద్ద పెరుగుతున్న కోళ్లు
సాక్షి, అమరావతి బ్యూరో: చదివింది ఎంసీఏ. మంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బెంగళూరులో ఉద్యోగం. లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యంతో సొంత ఊరికి వచ్చాడు. ఇక్కడ తన పిల్లలకు నాటు కోడి గుడ్లు పెట్టాలనుకున్నాడు. మార్కెట్లో ఎంత వెతికినా దొరకలేదు. పైగా, నాటు కోడి పేరుతో జరుగతున్న మోసాలను గమనించాడు. అసలైన జాతి కోళ్లను పెంచితే మంచి గిరాకీ ఉంటుందని గ్రహించాడు. తీరిక వేళల్లో కోళ్లు పెంచాలన్న ఆలోచన తట్టింది. కానీ, కోళ్ల పెంపకంపై అవగాహన లేదు.
దీంతో పందెం కోళ్ల పెంపకంపై తెలిసిన వారి నుంచి కొంత, ఆన్‌లైన్‌లో మరికొంత సమాచారాన్ని సేకరించాడు. రూ.15 వేల పెట్టుబడితో కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో లభించే మేలు జాతి దేశీయ రకం కోళ్లతో పాటు విదేశీ జాతులను సేకరించి వాటి సంకరంతో కొత్త జాతి కోళ్లను వృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పందెం రాయుళ్లు కోళ్ల కోసం ఇప్పుడు వడ్లమూడికి వస్తున్నారు. ఇలా సాఫ్ట్‌వేర్‌తో పాటు కోళ్ల పెంపకంలోనూ రాణిస్తున్నాడు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి యువకుడు ఘట్టమనేని శ్రావణ్‌కుమార్.
పుంజుల వీర్యాన్ని సేకరించి
కోళ్ల పందెంలో దూకుడుగా బరిలో దిగటానికి కొంతమంది విదేశీ మేలు జాతి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. శ్రావణ్ మాత్రం దేశీయ రకం కోళ్ల జాతితో శాస్త్రీయ పద్ధతుల్లో మరింత మెరుగైన కోళ్ల ఉత్పత్తి చేస్తున్నాడు. ఎంపిక చేసుకున్న మేలు రకం పుంజుల వీర్యాన్ని సేకరించి నిల్వ చేస్తాడు. దాన్ని కొబ్బరినీళ్లు, సెలైన్ వాటర్‌లో కలిపి దేశీయ జాతి పెట్టలకు అందజేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పెట్టలు త్వరగా అలసిపోవు. అధిక, నాణ్యమైన గుడ్లను పెట్టే శక్తి వస్తుంది. ఆశించినట్లే మేలు రకం దేశీయ కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రెండేళ్లుగా కష్టపడి దేశీయ జాతిలో మంచి కోళ్లను సృష్టించానని, మరింత అభివృద్ధి చేసిన తర్వాత మార్కెట్‌లో అమ్మకానికి పెడతానని శ్రావణ్ చెబుతున్నాడు.
ఆన్‌లైన్‌లో అమ్మకాలు
నాణ్యమైన ఉత్పత్తితో పాటు మెరుగైన మార్కెటింగ్ ఉంటేనే అమ్మకాలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని శ్రావణ్ సోషల్ మీడియాలో ఘట్టమనేని ఫామ్స్ పేరిట ప్రత్యేక పేజీను తయారు చేసుకున్నాడు. తన వద్ద ఉన్న కోళ్ల ఫొటోలను అందులో పోస్ట్ చేస్తున్నాడు. వాటిని చూసి ఆర్డర్లు వస్తుండగా, మరికొంత మంది నేరుగా ఫామ్‌కి వచ్చి కొంటున్నారు. మోసానికి తావులేకుండా, కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టు అమ్మకాలు చేస్తుండటంతో మార్కెట్లో మంచి పేరు వచ్చిందని శ్రావణ్ చెబుతున్నాడు.
సంక్రాంతి టార్గెట్‌గా
శ్రావణ్ దగ్గర కోడిగుడ్డు, అప్పుడే పుట్టిన పిల్ల మొదలు రెండేళ్ల వయసు గల కోళ్లు ఉంటాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా వాటిని పెంచుతున్నాడు. తోక పుట్టుక, కోడి కాళ్లు, శరీరాకృతి ఆధారంగా రేటు వస్తుంది. వచ్చే సంక్రాంతి పండుగ టార్గెట్‌గా ఇప్పటి నుంచే కోళ్ల పెంపకం మొదలుపెట్టాడు. వడ్లమూడి, ఒంగోలు, బాపట్ల, వేటపాలెంలలో షెడ్లను ఏర్పాటు చేశాడు. తూర్పు జాతి, మెట్టవాటం, పచ్చకాకి, కాకిడేగ, సేతువు, నెమలి వంటి పలు రకాల కోళ్లు పెంచుతున్నాడు. ఒక్కొక్క గుడ్డు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నాడు. 15 రోజుల కోడి పిల్ల రూ.1,500, మూడు నెలల పిల్లలు రూ.3 వేలు, ఆరు నెలల పిల్లలు రూ.10 వేలు దాకా అమ్ముతున్నాడు. జాతిని బట్టి ఒక్కో కోడి రూ.3 లక్షల దాకా ఉంటాయని శ్రావణ్ చెబుతున్నాడు.
అవసరంతో మొదలుపెట్టి... అదనపు ఆదాయంగా
మార్కెట్‌లో అసలైన నాటు కోడి మాంసం, గుడ్లు లభించడంలేదు. దీంతో నేనే కోళ్ల పెంపకం మొదలుపెట్టాలన్న ఆలోచన మొదలైంది. తర్వాత ఇది అదనపు ఆదాయంగా మారింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 2 రెండు గంటల వరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తా. ఖాళీ సమయంలో కోళ్లను చూసుకుంటున్నాను. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన నా భార్య, అమ్మ, నాన్న నాకు సహాయంగా ఉంటున్నారు. పందెం కోళ్లకు అడ్రస్ ఘట్టమనేని ఫామ్స్ అని చెప్పుకొనేలా చేయడమే నా లక్ష్యం.
– ఘట్టమనేని శ్రావణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment