Srigandham
-
శ్రీగంధం చెట్లు పెంచాలనుకునే వారికి శుభవార్త
-
ఎర్ర చందనమే వారికి వరకట్నం
భాకరాపేట (తిరుపతి జిల్లా): చైనాలోని కుటుంబ వ్యవస్థల్లో ఎర్ర చందనానికి ఉండే విలువ అంతాఇంతా కాదు. ఎర్ర చందనంతో చేసిన వస్తువులను వరకట్నంగా ఇవ్వడాన్ని అక్కడి వారు చాలా గొప్పగా, గర్వంగా ఫీలవుతుంటారు. ఎర్ర చందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్ర చందనంతో చేసిన పూసలను బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ ఒక కేజీ ఎర్ర చందనం దుంగ నుంచి కీ చైన్లు, పూసలు తయారుచేసి అమ్మితే సుమారు రూ.25 వేలు వస్తుంది. టన్ను ఎర్ర చందనం ధర అక్కడ రూ.2.50 కోట్లు పలుకుతోంది కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. అదృష్టం తెస్తుందని.. ఎర్ర చందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చందనం ముక్క ఉంటే.. అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యం కోసం క్రీమ్‌లు, పౌడర్‌గానూ వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఎర్ర చందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే బీపీ, షుగర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు. మన దేశంలో తప్ప ఎక్కడా దొరకదు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎర్ర చందనం దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్ర చందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు. ఎర్ర చందనం, శ్రీగంధం వేర్వేరు ఎర్ర చందనం, శ్రీ గంధం వృక్షాలు రెండూ సుగంధ ద్రవ్య వృక్షాలే అయినా వృక్ష శాస్త్రపరంగా రెండూ ఒకే జాతికి చెందినవి కావు. ఎర్ర చందనానికి వాసన కన్నా రంగు ఎక్కువ. దీనిని వృక్ష శాస్త్రంలో టెర్రోకార్పస్ శాంటాలీనస్ అంటారు. ఎర్ర చందనం మధ్య భాగం చాలా ధర పలుకుతుంది. ఘనపుటడుగు దాదాపు రూ.లక్షల్లో ఉంటుంది. చాలా దృఢంగాను, ముదురు ఎరుపు రంగులో ఉండటం వల్ల ఈ కలపను ఖరీదైన నిర్మాణాల్లోను, చైనా ఇతర దేశాలు వారు తినడానికి వాడే పుల్లల తయారీలోనూ, ఎర్రని పౌడర్ తయారీలోను ఎర్రచందనాన్ని వాడుతున్నారు. శ్రీగంధం చెట్టును శాస్త్రీయంగా శాంటాలమ్ పేనిక్యూలాటమ్ అంటారు. ఇవి ఎర్రచందనం లాగా దృఢంగా ఉండవు. గరుకుగా ఉన్న బండపై నీరు పోసి రాస్తే పసుపు రంగులో ఉన్న లేపనం లభిస్తుంది. ఈ చెట్టు నుంచి తీసిన నూనె సుగంధ ద్రవ్యాలు, సబ్బుల తయారీలోనూ వాడుతారు. – ప్రభాకర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజర్ -
సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం
సాక్షి, ఆళ్లగడ్డ: డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటే అవుననే అంటున్నారు శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులు. ఏళ్లతరబడిగా ఒకే తీరు పంటలు వేస్తూ దిగుబడులు రాక పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ఇప్పుడిప్పుడే ఇతర పంటలు, లాభదాయక సాగుపై దృష్టిసారిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అటవీ సమీప గ్రామాల రైతులు ఎక్కువగా శ్రీగంధం, ఎర్రచందనం, అగర్ ఉడ్, మల్బరీ వేప, మహాగని తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి రెండేళ్లు కష్టపడితే అవి పెరిగి పెద్దవై రూ.కోట్లలో ఆదాయం తెచ్చి పెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు అవసరం లేదు సిరి సంపదల గని శ్రీగంధం. అడవి సంపదలో రారాజు ఎర్రచందనం. ఇవి ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన ధర పలికే చెట్లుగా వెలుగొందుతున్నాయి. అయితే, ఇవి దట్టమైన అడవుల్లో మాత్రమే లభించే చెట్లు. వీటి చెక్కను ఎన్నో ఔషధాల్లో, కాస్మోటిక్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం వీటి వినియో గం పెరగడంతో అంతరించి పోతున్న అరుదైన జాతి సంపదను స్మగ్లర్ల బారి నుంచి సంరక్షించుకునేందుకు ప్రభుత్వం వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో శ్రీగంధం మినహా మిగతా మొక్కలను సో షల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి కొన్ని రకాలు ఉచితంగా మరి కొన్ని రకాల మొక్కలు నామమాత్రపు ధరకు రైతులకు అందజేస్తోంది. దీంతో జిల్లాలో పలువురు వీటిని సా గు చేస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లో అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అనుమతులు ఇస్తోంది. దీంతో జిల్లాలో ప్ర స్తుతం ఎర్రచందనం, శ్రీగంధం సుమారు 80 హెక్టార్లలో సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీగంధం చెట్టు రైతుకు ఆదాయం.. వాతావరణ పరిరక్షణ శ్రీగంధం, ఎర్రచందనం పెంపకం చాలా తేలిక. అటవీ సాగు మొక్కలైన టేకు, జామాయిల్, సుబాబుల్ మొక్కలు మాదిరే వీటిని పెంచవచ్చు. నీరు నిలవని మెట్టభూములు వీటి సాగుకు అనుకూలం. ఈ మొక్కలకు ఎటువంటి క్రిమి కీటకాలు ఆశించవు. రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి నాలుగైదు సార్లు నీటితడులు, ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. గంధం, చందనం సాగు రైతులకు ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. సాగు ఇలా.. ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 560 మొక్కలు నాటుకోవచ్చు. ఎర్రచందనం మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి ఉచితంగా అందజేస్తారు. శ్రీగంధం మొక్కలు ప్రైవేటు నర్సరీల్లో లభ్యమవుతాయి. మొక్కలు నాటిన మూడు, నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు, సాగు చేసుకోవచ్చు. సాగు వ్యయం ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతుందని అంచనా. పచ్చని బంగారం శ్రీగంధం ఎర్రచందనం తరువాత శ్రీగంధం కలపకు భారీ డిమాండ్ ఉంటుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే. శ్రీగంధం చెక్కను సెంట్లు, అగరబత్తీలు, సబ్బులు, అందమైన బొమ్మలు తయారీలో వినియోగిస్తారు. ఒక కిలో ధర రూ. 8 వేల నుంచి రూ. 16వేల వరకు ఉంటుంది. 12 నుంచి 15 ఏళ్లు తరువాత ఒక్కో చెట్టు నుంచి 15 నుంచి 20 కిలోల వరకూ పొందవచ్చు. దీంతో ఒక్కో చెట్టు నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం లభిస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని దొంగల బారిన పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది. పెరిగి పెద్దయితే ఎర్ర బంగారమే.. ఎర్రచందనం 15 సంవత్సరాల వయసు తరువాత ఈ చెట్లు గరిష్టంగా 20 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. వీటిని నరికితే ఎకరాకు 200 నుంచి 300 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏ – గ్రేడు దుంగలకు టన్ను రూ 60 లక్షలు, బి–గ్రేడు రూ. 40 లక్షలు, సీ–గ్రేడు రూ. 31 లక్షలు ధరలుగా నిర్ణయించారు. ఈ లెక్కన కనీసం సీ గ్రేడు రకానికి లెక్కేసినా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాగులో పాటించాల్సిన మెలకువలు ►నాటిన మొదటి సంవత్సరం మొక్కల బతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మొదటి రెండేళ్ల పాటు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మొక్కలు నేలలో స్థిరపడి బాగా పెరుగుతాయి ►వీటిని మెట్ట,గరప నేలల్లో సాగు చేయవచ్చు ►ఎకరాకు 560వరకు మొక్కలు నాటుకోవచ్చు ►మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి ►శ్రీ గంధం వేర్లకు సొంతంగా పోషకాలను గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. అందుబాటులో చెట్ల వేర్లతో శ్రీగంధం వేర్లు పెనవేసుకొని వాటి నుంచే తేమను పోషకాలను సంగ్రహిస్తాయి. ►నాటిన మూడేళ్ల వరకు శ్రీగంధానికి అందు బాటులో ఏదో ఒక మొక్క ఉండి తీరాల్సిందే. -
పచ్చని బంగారం శ్రీగంధం!
కవిత మిశ్రా.. విలక్షణ మహిళా రైతు.. శ్రీగంధం వంటి విలువైన కలప పంటతోపాటు 10 రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, ఆవులు, గొర్రెలు, పందెం కోళ్లతో పాటు మొక్కల నర్సరీ పెంచుతున్నారు. 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దేశానికే అద్భుత నమూనా క్షేత్రంగా మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏటా రూ. 25 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఇటీవల కవితను కేంద్ర వ్యవసాయ శాఖ ‘ఆనర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ పురస్కారంతో సత్కరించడం విశేషం. ఈ అవార్డును తన క్షేత్రంలో వ్యవసాయ కార్మికులకు అంకితం ఇచ్చిన ఉత్తమ రైతు కవిత.. స్ఫూర్తిదాయకమైన ఆమె వ్యవసాయాను భవాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా మాన్వి తాలూకా కవితల్ గ్రామం ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా స్వస్థలం. ఎమ్మెస్సీ, కంప్యూటర్ డిప్లొమా పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందారు. నియామక లేఖను భర్తకు చూపిస్తే.. ‘ఉద్యోగం వద్దులే. మన భూమిలో వ్యవసాయం చెయ్యి’ అన్నారట. భర్త మాటలకు ఆమె కుంగిపోలేదు. సవాలుగా తీసుకున్నారు. ఏసీ గదిలో కంప్యూటర్ ముందు పనిచేయాలన్న అభిలాష ఉన్నప్పటికీ.. పెద్దగా సారం లేని, ఇంచున్నర నీరున్న బోరుతో కూడిన తమ 8 ఎకరాల మెట్ట భూమిలోకి అడుగుపెట్టారు. తొలుత రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో దానిమ్మ తోటను సాగు చేసి బ్యాక్టీరియా తెగుళ్లవల్ల లక్షలాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు. ఆ చేదు అనుభవం నుంచి మెట్ట ప్రాంత రైతుగా రెండు గుణపాఠాలు నేర్చుకున్నారు. 1. ఒకే పంటను సాగు చేయకూడదు. ఒకే పొలంలో అనేక పంటలు, అంతర పంటలు సాగు చేయాలి. కేవలం పంటల మీదే ఆధారపడకూడదు. పశువులు, చిన్న జీవాలు, కోళ్లను సైతం పెంచుతూ.. అనేక విధాలుగా నిరంతరం ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. 2. ప్రకృతికి ఎదురీదటం కాదు, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి మేలు. ఈ గ్రహింపుతో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. శ్రీగంధం సాగుతోపాటు 10 రకాల సీజనల్ పండ్ల చెట్లు నాటి.. దేశం గర్వించదగిన ఆదర్శ మహిళా రైతుగా ఎదిగారు. ఆగ్రోఫారెస్ట్రీ, సమీకృత వ్యవసాయంలో అన్ని విషయాలపైనా ఆమెకు స్వీయానుభవంతోపాటు లోతైన అవగాహన ఉండటంతో.. ప్రాంతీయ, జాతీయ స్థాయి వర్క్‌షాపులలో రైతుగా తనకున్న అపారమైన జ్ఞానాన్ని పంచుతున్నారు. శ్రీగంధం+10 రకాల పండ్ల చెట్లు 2,100 శ్రీగంధం చెట్లతో పాటు వెయ్యి దానిమ్మ, 600 మామిడి, 300 జామ, 450 సీతాఫలం, 100 నేరేడు, 100 మునగ, 100 ఉసిరి, 200 నిమ్మ, 100 కొబ్బరి చెట్లను 8 ఎకరాల్లో కవిత పెంచుతున్నారు. పొలంలో ఒక్క చదరపు అడుగు కూడా ఖాళీగా వదలకుండా పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు. ట్రాక్టర్ కాదుకదా ఎద్దుల నాగలితో కూడా దుక్కి చెయ్యరు. ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవులు, వానపాములే భూమిని గుల్లపరిచి సారవంతం చేస్తాయంటారామె. డ్రిప్ మైక్రోట్యూబ్స్ ద్వారా ప్రతి పది రోజులకోసారి చెట్లకు జీవామృతం, పంచగవ్య, దశపర్ణికషాయం మార్చి మార్చి ఇస్తున్నారు. 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. ఆవులు.. గొర్రెలు.. పందెం కోళ్లు.. చెట్లు చిన్నగా ఉన్న దశలో కొన్ని ఏళ్ల పాటు కూరగాయలు, వేరుశనగ తదితర సీజనల్ అంతర పంటలు సాగు చేసుకునేవారు కవిత. 5 ఆవులు, 30 గొర్రెలు, 150 సేలం నుంచి తెచ్చిన డ్రాగన్ ఫైటర్స్ రకం పందెం కోళ్లను పెంచుతున్నారు. శ్రీగంధం, ఇతర పండ్ల విత్తనాలు సేకరించి, వాటితో మొక్కలు పెంచి అమ్ముతున్నారు. ఈ ఏడాది 6–7 క్వింటాళ్ల శ్రీగంధం విత్తనాలను సేకరించారు. కిలో విత్తనాలను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. ఏడాది వయసున్న శ్రీగంధం మొక్కను రూ.30కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల రైతులు కవిత నర్సరీ నుంచి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. రైతుకు రోజూ, వారం, నెల, సీజన్, 15 ఏళ్లకు.. నిరంతరం ఏదో ఒక విధంగా ఆదాయం వచ్చేలా సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించడం వ్యవసాయంపై కవితకు ఉన్న అపారమైన అవగాహన, శ్రద్ధకు నిదర్శనం. తోటలోనే ఇల్లు నిర్మించుకొని కవిత కుటుంబం నివసిస్తోంది. 5 వ్యవసాయ కార్మికుల కుటుంబాలతో సహా తోటలోనే మకాం ఉంటున్నారు. దీంతో ఆమె తన తోటను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రస్తుతం ఏడాదికి 8 ఎకరాల్లో రూ. 25 లక్షల వరకు ఆదాయం పొందుతున్నానని కవిత గర్వంగా చెబుతారు. మైక్రోచిప్‌తో శ్రీగంధం చెట్లకు రక్షణ శ్రీగంధం వంటి విలువైన జాతి చెట్లు పెరుగుతున్నాయంటే.. వాటితోపాటే అభద్రత కూడా పెరుగుతున్నట్లే. అయితే, ఏడేళ్లు పెరిగిన చెట్టుకు మైక్రో చిప్‌ను అమర్చడం ద్వారా అది దొంగల పాలు కాకుండా కాపాడుకోవచ్చని కవిత మిశ్రా తెలిపారు. తన తోటలో శ్రీగంధం చెట్లకు త్వరలో మైక్రోచిప్‌లను అమర్చుకోబోతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 2,500 ఖర్చవుతుంది. కర్నాటక ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ వుడ్‌సైన్స్ టెక్నాలజీలో సర్వర్‌తో అనుసంధానం అయి ఉండే ఈ చిప్ వల్ల.. ఎవరైనా చెట్టును తాకిన వెంటనే సర్వర్‌కు, రైతు మొబైల్‌కు, పోలీస్ స్టేషన్‌కు కూడా హెచ్చరిక సందేశం వస్తుంది. తద్వారా విలువైన శ్రీగంధం చెట్లను సులువుగా రక్షించుకోవచ్చని కవిత తెలిపారు. ప్రతి రైతూ ఒక ఎకరంలోనైనా శ్రీగంధం నాటాలి.. ఆత్మాభిమానం కలిగి ఉండే రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా తెలివితో ప్రణాళికాబద్ధంగా సమీకృత ప్రకృతి సేద్యం చేయాలని కవిత సూచిస్తున్నారు. ప్రతి రైతూ తమకున్న మొత్తం పొలంలో కాకపోయినా.. కనీసం ఒక ఎకరంలోనైనా ఈ పద్ధతిలో శ్రీగంధం, పండ్ల మొక్కలు వేసుకోవాలని సూచిస్తున్నారు. శ్రీగంధం 15 ఏళ్లకు ఎకరానికి కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీగంధం చెట్ల మధ్య నాటిన సీజనల్ పండ్ల చెట్లు బోనస్‌గా రైతుకు అందుతాయని, రైతులు ఉద్యోగుల మాదిరిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది మేలైన సాగు పద్ధతి అని కవిత మిశ్రా(94487 77045) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. అరుదైన విద్యాధిక ఆదర్శ మహిళా రైతు కవిత మిశ్రా. ఆమె దీక్ష, దక్షతలకు ‘సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ఎకరానికి 300 శ్రీగంధం చెట్లు.. 2011లో కర్ణాటక ప్రభుత్వం శ్రీగంధం సాగుకు రైతులను అనుమితిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ కొత్తల్లోనే 12“12 అడుగుల దూరంలో ఎకరానికి 300 శ్రీగంధం మొక్కలు నాటారు. శ్రీగంధం తనంతట తాను పెరిగే చెట్టు కాదు. పక్కన ఉన్న చెట్ల వేర్లపై ఆధారపడి బతుకుతుంది. ప్రతి శ్రీగంధం మొక్కకు 6 అడుగుల దూరంలో మామిడి, జామ, చింత, నేరేడు, కరివేపాకు మొక్కలు విధిగా నాటాలన్నది కవిత అభిప్రాయం. నాటిన 15 ఏళ్లకు శ్రీగంధం కోతకు వస్తుంది. కాండంలో చేవ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ధర లభిస్తుంది. చెట్టుకు 20 కిలోల చేవ వచ్చినా ఎకరానికి 6 వేల కిలోల చేవ కలప దిగుబడి వస్తుంది. కిలో రూ. 8 వేల చొప్పున ఎకరానికి రూ. 4 కోట్ల 80 లక్షల ఆదాయం వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. ఆమె శ్రీగంధం తోట వయసు 6 ఏళ్ల 8 నెలల. మరో 8 ఏళ్లకు కోతకు వస్తుంది. చెట్టుకు 70 కిలోల శ్రీగంధం చావ వచ్చింది! 2002లో బత్తాయి తోట సాళ్ల మధ్యలో 20 శ్రీగంధం మొక్కలు నాటా. 10 సంవత్సరాల వరకు నీళ్లిచ్చా. ఆ తర్వాత వేసవిలో నీళ్లిచ్చి బతికించా. 14.5 ఏళ్లు పెరిగిన తర్వాత ఏడాదిన్నర క్రితం అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకొని చెట్లు నరికి అమ్మాను. చెట్టు కాండం లోపల చావ కలప (హార్డ్ ఉడ్) ఎంత ఎక్కువ వస్తే రైతుకు అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కొన్ని చెట్లకు 70 కిలోల వరకు వచ్చింది. కిలో రూ. 6 వేలకు అమ్మాను. ఆ చెట్టుకు 4,20,000 వచ్చింది. తాటి చెట్ల నీడ వల్ల కొన్ని చెట్లకు చావ 20–30 కిలోలు మాత్రమే వచ్చింది. ఈ చెట్ల గింజలు పడి మా భూముల్లో కొన్ని మొక్కలు మొలిచి, పెరుగుతున్నాయి. ఉద్యాన కమిషనర్ వెంకట్రామ్రెడ్డి చొరవతో ఇప్పుడు శ్రీగంధం మొక్కలతోపాటు డ్రిప్ కూడా రైతులకు ఇవ్వనున్నారు. శ్రీగంధం చెట్లు పెంచిన తర్వాత వాటిని నరకడానికి అటవీ శాఖ అనుమతుల కోసం తిరగాల్సి వస్తున్నది. అయితే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సులభంగా అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న చీఫ్ కన్సర్వేటర్ ఇటీవల చెప్పారు. ప్రతి రైతూ శ్రీగంధం చెట్లు వేసుకుంటే.. మున్ముందు మంచి ఆదాయం వస్తుంది. – విస్తారపు రెడ్డి (63043 91957), పసునూరు, నాంపల్లి మండలం, నల్లగొండ జిల్లా ఎర్ర నేలలు శ్రీగంధం సాగుకు అనువైనవి! కర్ణాటకలోని కవిత మిశ్రా ఆదర్శ రైతు. శ్రీగంధం చెట్లతో పాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, కోళ్లు, ఆవులు పెంచుతున్నారు. నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. రోజూ, ఆరు నెలలకు, 15 ఏళ్లకు ఆదాయం వచ్చేలా అనేక జాతుల చెట్లు, పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. ఆమె విజయగాథ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో శ్రీగంధం సాగును ప్రోత్సహిస్తున్నాం. నీటికొరత, ఎర్ర, గ్రావెల్ నేలలున్న తెలంగాణకు శ్రీగంధం సాగు చాలా అనువైనది. ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ఎకరానికి 3 ఏళ్లలో 18 వేల నుంచి 20 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ప్రతి రైతూ శ్రీగంధం మొక్కలు కనీసం పదైనా వేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుంది. అంతేకాదు, కార్బన్‌డయాక్సయిడ్‌ను పీల్చుకోవడం ద్వారా పర్యావరణానికి ఈ చెట్లు ఎంతో మేలు చేస్తాయి. మన దేశం సహా 8 దేశాల్లోనే శ్రీగంధం పెరుగుతుంది. కాబట్టి గిరాకీ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ములుగులోని ఉద్యాన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 18 లక్షల శ్రీగంధం మొక్కలు పెంచుతున్నాం. జూలై–ఆగస్టు నాటికి మొక్క రూ. 15–20 ధరకు రైతులకు అందిస్తాం. ముందుగా పేర్లు నమోదు చేయించుకున్న రైతులకే శ్రీగంధం మొక్కలు ఇస్తాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ ప్రసాద్(83744 49007)ను సంప్రదించవచ్చు. – ఎల్. వెంకట్రామ్రెడ్డి, కమిషనర్, తెలంగాణ ఉద్యాన శాఖ కవిత తోటలో ఉద్యాన కమిషనర్ తదితరులు తన తోటలో బత్తాయిలు, సీతాఫలాలతో కవిత మిశ్రా -
శ్రీగంధం మొక్కలు స్వాధీనం
నంద్యాల: నల్లమల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న శ్రీ«గంధం మొక్కలను అటవీ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన మాబు గిద్దలూరు నుంచి నంద్యాలకు వస్తున్న శీతల పానియాల లారీ ఎక్కారు. అటవీ శాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు అయ్యలూరు మెట్ట వద్ద లారీ ఆపి మాబును సోదా చేశారు. అతని వద్ద దాదాపు రూ.25వేల విలువ గల 11కేజీల శ్రీగంధం మొక్కలు లభ్యమయ్యాయి. అతడితో పాటు లారీ డ్రైవర్ బాలకృష్ణను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సోదాల్లో అటవీ శాఖ టౌన్ రేంజ్ అధికారి అబ్దుల్‌ఖాదర్, బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య పాల్గొన్నారు. -
200 ఏళ్లకు సరిపడా శ్రీగంధం సిద్ధం
– టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో – భక్తులకు త్వరలో వృక్షప్రసాదం సాక్షి,తిరుమల: శేషాచలంలో ప్రస్తుతం 12 హెక్టార్లలో శ్రీగంధం వనం అభివృద్ధి చేశామని, ఈ ఏడాది సెప్టెంబరుకు మొత్తం 100 హెక్టార్లకు విస్తరించి శ్రీవారి ఆలయ పూజా కైంకర్యాలకు మరో రెండు వందల సంవత్సరాలకు సరిపడా శ్రీగంధం సిద్ధం చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి పారువేట మండపం వద్ద ‘‘వనం–మనం’’ కార్యక్రమంలో భాగంగా శ్రీగంధం మొక్కలు నాటారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి అభిషేకం, వసంతోత్సవం స్నపన తిరుమంజనాది కైంకర్యాల్లో ఏటా సుమారు 500 కిలోల శ్రీగంధం వాడుతున్నామని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే 2013 నుంచి శ్రీగంధం వనాన్ని టీటీడీనే సొంతంగా పెంచుకునే ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు. టీటీడీ నర్సరీల్లో మొత్తం 10 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచామన్నారు. వీటిలో రెండు లక్షల మొక్కల్ని ఉచితంగా రైతులకు , ఏపీ అటవీశాఖకు పంపిణీ చేశామని, మరో 8 లక్షల మొక్కలు ముందుకొచ్చే సంస్థలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే వృక్షప్రసాదం కింద భక్తులకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. -
రూ.45 లక్షల విలువైన శ్రీగంధం పట్టివేత
వేలూరు, న్యూస్‌లైన్: ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని పొన్నై వద్ద ఉన్న మామిడి తోపులో రూ.45 లక్షల విలువ చేసే శ్రీగంధం దుంగలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీ సుల కథనం మేరకు.. వేలూరు జిల్లా పొన్నై సమీపంలోని శ్రీనివాసపురం గ్రా మం వద్ద కాట్పాడి గాంధీనగర్‌కు చెం దిన టీకారామన్‌కు మామిడి తోపు ఉం ది. ఇక్కడ నుంచి శ్రీగంధం దుంగలను ఆంధ్రకు తరలిస్తున్నట్లు మంగళవారం రాత్రి పొన్నై పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ గాండీబన్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని మామిడి తోపులో కాపలా ఉన్న వారిని విచారించారు. అనుమానం రావడంతో తనిఖీ చేశారు. అక్కడున్న ఓ ఇంట్లో శ్రీగంధం దుంగలను గుర్తించి జిల్లా ఫారెస్ట్ అధికారి రాజా మోహన్‌కు సమాచారం అందించారు. దీంతో డీఎఫ్‌వో, ఫారెస్ట్ రేంజ్ అధికారి విజయ్ సంఘటన స్థలానికి చేరుకుని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.45లక్షల విలువైన 11 టన్నుల దుంగ లను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మామిడి తోపు యజమాని టీకారామన్, వేలూరు వడక్కుపేటకు చెం దిన జ్యోతిలింగం, వూసూర్‌కు చెందిన రాజ్‌కుమార్, సోయవరానికి చెందిన అన్బును అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ శ్రీగంధాన్ని కారులో రాత్రి వేళల్లో ఆంధ్ర రాష్ట్రానికి తరలిం చేందుకు ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి..? వీటిని ఎక్కడికి తరలిస్తున్నారు.? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.