మొక్కలతో చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, తదితరులు
200 ఏళ్లకు సరిపడా శ్రీగంధం సిద్ధం
Published Fri, Jul 29 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
– టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో
– భక్తులకు త్వరలో వృక్షప్రసాదం
సాక్షి,తిరుమల:
శేషాచలంలో ప్రస్తుతం 12 హెక్టార్లలో శ్రీగంధం వనం అభివృద్ధి చేశామని, ఈ ఏడాది సెప్టెంబరుకు మొత్తం 100 హెక్టార్లకు విస్తరించి శ్రీవారి ఆలయ పూజా కైంకర్యాలకు మరో రెండు వందల సంవత్సరాలకు సరిపడా శ్రీగంధం సిద్ధం చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి పారువేట మండపం వద్ద ‘‘వనం–మనం’’ కార్యక్రమంలో భాగంగా శ్రీగంధం మొక్కలు నాటారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి అభిషేకం, వసంతోత్సవం స్నపన తిరుమంజనాది కైంకర్యాల్లో ఏటా సుమారు 500 కిలోల శ్రీగంధం వాడుతున్నామని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే 2013 నుంచి శ్రీగంధం వనాన్ని టీటీడీనే సొంతంగా పెంచుకునే ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు. టీటీడీ నర్సరీల్లో మొత్తం 10 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచామన్నారు. వీటిలో రెండు లక్షల మొక్కల్ని ఉచితంగా రైతులకు , ఏపీ అటవీశాఖకు పంపిణీ చేశామని, మరో 8 లక్షల మొక్కలు ముందుకొచ్చే సంస్థలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే వృక్షప్రసాదం కింద భక్తులకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.
Advertisement