ఆళ్లగడ్డలో సాగు చేసిన శ్రీగంధం, ఎర్రచందనం
సాక్షి, ఆళ్లగడ్డ: డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటే అవుననే అంటున్నారు శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులు. ఏళ్లతరబడిగా ఒకే తీరు పంటలు వేస్తూ దిగుబడులు రాక పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ఇప్పుడిప్పుడే ఇతర పంటలు, లాభదాయక సాగుపై దృష్టిసారిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అటవీ సమీప గ్రామాల రైతులు ఎక్కువగా శ్రీగంధం, ఎర్రచందనం, అగర్ ఉడ్, మల్బరీ వేప, మహాగని తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి రెండేళ్లు కష్టపడితే అవి పెరిగి పెద్దవై రూ.కోట్లలో ఆదాయం తెచ్చి పెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు అవసరం లేదు
సిరి సంపదల గని శ్రీగంధం. అడవి సంపదలో రారాజు ఎర్రచందనం. ఇవి ప్రపంచ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ధర పలికే చెట్లుగా వెలుగొందుతున్నాయి. అయితే, ఇవి దట్టమైన అడవుల్లో మాత్రమే లభించే చెట్లు. వీటి చెక్కను ఎన్నో ఔషధాల్లో, కాస్మోటిక్‌లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం వీటి వినియో గం పెరగడంతో అంతరించి పోతున్న అరుదైన జాతి సంపదను స్మగ్లర్ల బారి నుంచి సంరక్షించుకునేందుకు ప్రభుత్వం వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో శ్రీగంధం మినహా మిగతా మొక్కలను సో షల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి కొన్ని రకాలు ఉచితంగా మరి కొన్ని రకాల మొక్కలు నామమాత్రపు ధరకు రైతులకు అందజేస్తోంది. దీంతో జిల్లాలో పలువురు వీటిని సా గు చేస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్‌లో అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అనుమతులు ఇస్తోంది. దీంతో జిల్లాలో ప్ర స్తుతం ఎర్రచందనం, శ్రీగంధం సుమారు 80 హెక్టార్లలో సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు.
శ్రీగంధం చెట్టు
రైతుకు ఆదాయం.. వాతావరణ పరిరక్షణ
శ్రీగంధం, ఎర్రచందనం పెంపకం చాలా తేలిక. అటవీ సాగు మొక్కలైన టేకు, జామాయిల్, సుబాబుల్ మొక్కలు మాదిరే వీటిని పెంచవచ్చు. నీరు నిలవని మెట్టభూములు వీటి సాగుకు అనుకూలం. ఈ మొక్కలకు ఎటువంటి క్రిమి కీటకాలు ఆశించవు. రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి నాలుగైదు సార్లు నీటితడులు, ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. గంధం, చందనం సాగు రైతులకు ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు.
సాగు ఇలా..
ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 560 మొక్కలు నాటుకోవచ్చు. ఎర్రచందనం మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి ఉచితంగా అందజేస్తారు. శ్రీగంధం మొక్కలు ప్రైవేటు నర్సరీల్లో లభ్యమవుతాయి. మొక్కలు నాటిన మూడు, నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు, సాగు చేసుకోవచ్చు. సాగు వ్యయం ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతుందని అంచనా.
పచ్చని బంగారం శ్రీగంధం
ఎర్రచందనం తరువాత శ్రీగంధం కలపకు భారీ డిమాండ్ ఉంటుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే. శ్రీగంధం చెక్కను సెంట్లు, అగరబత్తీలు, సబ్బులు, అందమైన బొమ్మలు తయారీలో వినియోగిస్తారు. ఒక కిలో ధర రూ. 8 వేల నుంచి రూ. 16వేల వరకు ఉంటుంది. 12 నుంచి 15 ఏళ్లు తరువాత ఒక్కో చెట్టు నుంచి 15 నుంచి 20 కిలోల వరకూ పొందవచ్చు. దీంతో ఒక్కో చెట్టు నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం లభిస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని దొంగల బారిన పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది.
పెరిగి పెద్దయితే ఎర్ర బంగారమే..
ఎర్రచందనం 15 సంవత్సరాల వయసు తరువాత ఈ చెట్లు గరిష్టంగా 20 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. వీటిని నరికితే ఎకరాకు 200 నుంచి 300 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏ – గ్రేడు దుంగలకు టన్ను రూ 60 లక్షలు, బి–గ్రేడు రూ. 40 లక్షలు, సీ–గ్రేడు రూ. 31 లక్షలు ధరలుగా నిర్ణయించారు. ఈ లెక్కన కనీసం సీ గ్రేడు రకానికి లెక్కేసినా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
సాగులో పాటించాల్సిన మెలకువలు
►నాటిన మొదటి సంవత్సరం మొక్కల బతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మొదటి రెండేళ్ల పాటు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మొక్కలు నేలలో స్థిరపడి బాగా పెరుగుతాయి
►వీటిని మెట్ట,గరప నేలల్లో సాగు చేయవచ్చు
►ఎకరాకు 560వరకు మొక్కలు నాటుకోవచ్చు
►మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి
►శ్రీ గంధం వేర్లకు సొంతంగా పోషకాలను గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. అందుబాటులో చెట్ల వేర్లతో శ్రీగంధం వేర్లు పెనవేసుకొని వాటి నుంచే తేమను పోషకాలను సంగ్రహిస్తాయి.
►నాటిన మూడేళ్ల వరకు శ్రీగంధానికి అందు బాటులో ఏదో ఒక మొక్క ఉండి తీరాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment