ఎర్ర చందనమే వారికి వరకట్నం | Red sandalwood dowry In Family Systems in China | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనమే వారికి వరకట్నం

Published Wed, Jan 11 2023 4:02 AM | Last Updated on Wed, Jan 11 2023 8:12 AM

Red sandalwood dowry In Family Systems in China - Sakshi

ఎర్రచందనంతో తయారు చేసిన బొమ్మలు

భాకరాపేట (తిరుపతి జిల్లా): చైనాలోని కుటుంబ వ్యవస్థల్లో ఎర్ర చందనానికి ఉండే విలువ అంతాఇంతా కాదు. ఎర్ర చందనంతో చేసిన వస్తువులను వరకట్నంగా ఇవ్వడాన్ని అక్కడి వారు చాలా గొప్పగా, గర్వంగా ఫీలవుతుంటారు. ఎర్ర చందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్ర చందనంతో చేసిన పూసలను బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ ఒక కేజీ ఎర్ర చందనం దుంగ నుంచి కీ చైన్లు, పూసలు తయారుచేసి అమ్మితే సుమారు రూ.25 వేలు వస్తుంది. టన్ను ఎర్ర చందనం ధర అక్కడ రూ.2.50 కోట్లు పలుకుతోంది కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. 

అదృష్టం తెస్తుందని.. 
ఎర్ర చందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్‌ దేశాలకు ఎక్కువగా తరలిస్తారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చందనం ముక్క ఉంటే.. అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యం కోసం క్రీమ్‌లు, పౌడర్‌గానూ వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఎర్ర చందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే  బీపీ, షుగర్‌ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు. 

మన దేశంలో తప్ప ఎక్కడా దొరకదు 
మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎర్ర చందనం దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్ర చందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు.  

ఎర్ర చందనం, శ్రీగంధం వేర్వేరు
ఎర్ర చందనం, శ్రీ గంధం వృక్షాలు రెండూ సుగంధ ద్రవ్య వృక్షాలే అయినా వృక్ష శాస్త్రపరంగా రెండూ ఒకే జాతికి చెందినవి కావు. ఎర్ర చందనానికి వాసన కన్నా రంగు ఎక్కువ. దీనిని వృక్ష శాస్త్రంలో టెర్రోకార్పస్‌ శాంటాలీనస్‌ అంటారు.

ఎర్ర చందనం మధ్య భాగం చాలా ధర పలుకుతుంది. ఘనపుటడుగు దాదాపు రూ.లక్షల్లో ఉంటుంది. చాలా దృఢంగాను, ముదురు ఎరుపు రంగులో ఉండటం వల్ల ఈ కలపను ఖరీదైన నిర్మాణాల్లోను, చైనా ఇతర దేశాలు వారు తినడానికి వాడే పుల్లల తయారీలోనూ, ఎర్రని పౌడర్‌ తయారీలోను ఎర్రచందనాన్ని వాడుతున్నారు.

శ్రీగంధం చెట్టును శాస్త్రీయంగా శాంటాలమ్‌ పేనిక్యూలాటమ్‌ అంటారు. ఇవి ఎర్రచందనం లాగా దృఢంగా ఉండవు. గరుకుగా ఉన్న బండపై నీరు పోసి రాస్తే పసుపు రంగులో ఉన్న లేపనం లభిస్తుంది. ఈ చెట్టు నుంచి తీసిన నూనె సుగంధ ద్రవ్యాలు, సబ్బుల తయారీలోనూ వాడుతారు.  
– ప్రభాకర్‌రెడ్డి, ఫారెస్ట్‌ రేంజర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement