రాజంపేట : రాజంపేట ఫారెస్టు డివిజన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్ల నరికివేత ఆగడం లేదు. ఓ వైపు కూంబింగ్ కొనసాగుతున్నా ..మరోవైపు తమిళ కూలీలు దట్టమైన అటవీ ప్రాంతంలో మాటువేసి చెట్లను యథేచ్చగా నరికివేస్తున్నారు. ఇప్పుడు శేషాచలంలో స్మగ్లర్లు, కూలీలు జొరబడటంతో పోలీసు, అటవీశాఖలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా 200కిపైగా దుంగలు లభ్యమైనట్లు ప్రచారం ఊపందుకుంది.
రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలిలో కదలికలు
ఈనెల 6న రైల్వేకడూరు ఎస్‌ఐ భక్తవత్సలం మధ్యాహ్నం 2గంటల సమయంలో కోడూరు మండల బాలుపల్లె రిజర్వుఫారెస్టు వాగేటికోన చెరువు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా అక్కడ గుంపులుగా ఎరచ్రదనం దుంగలను మోసుకొస్తున్న స్మగ్లర్లు, కూలీలు ఒక్కసారిగా కేకలువేస్తూ, రాళ్లు, కట్టెలు, గొడ్డల్లతో పోలీసులపై దాడికి దిగారు. పోలీసులు వారిని చుట్టుముట్టి చాకచాక్యంగా దాడి నుంచి తప్పించుకొని అందులో 11మంది పట్టుకొన్నారు. వారి వద్ద నుంచి 11 ఎర్రచందనం దుంగలను (375.3కేజీల బరువు), రాళ్లు, కట్టెలు, గొడ్డలను స్వా«ధీనం చేసుకున్నారు.
ఓబులవారిపల్లెలో ఇలా..
పారిపోయిన స్మగ్లర్ల గురించి ఎస్‌ఐ భక్తవత్సలం ఇచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ రాజేంద్ర ఆధ్వర్యంలో ఓబులవారిపల్లె ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడు తమ పోలీసు సిబ్బందితో ఈనెల 6న ఓబులవారిపల్లె మండలం బాలిరెడ్డిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తుండగా, అక్కడ కొంతమంది దుంగలను మోసుకొస్తున్నారు. పోలీసులపై ఎదురుదాడికి దిగారు. వారిని ఎదుర్కొని పది మందిని పట్టుకొని వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలను (354.5కేజీలు గల బరువు), రాళ్లు, కట్టెలు, గొడ్డల్లను స్వాధీనం చేసుకున్నారు.
చిట్వేలి పరిధిలో..
బాలిరెడ్డిపల్లె అటవీ ప్రాంతంలో పారిపోయిన మిగిలిన స్మగ్లర్లు, కూలీలపై నిఘా ఉంచడంతో ఈనెల 7న తెల్లవారుజామున చిట్వేలి పీఎస్ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు బృందాలుగా ఏర్పడ్డారు. చెర్లోపల్లె గ్రామం దగ్గరకు వెళ్లేసరికి అక్కడ కొంతమంది గుంపులుగా ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్నారు. పోలీసులకు తారసపడటంతో ఎదురుతిరిగే ప్రయత్నం చేశారు. ఈ బృందంలో పది మందిని పట్టుకున్నారు. వారి నుంచి 364కేజీల బరువు కలిగిన పది దుంగలను స్వాధీనం చేస్తున్నారు.
డీఎస్పీ మాటల్లో..
రైల్వేకోడూరు, ఓబులవారపల్లె, చిట్వేలి పీఎస్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతంలో 50 మంది స్మగర్లు, కూలీలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ రాజేంద్ర ఇక్కడి విలేకర్లకు తెలిపారు. 31మందిని అరెస్టు చేసి వారి నుంచి మొత్తం 1053.5 కేజీల బరువు గల 31 దుంగలను స్వాధీనం చేస్తుకున్నట్లు వివరించారు. వీటి విలువ రూ.21లక్షలని చెబుతున్నప్పటికీ, బయటిమార్కెట్ ను బట్టి రూ.2కోట్లలోపు విలువ ఉంటుందని అంచనా. నిందితుల సమాచారం మేరకు ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన కొంతమంది స్మగ్లర్లు పెద్దఎత్తున కూలీలను సేకరించుకొని కోడూరు, బాలుపల్లె, ఓబులవారిపల్లె, చిట్వేలి, రాజంపేట, రాయచోటి పరిసర ప్రాంతాల అడవిలోకి కూలీలను పంపి, దుంగలను సేకరించుకొని వాటిని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు అక్రమరవాణా చేసి కోట్ల రూపాయిలు అక్రమంగా సంపాదిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. కీపర్సన్, మేస్త్రీలు, కూలీను పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ప్రతిభ చూపినవారిలో సీఐ సాయినాథ్, ఎస్‌ఐలు భక్తవత్సలం, పీ.వెంకటేశ్వర్లు, ప్రదీప్‌నాయుడు, రూరల్ సీఐ మురళీ, ఎస్‌ఐ మహేష్‌నాయుడు, పోలీసుసిబ్బంది, పోలీసు బలగాలను అధికారులు అభినందించారు. ప్రోత్సాహక రివార్డుల కోసం ఎస్పీ అట్టాడబాబూజీకి ప్రతిపాదనలు పంపామన్నారు.
శేషాచలంలో ఎర్ర స్మగ్లర్లు..!
Published Tue, Aug 8 2017 4:26 AM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM
Advertisement
Advertisement