శేషాచలం వీడి..అన్నదాతపై దాడి.. | Elephants attack on farmers | Sakshi
Sakshi News home page

శేషాచలం వీడి..అన్నదాతపై దాడి..

Published Wed, Jun 28 2017 4:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

శేషాచలం వీడి..అన్నదాతపై దాడి.. - Sakshi

శేషాచలం వీడి..అన్నదాతపై దాడి..

- ఎర్ర స్మగ్లర్ల జోరుతో ఏనుగులకు ఆటంకం
స్వార్థంతో విచ్చలవిడిగా చెట్ల నరికివేత
-  గజరాజులు ప్రయాణించే దారుల్లో మార్పులు
-  గత్యంతరం లేక పొలాల్లోకి చొరబాటు
ఆహారం కోసం పంటనష్టం
బెంబేలెత్తుతున్న రైతన్నలు 
 
అడవిలోని ఏనుగులు జనారణ్యంలోకి వస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేసి అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చి వెళ్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వీటివల్ల నష్టాలను చవిచూస్తున్నారు. చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తుండటంతో ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తాజాగా భాకరాపేట పరిసరాల్లో సోమవారం రాత్రి భయానక వాతావరణం సృష్టించాయి. 

 

 
సాక్షి, తిరుపతి: జిల్లాలో ఏనుగుల దాడి పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు ఇవి తమ ఉనికిని చాటుతూ రైతులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల పరిధిలో 40వేల చ.కిమీ. మేర శేషాచలం విస్తరించి ఉంది. ఎర్రచందనం ఈ దట్టమైన అడవి ప్రత్యేకం. అదే ఇప్పుడు రైతుల పా లిట శాపమైంది. దేశంలో మరెక్క డాలేని విలువైన ఎర్రచందనం సం పద ఈఅడవుల్లో దొరుకుతుంది. కోట్లు విలువచేసే ఎర్రచందనంపై అక్రమార్కుల కన్నుపడింది. 2012 వరకు 4, 5 కి.మీ పరిధిలోనే స్థానికులు కొందరు ఒకటీ అరా ఎర్రచందనం చెట్లను నరికి అమ్మి సొమ్ముచేసుకునే వారు. తరువాత స్మగ్లర్లు చొరబడ్డారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన అనేక మంది దొంగలు శేషాచలం బాట పట్టారు. అడవిలోని ఎర్రచందనాన్ని జీవనోపాధిగా మార్చుకున్నారు. వీరి ప్రవేశంతో శేషాచలంలో ఏనుగులకు దారిలేకుండా చేశారు. 
 
అదెలాగంటే..
1992లో శేషాచలం అడవుల్లో 15 ఏనుగులు ఉండేవి. వీటితో పాటు కేరళ, తమిళనాడు సరిహద్దుల నుంచి మరికొన్ని ప్రవేశించాయి. కౌండిన్య అటవీ ప్రాంతంలో ఆహారం, నీటి కొరత ఏర్పడటంతో కుప్పం, పలమనేరు పరిధిలో పంటపొలాల్లో ప్రవేశించి దాడులు చేయటం మొదలుపెట్టాయి. మరో మదపుటేనుగు మనుషులపై దాడి చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని అనంతపురం జిల్లా కదిరి అడవుల మీదుగా వైఎస్సార్‌ కడప జిల్లాలోని వేంపల్లికి చేరుకున్నాయి. అక్కడ ఉన్న మరో 15 ఏనుగులతో కేరళ, తమిళనాడు నుంచి మరి కొన్ని గజరాజులు గుంపుగా ఏర్పడ్డాయి. ఈ ఏనుగులు శేషాచలం అడవుల్లో స్వేచ్చగా తిరిగేవి. 2012 నుంచి ఎర్రచందనం దొంగలు  శేషాచలం అడవిలోకి అడుగుపెట్టారు. వీరి నేతృత్వంలో తమిళనాడుకు చెందిన కూలీలు ఎర్రదుంగలను తరలించడం కోసం అడవుల్లో వెదురు మొక్కలు, ఇతరత్రా వృక్షాలను నరికి వేయటం మొదలుపెట్టారు. తమ ఆహారమైన వెదురు మొక్కలు నరికివేస్తుండటం, దారుల్లో మార్పురావడం ఏనుగులు పసిగట్టాయి.
 
జనారణ్యంలోకి గజరాజులు..
ఎర్రదొంగల చర్యలతో ఏనుగులకు ఇటు ఆహారం కొరత... అటు ప్రాణభయం మొదలైంది. దీంతో జనారణ్యంలోకి ప్రవేశించటం మొదలుపెట్టాయి. కుప్పం పరిధిలోని శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లి మండలాల పరిధిలోకి చేరుకున్నాయి. రెండునెలల క్రితం వరకు ఏనుగులు బీభత్సం సష్టిం చిన విషయం తెలిసిందే. పలమనేరు అటవీ పరిధిలోని బైరెడ్డిపల్లి, వీకోట పరిసర గ్రామాల్లో ఏనుగులు పంటలను నాశనం చేశాయి. తాజాగా ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం బీభత్సం చేశాయి. వరి, అరటి, మామిడి పంటలను నాశనం చేశాయి. విద్యుత్‌ మోటార్లను పీకి పడేశాయి. లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. స్మగ్లర్లను అరికట్టకపోవటంతో అటు అడవిలోని ఎర్రచందనం సంపదతో పాటు ఇటు రైతులు కష్టపడి సాగుచేసుకుంటున్న పంటలు కూడా కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement