వంగ తోటలో రఫీ; పందిరి కూరగాయలు
ఒత్తిళ్లతో కూడిన రొటీన్ ఉద్యోగం కొనసాగిస్తూ, రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తింటూ అనారోగ్యం పాలవడం కన్నా ప్రకృతి వ్యవసాయం చేపట్టి ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని సమాజానికి అందించడమే మేలైన జీవనమార్గమని భావించారు మహమ్మద్ రఫీ. కార్పొరేట్ ఐటీ కంపెనీలో ఏడాదికి రూ. 12 లక్షల ఆదాయాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సొంత జిల్లా నెల్లూరుకు వెళ్లిపోయారు. మరికొందరు మిత్రులతో కలసి 250 ఎకరాల భూమిని కొని, ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఏడాదంతా స్థిరమైన, సరసమైన ధరకే ఆకుకూరలు, కూరగాయలను, మున్ముందు పండ్లను కూడా అందించడం తమ అభిమతమని ఆయన అంటున్నారు.
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిణి గ్రామంలో రైతు ఖాదర్ బాషా కుమారుడైన మహమ్మద్ రఫీకి వ్యవసాయంపై మక్కువ ఉన్నప్పటికీ.. కొత్తగూడెంలో మైనింగ్ ఇంజినీరింగ్ బీటెక్ చదివారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటెక్ చదివిన తర్వాత హైదరాబాద్‌లో టీసీఎస్‌లో చేరారు. కొద్ది ఏళ్లలోనే టీమ్ లీడర్‌గా ఎదిగారు. ఏడాదికి రూ. 12 లక్షల జీతం అందుకుంటున్నప్పటికీ సంతృప్తి లేదు. రొటీన్ ఉద్యోగం, రసాయనిక అవశేషాలతో కలుషితమైన ఆహారం, నగర జీవనశైలితో అనారోగ్య సమస్యలు.. వెరసి సంతృప్తి లేని జీవితం.
అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో కొన్ని సంవత్సరాల క్రితం సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. అంతే.. ప్రకృతి వ్యవసాయంపైనే దృష్టి పెట్టారు. పదేళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలి 18 మంది మిత్రులతో కలసి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండలో 250 ఎకరాల భూమి కొని, రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేపట్టారు.
యూకలిప్టస్ చెట్లతో అడవిని తలిపించేలా ఉన్న భూమిని కొనుగోలు చేసి ప్రస్తుతం 120 ఎకరాలను సాగులోకి తెచ్చారు. 30 బోర్లు తవ్వించారు. వాన నీటి సంరక్షణ కోసం ఒకటిన్నర, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులు తవ్వించారు. 30 ఒంగోలు జాతి ఆవులు, 18 గేదెలు కొనుగోలు చేశారు. పాలేకర్ పద్ధతిలో జీవామృతం, కషాయాలను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. నాటుకోళ్లను పెంచుతున్నారు.
కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఒరిగెలను 50 ఎకరాల్లో.. మునగ 20 ఎకరాల్లో, ఆకుకూరలను 5 ఎకరాల్లో, ఆపిల్ బెర్‌ను 7 ఎకరాల్లో, మామిడిని 10 ఎకరాల్లో, అరటిని 5 ఎకరాల్లో, 8 ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. ఆవులు, గేదెలకు పశుగ్రాసాన్ని 5 ఎకరాల్లో జీవామృతంతో సాగు చేస్తున్నారు. నిమ్మ, సీతాఫలం, బొప్పాయి, దానిమ్మ తదితర తోటలు వేయబోతున్నారు. సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
తమ వ్యవసాయ క్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు నగరంలో ప్రస్తుతం తమ ప్రకృతి వ్యవసాయోత్పత్తులను విక్రయిస్తున్నామని రఫీ తెలిపారు. ఫతేఖాన్‌పేట రైతు బజార్‌లో స్టాల్‌ను తెరిచారు. ఇటీవలే ఒక మొబైల్ వ్యాన్‌ను సైతం ఏర్పాటు చేసుకొని నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో రసాయన రహిత ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు.
ఆరోగ్యదాయకమైన జీవనానికి కట్టె గానుగ నూనెల ఆవశ్యకతను గుర్తెరిగి తమ వ్యవసాయ క్షేత్రంలోనే కట్టె గానుగను ఏర్పాటు చేసి హళ్లికర్ ఎద్దుల సహాయంతో నిర్వహిస్తున్నారు. సొంతంగా పండించిన వేరుశనగ, నువ్వులతోపాటు బయటి నుంచి కొని తెచ్చిన కొబ్బరితో నూనెలను తయారుచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం విశేషం.
ఏడాది పొడవునా స్థిరమైన ధర
ఆరోగ్యదాయకమైన రసాయనాల్లేని ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రకృతి వ్యవసాయోత్పత్తులంటే జనం భయపడేంత ఎక్కువ ధరకు అమ్మకూడదని నిర్ణయించుకున్నాం. ఏడాది పొడవునా స్థిరంగా ఒకే ధరకు ఆకుకూరలు, కూరగాయలను వినియోగదారులకు అందిస్తున్నాం. కిలో రిటైల్ ధర టమాటో, దోస, వంకాయలు రూ. 20, మునక్కాయ రూ. 2.00 –2.50, ఆకుకూరలు కిలో రూ. 30కే విక్రయిస్తున్నాం. మున్ముందు హైదరాబాద్, చెన్నైలలోని సేంద్రియ దుకాణదారులకు తమ ఉత్పత్తులను సరఫరా చేయనున్నాం.
– మహమ్మద్ రఫీ (90002 31112), పర్లకొండ, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా
– పులిమి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి, నెల్లూరు సెంట్రల్
Comments
Please login to add a commentAdd a comment