Vegetable farmers
-
‘కుండీ పందిరి కూరగాయల’కు అవార్డుల పంట!
కుండీల్లోనే బుల్లి పందిళ్లు వేసి ఎంచక్కా తీగజాతి కూరగాయలను మేడ మీద/పెరట్లో కూడా ఇట్టే పండించుకోవచ్చని ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది. కన్నుల పండువగా ఉన్న చిట్టి పందిరి కూరగాయల సాగుదారులు ఇటీవల కోల్‌కత్తాలో జరిగిన అవార్డులు పంట పండించుకున్నారు. అగ్రి–హార్టికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియా (డా. విలియం కారీ 1820లో స్థాపించారు) కోల్‌కత్తాలో ఏర్పడి 200 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా 200వ వార్షిక పుష్ప ప్రదర్శనతోపాటు మధ్య ఆసియా దేశాల గులాబీ మహాసభ ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి 300 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొన్నారు. రోజ్ షోలో 136 సెక్షన్లు ఉండగా.. కూరగాయలు, పండ్లు, బోన్సాయ్, పామ్స్, ఫెర్న్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ తదితర 50 విభాగాల్లో ఉత్తమ సాగుదారులకు బహుమతులు అందజేశారు. కుండీల్లోనే చిన్న పందిళ్లు వేసి తీగజాతి కూరగాయలు పండించే నమూనాలు, కుండీల్లో పండ్ల సాగు నమూనాలు ఈ షోలో హైలైట్‌గా నిలిచాయి. ఒక కుండీలో కట్టె పుల్లలతో పందిరి వేసి సొర తీగను పాకించి నాలుగు సొరకాయలు కాయించిన నమూనాకు కంటెయినర్ కిచెన్ గార్డెనింగ్ విభాగంలో ప్రథమ బహుమతి దక్కింది. వంగ కుండీకి ద్వితీయ బహుమతి దక్కింది. కుండీల్లో సైతం తీగజాతి కూరగాయలను నిశ్చింతగా సాగు చేయడమే కాకుండా మంచి దిగుబడి కూడా తీయొచ్చని ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ అగ్రి–హార్టీకల్చర్ సొసైటీ నేతలు కొందరు కోల్కత్తా పూలు, కూరగాయలు, పండ్ల ప్రదర్శనలో పాల్గొని స్ఫూర్తిని పొందటం విశేషం. -
ఏం కొనేటట్లు లేదు...ఏం తినేటట్లు లేదు
సాక్షి, ఆమదాలవలస రూరల్ : కొన్ని రోజులుగా ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇదివరకు కొద్దిపాటి సొమ్ముతో మార్కెట్‌కు వెళ్తే వారం రోజులకు సరిపడా సరుకులు వచ్చేవని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని వాపోతున్నారు. ఇలాగే ధరలు కొనసాగితే పూట గడవడం కూడా కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దడ పుట్టిస్తున్న ధరలు బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బజార్ దుకాణాల్లో కూడా అధిక ధరలే ఉన్నాయి. దీంతో అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసి పొదుపుగా వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కానీ ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తనట్లు వ్యవరిస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాంసం ప్రియులకు చేదు వార్త కూరగాయల ధరలతో పాటు చికెన్ ధరలు కూడా పెరుగుతుండడంతో మాంసం ప్రియులు చికెన్ తినే పరిస్థితి లేదు. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గుతుండడంతో చికెన్ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కిలో చికెన్ ధర రిటైల్ మార్కెట్లో రూ.160లుగా ఉంది. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ధరలు మరో రూ.20 నుంచి రూ.50 పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ధరలు అదుపు చేయాలి ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు మూడుపూటలా తినే పరిస్థితి లేదు. ధరల దెబ్బతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కూన రామకృష్ణ, కృష్ణాపురం ఏమీ కొనే పరిస్థితి లేదు గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కూరగాయల ధరలు ఆమాంత పెరిగిపోయాయి. దీనివలన ఏమీ కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. ధరలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. -బొడ్డేపల్లి రవికుమార్, తిమ్మాపురం -
మనసుకు నచ్చిన సేద్యం దిశగా..
ఒత్తిళ్లతో కూడిన రొటీన్ ఉద్యోగం కొనసాగిస్తూ, రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తింటూ అనారోగ్యం పాలవడం కన్నా ప్రకృతి వ్యవసాయం చేపట్టి ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని సమాజానికి అందించడమే మేలైన జీవనమార్గమని భావించారు మహమ్మద్ రఫీ. కార్పొరేట్ ఐటీ కంపెనీలో ఏడాదికి రూ. 12 లక్షల ఆదాయాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సొంత జిల్లా నెల్లూరుకు వెళ్లిపోయారు. మరికొందరు మిత్రులతో కలసి 250 ఎకరాల భూమిని కొని, ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఏడాదంతా స్థిరమైన, సరసమైన ధరకే ఆకుకూరలు, కూరగాయలను, మున్ముందు పండ్లను కూడా అందించడం తమ అభిమతమని ఆయన అంటున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిణి గ్రామంలో రైతు ఖాదర్ బాషా కుమారుడైన మహమ్మద్ రఫీకి వ్యవసాయంపై మక్కువ ఉన్నప్పటికీ.. కొత్తగూడెంలో మైనింగ్ ఇంజినీరింగ్ బీటెక్ చదివారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటెక్ చదివిన తర్వాత హైదరాబాద్‌లో టీసీఎస్‌లో చేరారు. కొద్ది ఏళ్లలోనే టీమ్ లీడర్‌గా ఎదిగారు. ఏడాదికి రూ. 12 లక్షల జీతం అందుకుంటున్నప్పటికీ సంతృప్తి లేదు. రొటీన్ ఉద్యోగం, రసాయనిక అవశేషాలతో కలుషితమైన ఆహారం, నగర జీవనశైలితో అనారోగ్య సమస్యలు.. వెరసి సంతృప్తి లేని జీవితం. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో కొన్ని సంవత్సరాల క్రితం సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. అంతే.. ప్రకృతి వ్యవసాయంపైనే దృష్టి పెట్టారు. పదేళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలి 18 మంది మిత్రులతో కలసి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండలో 250 ఎకరాల భూమి కొని, రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యూకలిప్టస్ చెట్లతో అడవిని తలిపించేలా ఉన్న భూమిని కొనుగోలు చేసి ప్రస్తుతం 120 ఎకరాలను సాగులోకి తెచ్చారు. 30 బోర్లు తవ్వించారు. వాన నీటి సంరక్షణ కోసం ఒకటిన్నర, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులు తవ్వించారు. 30 ఒంగోలు జాతి ఆవులు, 18 గేదెలు కొనుగోలు చేశారు. పాలేకర్ పద్ధతిలో జీవామృతం, కషాయాలను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. నాటుకోళ్లను పెంచుతున్నారు. కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఒరిగెలను 50 ఎకరాల్లో.. మునగ 20 ఎకరాల్లో, ఆకుకూరలను 5 ఎకరాల్లో, ఆపిల్ బెర్ను 7 ఎకరాల్లో, మామిడిని 10 ఎకరాల్లో, అరటిని 5 ఎకరాల్లో, 8 ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. ఆవులు, గేదెలకు పశుగ్రాసాన్ని 5 ఎకరాల్లో జీవామృతంతో సాగు చేస్తున్నారు. నిమ్మ, సీతాఫలం, బొప్పాయి, దానిమ్మ తదితర తోటలు వేయబోతున్నారు. సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమ వ్యవసాయ క్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు నగరంలో ప్రస్తుతం తమ ప్రకృతి వ్యవసాయోత్పత్తులను విక్రయిస్తున్నామని రఫీ తెలిపారు. ఫతేఖాన్‌పేట రైతు బజార్లో స్టాల్‌ను తెరిచారు. ఇటీవలే ఒక మొబైల్ వ్యాన్‌ను సైతం ఏర్పాటు చేసుకొని నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో రసాయన రహిత ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్యదాయకమైన జీవనానికి కట్టె గానుగ నూనెల ఆవశ్యకతను గుర్తెరిగి తమ వ్యవసాయ క్షేత్రంలోనే కట్టె గానుగను ఏర్పాటు చేసి హళ్లికర్ ఎద్దుల సహాయంతో నిర్వహిస్తున్నారు. సొంతంగా పండించిన వేరుశనగ, నువ్వులతోపాటు బయటి నుంచి కొని తెచ్చిన కొబ్బరితో నూనెలను తయారుచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం విశేషం. ఏడాది పొడవునా స్థిరమైన ధర ఆరోగ్యదాయకమైన రసాయనాల్లేని ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రకృతి వ్యవసాయోత్పత్తులంటే జనం భయపడేంత ఎక్కువ ధరకు అమ్మకూడదని నిర్ణయించుకున్నాం. ఏడాది పొడవునా స్థిరంగా ఒకే ధరకు ఆకుకూరలు, కూరగాయలను వినియోగదారులకు అందిస్తున్నాం. కిలో రిటైల్ ధర టమాటో, దోస, వంకాయలు రూ. 20, మునక్కాయ రూ. 2.00 –2.50, ఆకుకూరలు కిలో రూ. 30కే విక్రయిస్తున్నాం. మున్ముందు హైదరాబాద్, చెన్నైలలోని సేంద్రియ దుకాణదారులకు తమ ఉత్పత్తులను సరఫరా చేయనున్నాం. – మహమ్మద్ రఫీ (90002 31112), పర్లకొండ, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా – పులిమి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి, నెల్లూరు సెంట్రల్ -
ఆరోగ్యం.. ఆహ్లాదం..
‘సాక్షి’లో వారం వారం ‘ఇంటిపంట’ల సాగుపై ప్రచురితమవుతున్న కథనాలతో స్ఫూర్తి పొందిన దంపతులు తమ ఇంటిపైన గత 4 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన బిళ్లా వెంకటేశ్వరరావు, రామతులసి దంపతులు గ్రామంలోని బీసీ కాలనీలోని తమ డాబాపై ఇంటి పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. డాబాపై సుమారు సెంటున్నర ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సెంటు మేరకు ఇంటి పంటల సాగుకు కేటాయించారు. శ్లాబుపైన మూడు వరుసలుగా ఎత్తు మడులు(గాడులు) నిర్మించారు. వీటిలో తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, పొదీనా విత్తనాలు చల్లారు. వంగ, బెండ, గోరుచిక్కుడు, టమోట మొక్కలు నాటారు. అక్కడక్కడా తొట్లను ఏర్పాటుచేసి బీర, కాకర, దోస, పొట్ల, సొర విత్తనాలు నాటారు. నాలుగు నెలల క్రితం నాటిన విత్తనాలు ప్రస్తుతం కాపు నిస్తున్నాయి. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు రోజుకు గంట చాలు సాక్షిలో కథనాలు చదివిన తర్వాత మా డాబాపైనా ఖాళీ స్థలం ఉంది కదా మనమూ పండించుకుందాం అన్న ఆలోచన వచ్చింది. రసాయనిక పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ కూరగాయలు పండించుకుంటున్నాం. మేం తినటమే కాకుండా ఇరుగు, పొరుగు వారు, బంధువులు, స్నేహితులకు కూడా కూరగాయలు ఇస్తున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక అర్థగంట మొక్కలతో గడిపితే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. బడలిక, ఒత్తిడి పోతుంది. – రామతులసి, వెంకటేశ్వరరావు (93934 36555) దంపతులు -
దళారీ రాజ్యం..
నగర మార్కెట్లలో మోసపోతున్న కూరగాయల రైతులు చిల్లర కొరత..అధిక ఉత్పత్తి సాకుగా చూపి అడ్డంగా దోపిడీ తక్కువ ధరకు కొని.. రిటైల్‌లో డబుల్ రేట్లకు విక్రయిస్తున్న దళారీలు.. lదిగుబడి ఉన్నా అన్నదాతకు నష్టాలే.. నగర మార్కెట్లలో అన్నదాత నిలువునా దోపిడీకిగురవుతున్నాడు. వానలు బాగా కురిసి..పంటలు బాగా పండి..మంచి దిగుబడి చేతికొచ్చినా అటు రైతన్నకు సరైన ఫలితం దక్కడం లేదు. ఇటు వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు లభించడం లేదు. దీనికి కారణం దళారుల మాయాజాలమే. నోట్ల రద్దు..చిల్లర కొరతను సాకుగా చూపి మధ్య దళారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. వీటిని రిటైల్ మార్కెట్లలో మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో దిగుబడి పెరిగినా ఫలితం దక్కక అన్నదాత..చిల్లర కొరతతో అధిక ధరలకు కూరగాయలు కొనలేక వినియోగదారులు అల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ఈ ఏడాది కూరగాయల ఉత్పత్తి భారీగా పెరగడంతో ధరలు తగ్గుతాయనుకున్న గ్రేటర్ వాసుల ఆశలపై దళారులు నీళ్లు చల్లుతున్నారు. అలాగే అధిక దిగుబడి వచ్చినందున లాభాలు బాగానే వస్తాయనుకున్న రైతులూ నిరాశ చెందుతున్నారు. నగరంలోని పలు మార్కెట్లలో మధ్య దళారులు పాగా వేసి చిల్లర కొరతను బూచీగా చూపి రైతులను దోచుకోవడంతోపాటు..వినియోగదారుల జేబులు గుల్ల చేస్తుండడం గమనార్హం. ఉత్పత్తి అనూహ్యంగా పెరగడంతో అన్నదాతల నుంచి తక్కువ ధరలకు కూరగాయలను కొనుగోలుచేసి మార్కెట్లో మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. రైతన్నకు కుడి, ఎడమల దగా... ఆరుగాలం శ్రమించి కూరగాయలు పండించిన రైతన్నలు మార్కెట్లలో నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కనీసం గిట్టుబాట ధర కూడా రాకపోవడంతో వచ్చినకాడికి అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగిందన్న సాకు, నోట్ల రద్దు ప్రభావంతో ఏర్పడిన చిల్లర కొరత కారణాలు చూపుతూ దళారులు, మధ్యవర్తులు రేట్లు తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరు ఇవే కూరగాయలను రిటైల్ మార్కెట్లో రెండింతలు, మూడింతలకు అమ్ముతూ లాభపడుతున్నారు. కూరగాయల రేట్లు తగ్గిన ఫలాలు వినియోగదారుడికి కూడా అందలేదు. రైతన్నలు, వినియోగదారులు మోసపోతుండగా, దళారులు, మధ్యవర్తులు మాత్రం లాభాల గడించేస్తున్నారు. దీనికి కొంత మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా సహకరిస్తుండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కూరగాయల ధరలపై నోట్ల రద్దు ప్రభావం... సిటీలో నిత్యవసరమయ్యే కూరగాయల ధరలపై నోట్ల రద్దు ప్రభావం భారీగానే కనిపించింది. రైతన్నలు తాము పండించిన పంటలను మార్కెట్‌కి తీసుకెళ్లేందుకు రవాణా, ఇతరత్రా ఖర్చులకు డబ్బులు లేక..వారి వద్దకే వచ్చిన మధ్యవర్తులకు ఎంతో కొంతకు విక్రయించారు. కొందరి వద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అనుకూలంగా మలుచుకున్న దళారులు, వ్యాపారులు ‘మేం రేటు ఇంతే ఇస్తాం. లేదంటే తీసుకెళ్లండి అంటూ కొర్రీలు పెట్టడం’తో చేసేదేమీ లేక ఇచ్చి వెళ్లినవారూ ఉన్నారు. గిట్టుబాటు కాక చాలా మంది ఉల్లిగడ్డ రైతులు తాము తెచ్చిన సరుకును మలక్‌పేటలోని వ్యవసాయ మార్కెట్లోని రోడ్లపై పడేసి వెళ్లిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వాటిని నిల్వ చేసేందుకు అధికారులు కోల్డ్ స్టోరేజీలు కూడా అందుబాటులోకి తీసుకరాకపోవడంతో దళారుల పంట పండింది. ఉత్పత్తి పెరిగింది.. నగర శివారు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల నుంచి నగరానికి టమాటా, వంకాయ, బెండకాయ, సొరకాయ, బీరకాయ ఇలా నిత్యం అవసరమయ్యే కూరగాయలన్నీ వస్తుంటాయి. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్, వికారాబాద్, మెదక్, అనంతపురం, చిత్తూరు, తాండూరు జిల్లాల నుంచి కూరగాయలు, ఆగ్రా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా నుంచి ఆలుగడ్డలు బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లకు తరలివస్తున్నాయి. అయితే కోటి జనాభా వున్న నగరానికి ప్రతిరోజు దాదాపు 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం. అయితే హోల్‌సేల్ మార్కెట్లకు 25 లక్షల కిలోల కూరగాయలు వస్తున్నాయి. వేసవికాలంలో పది లక్షల కిలోల వరకు కూరగాయల కొరత నగరాన్ని పీడించిందని, ఇప్పుడు ఆ స్థాయి ఇబ్బంది లేదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది కూరగాయల ధరలు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ..ఆ ఫలితం వినియోగదారులకు దక్కడంలేదని విశ్లేషిస్తున్నారు. -
కొనే వారేరీ..!
సాక్షి, సిటీబ్యూరో : సంక్రాంతి అందరిలో ఆనందం నింపుతుండగా... రాజధానిలోని కూరగాయల రైతులు, వ్యాపారులకు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. సంక్రాంతి సంబరాలు సొంత ఊళ్లలో జరుపుకొనేందుకు జనం తరలి వెళ్లడంతో నగరం సగం ఖాళీ అయింది. ఆ ప్రభావం తొలుత కూరగాయల వ్యాపారంపై పడింది. గ్రేటర్లో 50 శాతం మేర కూరగాయల కొనుగోళ్లు పడిపోవడంతో మార్కెట్లో సరుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ప్రస్తుతం టమాటా స్థానికంగా ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వస్తోంది. దీన్ని ఏరోజుకారోజు అమ్ముకోవాల్సి రావడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు ధర తగ్గించి మరీ తెగనమ్ముకొని వెనుదిరుగుతున్నారు. గత వారం హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.15 ధర పలికిన టమాటా ఆదివారం రూ.6లకు, రూ.35 ఉన్న పచ్చిమిర్చి రూ.20లకు దిగివచ్చింది. ఇదే సరుకు రైతుబజార్లో టమాటా రూ.9, రిటైల్‌గా రూ.10లకు, అలాగే మిర్చి రూ.25 ప్రకారం విక్రయించారు. హోల్‌సేల్ మార్కెట్లో సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని అమ్ముకోలేక కళ్లెదుటే వాడిపోతుండటంతో బావురుమంటున్నారు. గడచిన 4రోజుల నుంచి వ్యాపారం సగానికి సగం తగ్గడాన్ని గమనించిన పలువురు రిటైల్ వ్యాపారులు పెట్టిన పెట్టుబడిని రాబట్టుకొనేందుకు ధర తగ్గించి అమ్మేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కొనేవారే లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక మిర్చి, వంకాయ, బెండ, దొండ, కాకర, బీర, చిక్కుడు, గోకర, దోస వంటివి 3-4 రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా... కొనేనాథుడు లేక మార్కెట్లలో గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. నగరంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు అధికంగా ఊళ్లకు వెళ్లడంతో హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు కూడా కూరగాయల కొనుగోళ్లు తగ్గించినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. -
నిధుల కొరత.. సబ్సిడీకి కోత
చేవెళ్ల: జిల్లాను కూరగాయల జోన్‌గా ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. అరకొర నిధులను విడుదల చేస్తూ కూరగాయల రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యాన పంటల సాగుకు జిల్లాలోని భూములు అనువైనవని పేర్కొంటున్న సర్కారు.. కూరగాయల సబ్సిడీ విత్తనాలకు నిధులు విదల్చడంలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సబ్సిడీ కూరగాయల విత్తనాలకు తక్కువ నిధులు కేటాయించింది. దీంతో దరఖాస్తులు తీసుకోవడం నిలిపివేస్తున్నామంటూ ఉద్యాన శాఖ కార్యాలయం ఎదుట అధికారులు నోటీసు పెట్టారు. దీంతో రైతులు దరఖాస్తులు ఇవ్వడానికి గురువారం ఎగబడ్డారు. గత ఏడాది రూ.30 లక్షలు.. ఈసారి రూ.10 లక్షలే చేవెళ్ల డివిజన్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలను పండిస్తారు. రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ఖరీఫ్, రబీలో సీజన్లలో కూరగాయల విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే చేవెళ్ల ఉద్యానశాఖ సబ్‌డివిజన్ పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల్లో కూరగాయ విత్తనాల సబ్సిడీకి ప్రభుత్వం 2014-15 ఖరీఫ్ సీజన్‌కు రూ.10 లక్షలు కేటాయించింది. ఉద్యాన శాఖ అధికారులు రైతుల నుంచి 50 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీకి దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇంకా దరఖాస్తులను ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సబ్సిడీ కూరగాయల విత్తనాల సరఫరాకు కేటాయించిన బడ్జెట్ అయిపోయిందని, మరో 5 లక్షల రూపాయల విలువచేసే విత్తనాలకు అధికంగా దరఖాస్తులు అందాయంటూ శుక్రవారం నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని ఉద్యాన శాఖ కార్యాలయం వద్ద నోటీసు అంటించారు. దరఖాస్తు చేయడానికి గురువారం ఒక్కరోజే గడువు ఉండడంతో దరఖాస్తులు ఇచ్చేందుకు రైతులు భారీ సంఖ్యలో వచ్చారు. కూరగాయ రైతులను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా అందుకు అవసరమైన నిధులను కేటాయించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు రూ.30 లక్షలు కేటాయించిన ప్రభుత్వం ఈసారి మాత్రం కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇవ్వడం సరికాదని విమర్శిస్తున్నారు. -
రైతుకు రూ.2.. కొనుగోలుదారుకు రూ.20
- దోసకాయల ధరల తీరిది - రైతులను నిలువుదోపిడీ చేస్తున్న దళారులు - పెట్టుబడులు కూడా దక్కడం లేదని రైతుల గగ్గోలు నరసాపురం రూరల్ : ఆరుగాలం శ్రమించి పండించిన కూరగాయల రైతులు దళారుల చేతిలో నిలువుదోపిడీకి గురవుతున్నారు. దళారీ వ్యవస్థను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతుండడంతో ఆరుగాలం శ్రమించినా రైతులకు పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సీజన్లో దోసకాయలు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో లంక భూముల్లో కూరగాయల సాగు అత్యధికంగా సాగుతోంది. పెరవలి, నరసాపురం, ఆచంట, పెనుగొండ, కొవ్వూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు. నరసాపురం మండలంలోని ఎల్బీ చర్ల, లక్ష్మణేశ్వరం, సారవ తదితర గ్రామాల్లో దాళ్వా సాగు అనంతరం కూరగాయలను పండిస్తున్నారు. దోసకాయల పాదులను పెట్టి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది కన్నీళ్లే మిగిలాయి. కిలో దోసకాయలను కేవలం రూ.2 చొప్పున దళారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. అదే దోసకాయలు బహిరంగ మార్కెట్లో రూ.15 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు. సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతుండగా కొనుగోలుదారులు అధిక ధరను పెట్టి కొనాల్సి వస్తోంది. ఎటువంటి పెట్టుబడి పెట్టని దళారులు మాత్రం జేబులునింపుకుంటున్నారు. ఎకరం పొలంలో దోసపాదులు సాగు చేయలంటే రూ.17 వేలు ఖర్చవుతుం దని ఆ మొత్తంలో సగం కూడా రావడం లేదని యర్రంశెట్టిపాలెంనకు చెందిన రైతు యర్రంశెట్టి పాండురంగ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంమే కాయగూరలను కొనుగోలు చేసి మార్కెట్లకు తరలించి విక్రయిస్తే ఇటు రైతులకు, అటు వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.