రైతుకు రూ.2.. కొనుగోలుదారుకు రూ.20
- దోసకాయల ధరల తీరిది
- రైతులను నిలువుదోపిడీ చేస్తున్న దళారులు
- పెట్టుబడులు కూడా దక్కడం లేదని రైతుల గగ్గోలు
నరసాపురం రూరల్ : ఆరుగాలం శ్రమించి పండించిన కూరగాయల రైతులు దళారుల చేతిలో నిలువుదోపిడీకి గురవుతున్నారు. దళారీ వ్యవస్థను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతుండడంతో ఆరుగాలం శ్రమించినా రైతులకు పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సీజన్‌లో దోసకాయలు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో లంక భూముల్లో కూరగాయల సాగు అత్యధికంగా సాగుతోంది. పెరవలి, నరసాపురం, ఆచంట, పెనుగొండ, కొవ్వూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు.
నరసాపురం మండలంలోని ఎల్‌బీ చర్ల, లక్ష్మణేశ్వరం, సారవ తదితర గ్రామాల్లో దాళ్వా సాగు అనంతరం కూరగాయలను పండిస్తున్నారు. దోసకాయల పాదులను పెట్టి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది కన్నీళ్లే మిగిలాయి. కిలో దోసకాయలను కేవలం రూ.2 చొప్పున దళారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. అదే దోసకాయలు బహిరంగ మార్కెట్లో రూ.15 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు. సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతుండగా కొనుగోలుదారులు అధిక ధరను పెట్టి కొనాల్సి వస్తోంది.
ఎటువంటి పెట్టుబడి పెట్టని దళారులు మాత్రం జేబులునింపుకుంటున్నారు. ఎకరం పొలంలో దోసపాదులు సాగు చేయలంటే రూ.17 వేలు ఖర్చవుతుం దని ఆ మొత్తంలో సగం కూడా రావడం లేదని యర్రంశెట్టిపాలెంనకు చెందిన రైతు యర్రంశెట్టి పాండురంగ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంమే కాయగూరలను కొనుగోలు చేసి మార్కెట్లకు తరలించి విక్రయిస్తే ఇటు రైతులకు, అటు వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.