చేవెళ్ల: జిల్లాను కూరగాయల జోన్‌గా ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. అరకొర నిధులను విడుదల చేస్తూ కూరగాయల రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యాన పంటల సాగుకు జిల్లాలోని భూములు అనువైనవని పేర్కొంటున్న సర్కారు.. కూరగాయల సబ్సిడీ విత్తనాలకు నిధులు విదల్చడంలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సబ్సిడీ కూరగాయల విత్తనాలకు తక్కువ నిధులు కేటాయించింది. దీంతో దరఖాస్తులు తీసుకోవడం నిలిపివేస్తున్నామంటూ ఉద్యాన శాఖ కార్యాలయం ఎదుట అధికారులు నోటీసు పెట్టారు. దీంతో రైతులు దరఖాస్తులు ఇవ్వడానికి గురువారం ఎగబడ్డారు.
గత ఏడాది రూ.30 లక్షలు.. ఈసారి రూ.10 లక్షలే
చేవెళ్ల డివిజన్‌లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలను పండిస్తారు. రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ఖరీఫ్, రబీలో సీజన్లలో కూరగాయల విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే చేవెళ్ల ఉద్యానశాఖ సబ్‌డివిజన్ పరిధిలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల్లో కూరగాయ విత్తనాల సబ్సిడీకి ప్రభుత్వం 2014-15 ఖరీఫ్ సీజన్‌కు రూ.10 లక్షలు కేటాయించింది.
ఉద్యాన శాఖ అధికారులు రైతుల నుంచి 50 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీకి దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇంకా దరఖాస్తులను ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సబ్సిడీ కూరగాయల విత్తనాల సరఫరాకు కేటాయించిన బడ్జెట్ అయిపోయిందని, మరో 5 లక్షల రూపాయల విలువచేసే విత్తనాలకు అధికంగా దరఖాస్తులు అందాయంటూ శుక్రవారం నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని ఉద్యాన శాఖ కార్యాలయం వద్ద నోటీసు అంటించారు.
దరఖాస్తు చేయడానికి గురువారం ఒక్కరోజే గడువు ఉండడంతో దరఖాస్తులు ఇచ్చేందుకు రైతులు భారీ సంఖ్యలో వచ్చారు. కూరగాయ రైతులను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా అందుకు అవసరమైన నిధులను కేటాయించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు రూ.30 లక్షలు కేటాయించిన ప్రభుత్వం ఈసారి మాత్రం కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇవ్వడం సరికాదని విమర్శిస్తున్నారు.
నిధుల కొరత.. సబ్సిడీకి కోత
Published Thu, Jul 10 2014 11:53 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement