పట్నం నుంచి ప్రకృతిలోకి.. | From city to nature ..Natural agriculture | Sakshi
Sakshi News home page

పట్నం నుంచి ప్రకృతిలోకి..

Published Tue, Nov 13 2018 6:28 AM | Last Updated on Tue, Nov 13 2018 6:28 AM

From city to nature ..Natural agriculture - Sakshi

తవణంపల్లిలో తన ఇంటి వద్ద కట్టె గానుగతో వినోద్‌రెడ్డి

ఆరోగ్య దాయకమైన మన సంప్రదాయక గ్రామీణ ఆహార సంస్కృతి పరిర క్షణ యజ్ఞం కోసం చిత్తూరు జిల్లా తవణంపల్లికి చెందిన వినోద్‌ రెడ్డి అనే యువకుడు నడుం బిగించాడు. కాంక్రీటు జనారణ్యం బెంగళూరులో మంచి జీతంతో కూడిన ఫార్మా మార్కెటింగ్‌ ఉద్యోగాన్ని వదలి.. ప్రకృతి వ్యవసాయం, పుంగనూరు ఆవుల సంరక్షణ, ఆరోగ్యదాయకమైన గ్రామీణ – ఆరోగ్య స్వరాజ్యం కోసం భార్యా బిడ్డలతో మూడేళ్ల క్రితం తిరిగి పుట్టింటికొచ్చేశారు. పుంగనూరు ఆవుల సంరక్షణ గురించి ఆలోచిస్తూæ.. ఎద్దులకు సరైన శారీరక శ్రమ ఉంటేనే బ్రీడ్‌ డవలప్‌మెంట్‌ జరుగుతుందని గుర్తించి కట్టె గానుగ ఏర్పాటు చేసుకున్నారు.

కాలక్రమంలో మరుగున పడిపోయిన గానుగలను తయారు చేయిస్తూ ప్రజలకు ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలను అందించడమే కాకుండా సొంత ఊళ్లోనే గౌరవప్రదమైన ఉపాధిని పొందుతూ తమ గ్రామంలోని వడ్రంగులకూ ఉపాధి కల్పిస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో అనేక ఉత్పత్తులు తయారు చేసి ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తూ గతంలో కన్నా మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. అన్నిటికీ మించి.. మనసుకు నచ్చిన పని చేస్తూ ప్రకృతి ఒడిలో సకుటుంబంగా ఆనంద పరవశుడవుతున్న యువ రైతు పేరు వినోద్‌పై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం.


సాతంబాకం వినోద్‌రెడ్డి(34)ది చిత్తూరు జిల్లా తవణంపల్లి స్వగ్రామం. వ్యవసాయ కుటుంబం. 5 ఎకరాల భూమిలో మామిడి తోట 15 ఏళ్లుగా సాగులో ఉంది. బీఎస్సీ పూర్తి చేశాడు. మొదట్లో టీటీడీలో ఉద్యోగం చేశారు. ఫార్మాçస్యూటికల్‌ కంపెనీలో మార్కెటింగ్‌ ఉద్యోగానికి మారి, కొన్ని ఏళ్ల పాటు హైదరాబాద్, బెంగళూరుల్లో ఉద్యోగం చేశారు. ఐదంకెల జీతం. అయినా, ఏదో వెలితి మనసును స్థిమితంగా ఉండకుండా రొద పెడుతూనే ఉంది. ఉరుకులు పరుగుల జనారణ్యంలో కేవలం లాభార్జన కోసం మార్కెటింగ్‌ వ్యూహాలను అమలు చేయడం మంచి ఆదాయాన్ని ఇస్తున్నప్పటికీ మనసును సంతృప్తిపరచలేకపోతోంది. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో ఏదో చేసి సాధించాలన్న తీరని కోరికే ఇందుకు మూలకారణమని  వినోద్‌ గుర్తించారు.

ఈ వెలితిని తీర్చుకోవడానికి ప్రకృతి వ్యవసాయం, దేశీ సంప్రదాయ ఆహారం–ఆరోగ్యం గురించి ఏ కార్యక్రమం జరిగినా కుటుంబంతో సహా పాల్గొనే అలవాటు చేసుకున్నారు. ఆ క్రమంలో గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ వింగ్‌లో సభ్యుడిగా చేరాడు. అక్కడే నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్డీఆర్‌ఐ) విశ్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ ఓబిరెడ్డి, డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌ పరిచయం అయ్యారు. పుంగనూరు ఆవుల విశిష్టతను వారి నుంచి వినోద్‌ తెలుసుకున్నారు. తిరిగి ప్రకృతికి దగ్గరవ్వాలన్న బలమైన కోరిక తీర్చుకోవడానికి, పుంగనూరు ఆవుల సంరక్షణపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. పాలేకర్‌ వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయం చేస్తే వచ్చే లాభాల గురించి వివరించడంతో భార్య మమత, తల్లిదండ్రులు కూడా వినోద్‌ మనోభీష్టాన్ని అంగీకరించి ప్రోత్సహించారు.

నారాయణరెడ్డి, పాలేకర్‌ శిక్షణా తరగతులకు హాజరై ప్రకృతి వ్యవసాయంపై వినోద్‌ లోతైన అవగాహన పొందారు. 5 ఎకరాల మామిడి తోటను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోకి మార్చి సాగు చేస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో విజృంభించిన తేనెమంచుపురుగు గత ఏడాది మామిడి పంట దిగుబడిని భారీగా దెబ్బతీసిందని తెలిపారు. అంతకుముందు వరకు క్రమంగా దిగుబడి పెరుగుతూనే వచ్చిందని వినోద్‌ అన్నారు. మామిడిలో అంతరపంటలుగా పశుగ్రాసాలు, జొన్న, ఉలవలు సాగు చేస్తున్నారు. ఘనజీవామృతం, ఆవుమూత్రం, పేడను రైతులకు, ఇంటిపంటల సాగుదారులకు విక్రయిస్తూ ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి దోహదపడుతున్నారు. ఉద్యోగం అయితే వదిలేసి వచ్చాడు కానీ.. పుంగనూరు ఆవులు దొరకడం కష్టమయింది. తవణంపల్లి చుట్టుపక్కల అడవుల్లో తిరిగే నాటు ఆవులను అతికష్టమ్మీద తీసుకొచ్చారు. వీటి రక్త నమూనాలను బెంగళూరులోని ఎన్డీఆర్‌ఐలో పరీక్షించారు. వాటి డీఎన్‌ఏ పుంగనూరు ఆవులకు దగ్గరగా ఉందని తేలింది. ఎన్డీఆర్‌ఐ శాస్త్రవేత్తల సలహాతో గుంటూరులోని లామ్‌ ఫాం నుంచి పుంగనూరు ఆవుల వీర్యం తీసుకొచ్చి నాటు ఆవులతో సంపర్కం చేసి.. పుంగనూరు ఆవులను ఉత్పత్తి చేశారు.

అయితే, వీటి ఎదుగుదలలో కొన్ని లోపాలు బయటపడుతుండటం ఇబ్బందిగా మారింది. దీంతో నాణ్యమైన బ్రీడ్‌ రాలేదు. ఆవులకు వేసే మేతలోనే లోపాలున్నట్లు వినోద్‌ గుర్తించారు. ఆహారాన్ని మార్చి, ఎద్దులకు శారీరక శ్రమ కల్పించాలని శాస్త్రవేత్తలు కూడా సూచించారు. గానుగ ఆడించిన చెక్కను వాటికి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలోని వడ్రంగి కోదండాచారిని వినోద్‌ సంప్రదించి, ఇనుము వాడకుండా పూర్తిగా చెక్కతో గానుగను తయారు చేశారు. జోడెద్దుల గానుగను ప్రతి రోజూ కనీసం 5 గంటల పాటు ఆడిస్తున్నారు.

నాణ్యతే కట్టె గానుగ నూనెల ప్రత్యేకత
వేరుశనగ, నువ్వులు, కొబ్బరి నూనెలు తీసి.. ఇంటికి వచ్చిన వారికి అమ్ముతున్నారు. ప్రత్యేకించి ప్యాకేజింగ్, బ్రాండింగ్‌ చెయ్యకుండా స్టీలు క్యాన్లలో నూనె విక్రయిస్తున్నారు. అడిగిన వారికి లీటరుకు గ్లాస్‌ బాటిల్‌ రూ. 60 చొప్పున తీసుకొని నూనెలు పోసి ఇస్తున్నారు. తిరిగి గ్రామానికి వెళ్లి ప్రకృతి ఒడిలో ఆరోగ్యదాయకమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుదాం అన్న వినోద్‌ లక్ష్యం ఈ మాదిరిగా నెరవేరుతోంది. పుంగనూరు గోజాతి సంరక్షణతోపాటు ప్రజలకు ఆరోగ్యదాయకమైన కట్టె గానుగ నూనెలు అందుబాటులోకి వచ్చాయి. గానుగ చెక్క(పిట్టు) ఆవులు, ఎద్దులకు మంచి ఆహారం అందుబాటులోకి వచ్చింది. ఎద్దులకు పని దొరుకుతోంది. తగిన శారీరక శ్రమ ఉన్న ఆంబోతులతో మేలైన బ్రీడ్‌ రూపొందుతున్నది. ఒక్కసారి దిటిస్తేనే ఆవులు చూలు నిలుస్తున్నది. ఇంతకన్నా ఏమి కావాలి? అంటున్నారు వినోద్‌.

కట్టె గానుగ తయారీ ఇలా..
కట్టె గానుగను బలమైన బాగి చెట్టు కాండంతో తయారు చేస్తున్నారు. రోలు 9 అడుగులు, 8 అడుగులు చుట్టుకొలత ఉండేలా చూసుకోవాలి. రోలు భూమి లోపలికి ఆరు అడుగులు, బయటికి 3 అడుగులు ఉండేట్టుగా చూసుకోవచ్చు. కాడిమాను, బొమ్మ కొయ్యి, రోకలి తదితరాలు స్థానికంగా ఉండే నాణ్యమైన చెక్కతో అయినా తయారు చేసుకోవచ్చు. రోలును తుమ్మ, చింతతో తయారు చేయొచ్చు. ఒక్కో గానుగ తయారు చేయడానికి కనీసం ఒక నెల సమయం పడుతోంది. ఒకసారి గానుగ స్థాపిస్తే కనీసం 30 సంవత్సరాలు పాడుకాకుండా ఉపయోగపడుతుందని బాల్యం నుంచి కట్టె గానుగల్లో పని చేసిన అనుభవం ఉన్న వడ్రంగి కోదండాచారి చెబుతున్నారు. తాము కట్టె గానుగలను నెలకొల్పుకోవడమే కాకుండా ఇతరులక్కూడా వీటిని అందుబాటులోకి తెస్తుండటం విశేషం. ఒక్కో గానుగకు రూ. లక్ష వరకు, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు అదనంగా  ఖర్చవుతుందని వినోద్‌ వివరించారు.

కట్టె గానుగలకు పెరుగుతున్న గిరాకీ
ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. కట్టె గానుగలో ఆడించిన వంట నూనెలే కావాలని వినోద్‌ను చాలా మంది వినియోగదారులు అడుగుతుంటారు. కట్టె గానుగ నూనెలకు మార్కెట్‌లో గిరాకీ ఉన్నందున లాభదాయకంగా ఉంది. దీంతో కట్టె గానుగ నూనెల ఉత్పత్తి, అమ్మకంపై వినోద్‌ శ్రద్ధ పెడుతున్నారు. ప్రస్తుతం వేరుశనగ, నువ్వులు, కొబ్బరి గానుగ ఆడిస్తున్నారు. 80 కేజీల వేరుశనగ గుళ్లను గానుగ ఆడిస్తే 26 నుంచి 28 కేజీల నూనె వస్తుంది. నువ్వులు 80 కేజీలకు 26 కేజీల నూనె, రెండున్నర కిలోల కొబ్బరికి ఒక లీటర్‌ నూనె వస్తుందని వినోద్‌ తెలిపారు. గింజల నాణ్యతను బట్టి కొంచెం అటు ఇటుగా తేడా ఉంటుందన్నారు.

కట్టె గానుగలతో నూనెలపై 3 రోజుల శిక్షణ
ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేసే కట్టె గానుగ నూనెల వినియోగం నగరాలు, పట్టణాల్లో ఇటీవల కాలంలో పెరుగుతోంది. కట్టె గానుగల ద్వారా నూనెను వెలికితీయడం నైపుణ్యంతో కూడిన పని. ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలను ఆకళింపు చేసుకోవాలంటే ఎవరికైనా శిక్షణ అవసరమవుతుంది. గ్రామీణుల ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నందున ఆసక్తి కలిగిన యువతీ, యువకులకు వినోద్‌ తవణంపల్లెలో తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన కట్టె గానుగలపై శిక్షణ ఇస్తున్నారు. 10 మంది కలిసి ఒక బ్యా^Œ గా ఏర్పాటు చేసి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరికి 3 రోజులకు కలిపి రూ.4 వేల రుసుం వసూలు చేస్తున్నారు. సాధారణ వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు. 9381321079, 9440230052 నంబర్లలో సంప్రదించవచ్చు.  25 వరకు కట్టెగానుగలు తయారు చేయించి అడిగిన వారికి సరఫరా చేశామని అంటూ.. వాడకపోతే పగుళ్లు వచ్చి కట్టె గానుగ పాడైపోతుందని వినోద్‌ తెలిపారు. సొంత ఊళ్లోనే గౌరవప్రదమైన ఉపాధిని వెతుక్కోవడంతోపాటు ఆరోగ్యదాయకమైన ఆహార స్వరాజ్యం కోసం శ్రమిస్తున్న వినోద్‌కు, అండగా నిలిచిన కుటుంబానికి ‘సాక్షి సాగుబడి’ జేజేలు చెబుతోంది.  
– గాండ్లపర్తి భరత్‌ రెడ్డి, సాక్షి, చిత్తూరు
ఫొటోలు: ఎన్‌ మురళి
ప్రకృతికి దగ్గరగా సంతృప్తిగా జీవిస్తున్నాం..
ఉద్యోగం మాని ప్రకృతి వ్యవసాయం, పుంగనూరు గోజాతి పరిరక్షణ, కట్టెగానుగల తయారీ వంటి పనుల్లో నిమగ్నం కావడం తమ కుటుంబానికి మానసికంగా ఎంతో సంతృప్తిగా ఉంది. మట్టిపాత్రల్లో సిరిధాన్యాలు కట్టెల పొయ్యి మీద వండుకు తింటున్నాం. కాలుష్యంలేని, కల్మషం లేని పనులు, ఆలోచనలు ప్రశాంతతను, సంతృప్తిని కలిగిస్తున్నాయి. మా ఆహారపు అలవాట్లు, జీవన విధానం కాలుష్యానికి దూరమై ప్రకృతికి దగ్గరైంది. కట్టె గానుగ నూనెలు వాడి ఆనందిస్తున్న వారి స్పందనలు మా కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తున్నాయి. ఉద్యోగంలో ఏటా రూ. 2 లక్షలు మిగిలేవి. రైతుగా మారిన తర్వాత ఖర్చులు పోను ఏటా రూ. 3–4 లక్షలు మిగులుతున్నాయి. మా తల్లిదండ్రులు, శ్రీమతి మమత ప్రోత్సాహంతోనే రైతుగా ఆనందంగా ఉన్నాను. భవిష్యత్తు మరింత ఆనందమయంగా ఉంటుందని చెప్పడానికి ఎటువంటి సందేహమూ లేదు.
– సాతంబాకం వినోద్‌రెడ్డి (94402 30052), తవణంపల్లి, చిత్తూరు జిల్లా

సంతృప్తికరమైన వేతనం.. ఆనందం..
నా యుక్త వయసులో నేర్చుకున్న పనికి ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది. గానుగ తయారీ వల్ల ప్రతి రోజూ రూ.400 నుంచి రూ.500 వరకు సంతృప్తికరమైన వేతనం లభిస్తోంది. పది మంది ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతున్నందుకు ఆనందంగా ఉంది.
– కోదండాచారి, కట్టె గానుగల వడ్రంగి


∙ గోమయంతో తయారు చేసిన వివిధ ఉత్పత్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement