ప్రకృతి వ్యవసాయ విప్లవం! | Nature's Agriculture Revolution! | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ విప్లవం!

Published Tue, May 16 2017 3:43 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

ప్రకృతి వ్యవసాయ విప్లవం!

ప్రకృతి వ్యవసాయ విప్లవం!

ప్రకృతికి అనుగుణమైన జీవన కళా నైపుణ్యాలను అందించడంలో ప్రసిద్ధిపొందిన బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అంతర్జాతీయ కేంద్రం ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిఖరాగ్ర సభకు ఇటీవల వేదికైంది. తొలి జన్యుమార్పిడి ఆహార పంట జీఎం ఆవాలకు ఆమోద ముద్ర వేయడానికి భారత ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా జరిగిన ఈ సభ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆహార అభద్రతకు, పౌష్టికాహార లోపానికి, జన్యుమార్పిడి విత్తనాలకు, అన్నదాతల ఆత్మహత్యలకు తావు లేని సమాజం కోసం ప్రకృతి వ్యవసాయ విప్లవానికి త్రికరణశుద్ధితో నీర్వోసి నార్వెట్టాలని ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్రసభ’ పాలకులకు పిలుపునిచ్చింది. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన ప్రకృతి వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, నిపుణులు, మార్కెటింగ్‌ నిపుణులు ఏకతాటిపైకి రావడం విశేషం. ఆ విశేషాలు కొన్ని ‘సాగుబడి’ పాఠకుల కోసం..

దేశంలో అనేక రాష్ట్రాల్లో స్వల్ప ఖర్చుతో, సొంత వనరులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య తామర తంపరగా విస్తరిస్తున్న కీలక దశలో ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్ర సభ’ జరగడం విశేషం. ప్రముఖులను ఆహ్వానించి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవసాయ విభాగం ‘శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ ట్రస్టు (ఎస్‌.ఎస్‌.ఐ.ఎ.ఎస్‌.టి.)’ ఈ శిఖరాగ్ర సభను నిర్వహించింది.

‘అన్నపూర్ణ’ నేలతల్లి ఆరోగ్యంతోపాటు మనుషుల ఆరోగ్యాన్నీ దుంప నాశనం చేస్తున్న రసాయనిక వ్యవసాయాన్ని వీలైనంత తొందరగా వదిలించుకొని.. దేశం యావత్తూ ప్రకృతి వ్యవసాయం వైపు దీక్షగా కదలాలని ‘ప్రకృతి వ్యవసాయంపై తొలి శిఖరాగ్రసభ’లో వక్తలు పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రకృతి వ్యవసాయదారులు, పాలకులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు శిఖరాగ్రసభలో పాల్గొన్నారు. ఉక్రేనియా పార్లమెంటరీ ప్రతినిధివర్గంతోపాటు ఏడు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

మనోబలంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 39 మంది రైతులు, రైతు శాస్త్రవేత్తలను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు, ఆథ్యాత్మిక గురువు రవిశంకర్‌ సమక్షంలో ‘కృషి రత్న’ పురస్కారాలతో సత్కరించడం విశేషం. కర్నూల్‌ జిల్లాకు చెందిన యువ ప్రకృతి వ్యవసాయదారుడు మహమ్మద్‌ బాషా, ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్తగా కేరళ ప్రభుత్వం ప్రకటించిన 20 ఏళ్ల యువ రైతు సూరజ్‌ సభికుల దృష్టిని అమితంగా ఆకర్షించారు.

నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా..
తనకు 4 ఎకరాల భూమి, ఏడు ఆవులున్నాయని, నాలుగేళ్లుగాప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని కర్నూలు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు మహమ్మద్‌ బాషా చెప్పారు. తమ ఇంట్లో అందరూ కలసి వ్యవసాయ పనులు చేసుకుంటామని, ఆవులు తెచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదన్నారు. ఒకటిన్నర ఎకరాల్లో 57 టన్నుల పచ్చి మిర్చి దిగుబడి పొందినట్టు చెప్పారు.

రెండు రోజుల సభలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త డా. వందనా శివ, ఇండోనేసియా ప్రతినిధి ఇబు హెలియంతి హిల్‌మన్‌ కీలకోపన్యాసాలు చేశారు. వసంతరావ్‌ నాయక్‌ మరట్వాడా కృషి విద్యాపీ (పర్బని) వైస్‌ ఛాన్సలర్‌ డా. బి. వెంకటేశ్వర్లు, తెలుగు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఛత్తీస్‌గఢ్‌ మంత్రి మహేశ్‌ గగ్డ, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ డా. జీవీ రామాంజనేయులు, ప్రకృతి సేద్యంపై ఆం.ప్ర. ప్రభుత్వానికి సలహాదారు టి. విజయకుమార్, హర్యానాకు చెందిన ఐఏఎస్‌ అధికారిణి రజని సిక్రి సిబల్, రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయదారుడు దీపక్‌ సచ్‌దే, ఎస్‌.ఎస్‌.ఐ.ఎ.ఎస్‌.టి. ట్రస్టీ డా. బి. ప్రభాకర్‌ రావు, సేంద్రియ సేద్యంపై జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు కపిల్‌ షా తదితరులు వేర్వేరు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇచ్చారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, ఖేతీ విరాసిత్‌ మంచ్‌ సారధి ఉమేంద్ర దత్‌ తదితరులు పాల్గొన్నారు.
– పంతంగి రాంబాబు,  సాగుబడి డెస్క్‌

ప్రజలందరికీ ప్రకృతి ఆహారం అందాలి!
ప్రకృతి వ్యవసాయం ఓ విప్లవం. ఇది ప్రపంచం అంతా విస్తరించాలి. ప్రకృతి వ్యవసాయంతోపాటు వాన నీటి సంరక్షణ, దేశీ గోజాతులు, దేశీ విత్తనాల పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, పాలకులు గుర్తెరగాలి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని సమృద్ధిగా పండించడానికి ఉపకరించే సమగ్ర పద్ధతులు మన రైతుల వద్ద ఉన్నాయి. శిఖరాగ్రసభ తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తాం. ఆహారాన్ని పండించే రైతు, ఆహారాన్ని వండి వడ్డించే మహిళలు కూడా సంతోషంగా ఉండాలంటే అందరం కలసి ప్రకృతి సేద్యాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి. రైతులకు రుషి కృషి పద్ధతులపై అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా శిక్షణ ఇస్తున్నాం. మా వాలంటీర్ల కృషితో 12 నదులు పునరుజ్జీవం పొందాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పండించే ఆహారంలో సత్తువ గానీ, ఖనిజాలు గానీ తక్కువేనని అందరూ గ్రహించాలి. అమృతాహారాన్ని ప్రజలకు అందించాలన్న సంకల్పంతో దళారుల్లేని మార్కెటింగ్‌ వ్యవస్థ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నాం. దేశంలో ప్రకృతి వ్యవసాయం పూర్తిస్థాయిలో విస్తరిస్తే రసాయన రహిత ఆహారోత్పత్తుల ధర కూడా తగ్గుతుంది. 
– పండిట్‌ రవిశంకర్,ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు, బెంగళూరు

జన్యుమార్పిడి ఆహారంతో ముప్పు!
రసాయనాలతో పండించిన ఆహారంలో పోషకాల లోపం తీవ్రంగా ఉన్నందున సమాజం రోగగ్రస్తమవుతున్నదన్న సత్యాన్ని పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. జన్యుమార్పిడి విత్తనాలతో పండించే ఆహారంతో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, పంటల జీవవైవిధ్యానికి ముప్పు పొంచి ఉంది. సుసంపన్నమైన సంప్రదాయ వ్యవసాయ సంస్కృతిని, పంటల జీవవైవిధ్య సేద్య రీతులను పరిరక్షించుకుంటూ పురోగమించడమే ఉత్తమం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆహార భద్రతకు ఇదే మూలం. పండిట్‌ రవిశంకర్‌జీ ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయోద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా.
– డా. వందనా శివ, సుప్రసిద్ధ శాస్త్రవేత్త, నవధాన్య, డెహ్రాడూన్‌

మన సంకల్పాన్ని మొక్కలూ గ్రహిస్తాయి!
నేలతల్లి అన్నపూర్ణ. పోషకాంశాలన్నీ భూమిలో ఉన్నాయి. వాటిని పంటలకు అందుబాటులోకి తేవడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే చాలు. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. ‘అమృత్‌మిట్టి’ని పొలంలోనే తయారు చేసి వాడుకోవచ్చు. బయటి నుంచి సేంద్రియ ఎరువు తెచ్చి వేయాల్సిన అవసరం లేదు. రైతుకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. వాస్తవ సమాచారం ఇవ్వాలి. మనందరం కలిసి, గొప్ప చైతన్యంతో చేయాల్సిందల్లా ప్రకృతి వ్యవసాయం ప్రారంభించడం ఒక్కటే. మన ఉక్కు సంకల్పాన్ని మొక్కలూ గ్రహిస్తాయి. ప్రొ. ధబోల్కర్‌ ‘నేచుఎకో’ సేద్య పద్ధతి పాటిస్తున్న పొలంలో ‘హెక్టారుకు, ప్రతి నెలా రూ. లక్ష చొప్పున ఆదాయం’ వస్తున్నది. మా ప్రాంతంలో 8 వేల హెక్టార్లలో ఈ సాగు జరుగుతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు వచ్చి చూడొచ్చు.
– దీపక్‌ సచ్‌దే (093295 70960), మల్పని ట్రస్టు, బజ్‌వాడ, మధ్యప్రదేశ్‌  www.amrutkrushi.com

జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించడం మన బాధ్యత!
ప్రకృతి వ్యవసాయం విరాజిల్లాలంటే జన్యుమార్పిడి పంటలను అందరం కలసి అడ్డుకోవాలి. కలుపు మందులను తట్టుకునేలా రూపొందించిన జన్యుమార్పిడి (జీఎం) ఆవాలు పంట అవసరమే మనకు లేదు. దీన్ని అనుమతిస్తే.. మరో 72 జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు బార్లా తెరిచినట్టవుతుంది. జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించడం ప్రజాక్షేమం కోరే మనందరి బాధ్యత. కలుపుమందులను తట్టుకునే జీఎం పంటల వల్ల మనుషులకు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని రెండేళ్ల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
– కపిల్‌ షా, సభ్యులు, రసాయన రహిత వ్యవసాయంపై జాతీయ టాస్క్‌ఫోర్స్‌

దేశీ విత్తనాలపై పరిశోధనలు!
ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి బాగవుతుంది. సూక్ష్మజీవులను భూమికి అందిస్తే చాలు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. రైతులు బజారుకెళ్లి తమ ఉత్పత్తులు అమ్ముకోవాలే గానీ, ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్, జర్మనీలోని మాక్స్‌ పాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌తో కలసి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ మన దేశంలో దేశీ విత్తనాలపై పరిశోధనలు చేపట్టబోతున్నది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దేశీ విత్తనాల రక్షణకు చేపట్టాల్సిన చట్టాలు, విధానపరమైన చర్యలపై ప్రభుత్వానికి సూచనలివ్వడానికి ఈ పరిశోధనలు ఉపకరిస్తాయి.
– డా. బి. ప్రభాకరరావు, ట్రస్టీ,ఎస్‌.ఎస్‌.ఐ.ఎ.ఎస్‌.టి., బెంగళూరు

ఆహార, పౌష్టికాహార భద్రత ప్రకృతి సేద్యంతోనే సాధ్యం
పౌష్టికాహార భద్రత, ఆహార భద్రత ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యం. వాతావరణ మార్పులను, కరువును, కేన్సర్‌ వంటి మహమ్మారి వ్యాధులను దీటుగా ఎదుర్కోవడానికి ప్రకృతిlసేద్యం ఒక్కటే మార్గం.
– పి. రామకృష్ణారెడ్డి, చైర్మన్, శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ టెక్నాలజీ ట్రస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement