రైతు భరోసా కేంద్రం... ఓ విప్లవం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.. వేటికీ ఊరు దాటివెళ్లాల్సిన పనిలేకుండా... ఆఖరికి పంట విక్రయానికి కూడా అక్కరకొచ్చేలా ఊళ్లో వెలసిన సేద్యాలయం. రైతాంగం స్థితిగతుల్ని సమూలంగా మార్చే శక్తి కలిగిన ఈ ఆర్బీకే.. యావత్తు దేశానికీ ఓ రోల్‌మోడల్. దీనికి అనుబంధంగా రైతులకు పనిముట్లు అందించేందుకు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు... తదుపరి అడుగుగా సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయాలు... ఇవన్నీ ఇప్పుడు యావద్దేశాన్నీ ఆకర్షిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఏపీకి వచ్చి వెళ్లాయి. ఏపీ మాదిరి సేంద్రియ సాగుకు ఇప్పటికే ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సిద్ధంకాగా... మరో ఏడు రాష్ట్రాలు ఇదే బాటలో నడవనున్నాయి. దీనిపై ఏపీతో కలసి పనిచేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ త్వరలోనే ఒప్పందం చేసుకుంటోంది కూడా!!. ఇక వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అద్దె ప్రాతిపదికన రైతన్నలకు వ్యవసాయ ఉపకరణాలను అందిస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా ప్రత్యక్షం కానున్నాయి. ఇదే తరహాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అద్దెకు యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయాలని కేంద్రం భావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే... వైఎస్ జగన్ ఏపీలో ఆరంభించినట్లే తామూ ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని శుక్రవారం అసెంబ్లీ ముఖంగా తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రకటించటం మరో ఎత్తు. ఏపీలో విమర్శలు మాత్రమే తెలిసిన విపక్షాలకు ఇవన్నీ అర్థం కాకున్నా... యావత్తు దేశమూ బాగానే అర్థం చేసుకుంటోంది.!!
ప్రతి ఆదివారం... ప్రత్యేకం
‘నిన్నటికంటే నేడు బాగుండటం... రేపు మరింత బాగుంటామనే ఆశ కల్పించటం’ ఇదే అభివృద్ధికి నిర్వచనమంటూ విద్య, వ్యవసాయ, ఆరోగ్య రంగాలను అత్యంత ప్రాధాన్య రంగాలుగా చేసుకుని... సమూల సంస్కరణలతో ముందుకెళుతున్న ఏపీ ఇపుడు పలు రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. సచివాలయాల నుంచి మొదలుపెడితే... సంచార పశువైద్య శాలలు, సేంద్రియ సాగు విధానాలు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు, రేషన్ డోర్ డెలివరీ, సరికొత్త ఆక్వా కల్చర్ చట్టం, ఆర్‌బీకేలు, విద్యాసంస్థలు– ఆసుపత్రుల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు... ఇవన్నీ పలు రాష్ట్రాల్లో అమల్లోకి రాబోతున్నాయి. పొరుగునున్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అధికారులు వచ్చి వీటిని అధ్యయనం చేసి వెళుతున్నారు. కొన్నింటిని ఏకంగా కేంద్రమే దేశవ్యాప్తంగా తేవాలనుకుంటోంది. ఆ వివరాలతో... ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఇస్తున్న కథనాల్లో రెండవ కథనమిది.
నెల్లూరు జిల్లా అల్లూరు ఆర్బీకే సీహెచ్‌సీలో రైతు కమిటీకి ఇచ్చిన యంత్ర పరికరాలు
ఏపీలో అద్భుత ఫలితాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సాగు అమలవుతున్న తీరును పరిశీలించాం. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఇదే తరహాలో ఎరువులు, రసాయన పురుగు మందులను వినియోగించకుండా సహజసిద్ధ ఆహార ఉత్పత్తులను పండించేలా రైతులను ప్రోత్సహిస్తాం. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఎంవోయూ కుదుర్చుకోనుంది. ఖరీఫ్ నుంచి దశలవారీగా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తాం. ఇందుకు అవసరమైన క్షేత్ర స్థాయి వ్యవస్థ ఏర్పాటులో ఏపీ రైతు సాధికారసంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. సిబ్బందితో పాటు రైతులకు కూడా శిక్షణ ఇవ్వనుంది.
– భగవాన్‌దాస్ బైసర్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, మాండ్లా జిల్లా, మధ్యప్రదేశ్
మనవైపు దేశం చూపు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహం వల్ల ప్రకృతి సాగులో అద్భుత ఫలితాలు నమోదవుతున్నాయి. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో ఎంఓయూ చేసుకోనుంది. రాష్ట్రంలో ప్రకృతి సాగును పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అమలు దశకు చేరుకోగా మరో ఏడు రాష్ట్రాలు చర్చల దశలో ఉన్నాయి.
– టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ
మోడల్.. మోడర్న్ సాగుబాట
వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, వినూత్న విధానాలు జాతీయ స్థాయిలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.
అద్దెకు గ్రామాల్లో యంత్ర పరికరాలు
సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తేవాలన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు ఆర్బీకేలకు అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ.1,615 కోట్లతో గ్రామ స్థాయిలో 10,750 సీహెచ్‌సీ (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), వరి సాగయ్యే జిల్లాల్లో రూ.404 కోట్లతో క్లస్టర్ స్థాయిలో 1,615 కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో సీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం కింద ఆర్బీకే స్థాయిలో గరిష్టంగా రూ.15 లక్షలు, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన యంత్రాలను సమకూరుస్తున్నారు.
ఇప్పటికే రెండు విడతల్లో రూ.645 కోట్లతో 4,061 ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు, రూ.161.50 కోట్లతో 142 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీకే స్థాయిలో మరో 4,105 సీహెచ్‌సీలతో పాటు 491 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇక మిగిలిన సీహెచ్‌సీలను జూన్ కల్లా గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సీహెచ్‌సీల ఏర్పాటుతో విత్తనం నుంచి నూర్పిడి వరకు అన్నదాతలు ఎదుర్కొంటున్న కూలీల కొరతకు ప్రభుత్వం చెక్ పెట్టగలిగింది. పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతోంది.
ట్రాక్టర్లు కూడా..
ఆర్బీకేల స్థాయిలోనే ట్రాక్టర్లను కూడా అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతగా 3,500 ట్రాక్టర్లను మే నెలలో రైతు కమిటీలకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏపీ తరహాలో అండగా నిలిచేలా..
గ్రామాల్లో రైతు గ్రూపులకు యంత్ర పరికరాలను అందించి అద్దె ప్రాతిపదికన మిగిలిన అన్నదాతల అవసరాలను తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవా పథకం కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షించింది. ఇదే రీతిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)కు అద్దె ప్రాతిపదికన యంత్రాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ పరిధి పెంచడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో అండగా నిలవాలని నిర్ణయించింది. 2022–23 కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు కేటాయింపులు కూడా చేశారు.
యాంత్రీకరణ దిశగా శిక్షణ..
జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రోత్సహించడం, హై ప్రొడక్టివ్ ఫామ్ మిషనరీ అందుబాటులోకి తేవడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించాలని కేంద్రం భావిస్తోంది. 40–50 శాతం రాయితీని కొనసాగిస్తూ బ్యాంకుల ద్వారా ఆర్ధిక చేయూతనందించేలా కేంద్ర వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో డిమాండ్ ఉన్న ఆర్బీకేల్లో అదనంగా రెండో సీహెచ్‌సీ ఏర్పాటుతోపాటు రైతులకు వ్యక్తిగతంగా యంత్ర పరికరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రూ.15 లక్షల అంచనా వ్యయంతో 40 శాతం సబ్సిడీపై వీటిని నెలకొల్పనున్నారు.
‘ప్రకృతి’లో ఆదర్శం
ప్రకృతి సాగు విధానాలలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో ఎంవోయూ చేసుకోనుంది. సేంద్రియ సేద్యంపై యూనివర్సిటీల్లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీని ఆదర్శంగా తీసుకొని ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ప్రభుత్వాలు కార్యాచరణ సిద్ధం చేయగా కేరళ, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, బిహార్ మన రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే మన రాష్ట్రంతో ఒడిశా ప్రభుత్వం ఎంవోయూ చేసుకోగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ నెలాఖరులో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
రాష్ట్రంలో ప్రకృతి సాగు ఇలా..
రాష్ట్రంలో జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ కింద రూపుదిద్దుకున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్‌ఎఫ్)గా అమలవుతోంది. గత ఖరీఫ్‌లో 3,730 గ్రామాల్లో 5.92 లక్షల మంది రైతులు 6.71 లక్షల ఎకరాల్లో దీన్ని అనుసరించారు. ప్రస్తుత రబీలో 71 వేల మంది రైతులు 76 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేశారు.
మధ్యప్రదేశ్‌లో వంద గ్రామాల్లో..
మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో 4 బ్లాకుల (మండలాలు) పరిధిలో సహజ వ్యవసాయ పరివర్తన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తొలుత బిచియా బ్లాకులోని 3 క్లస్టర్స్, నివాస్ బ్లాకులోని ఓ క్లస్టర్‌ను ఇందుకు ఎంపిక చేసి వంద గ్రామాల్లో అమలు చేస్తున్నారు. 18,750 ఎకరాల్లో 15 వేల మందికిపైగా గిరిజన రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ రైతు సాధికార సంస్థ టెక్నికల్ ఏజెన్సీగా, వాసన్ సంస్థ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా వరి, ఉల్లి, కందులు, శనగలు (చనా), అరికెలు (కోడా), సామలు (కుట్కి), కూరగాయలు సాగవుతాయి.
గ్రామ స్థాయిలో సీఆర్పీ వ్యవస్థ
ప్రకృతిసాగు అమలు కోసం మధ్యప్రదేశ్‌లో సీఆర్పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్) వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. గ్రామానికి ఇద్దరు చొప్పున కనీసం 200 మందిని సిద్ధం చేస్తారు. సీఆర్పీలతో పాటు క్లస్టర్, బ్లాకు స్థాయిలో సమన్వయం కోసం ఐసీఆర్‌పీ(ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్)తో పాటు ఎఫ్‌ఈఎస్ (ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ), ఎంపీఎస్ ఆర్‌ఎల్‌ఎం (మధ్యప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్)కు చెందిన సీబీఓ(కమ్యూనిటీ బేస్ట్ ఆర్గనైజషన్) సభ్యులకు సహజ వ్యవసాయ నమూనాలు, ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణనిస్తారు. ఎంపిక చేసిన 8 గ్రామ పంచాయతీల్లో డెమాన్‌స్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తారు. ఆయా గ్రామాల్లో ఇన్‌పుట్ కమ్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఘన జీవామృతాలు, కషాయాల తయారీ విధానంతో పాటు వినియోగంపై రైతులకు శిక్షణనిస్తారు. రెండు రౌండ్లలో 45 రోజుల పాటు మరో రెండు రౌండ్లలో 30 రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment