సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84) కర్ణాటకలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిద్రలోనే కన్నుమూశారు. మరలేనహళ్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సైతం ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. కాగా, ఆయన స్వస్థలం బెంగళూరు రూరల్ వర్తూర్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వర్తించారు. జపాన్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనొబు ఫుకువోకా శిష్యుడిగా నారాయణరెడ్డి ప్రసిద్ధి పొందారు. ఫుకువోకా భారత్‌లో పర్యటనకు వచ్చినప్పుడు మరలేనహళ్లిలోని నారాయణరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు.
డాక్టర్ నారాయణరెడ్డి 35 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆ పొలంలోని మట్టి 5 శాతం సేంద్రియ కర్బనంతో కూడి ఉండటం విశేషంగా చెబుతారు. దేశ విదేశాల నుంచి రైతులు వచ్చి ఆయన వద్ద అనుభవపూర్వకంగా ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. లీసా ఇండియా ఆంగ్ల ప్రకృతి వ్యవసాయ మాసపత్రికకు చాలా ఏళ్లుగా ఆయన కాలమిస్టు. వేలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించిన డా. నారాయణరెడ్డి మరణం తీరని లోటని పలువురు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment