అండుకొర్ర పొలంలో తండ్రి చిన్నగురివిరెడ్డితో కిశోర్‌చంద్ర
ఆంగ్ల సాహిత్యంపై మక్కువతో హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (‘ఇఫ్లూ’)లో పీహెచ్‌డీ చేస్తున్న ఓ యువకుడు.. ఉన్నట్టుండి ఒక రోజున భార్యా బిడ్డలతోపాటు తిరిగి ఇంటికెళ్లి.. అంతే మక్కువతో రెండున్నరేళ్లుగా, ప్రశాంతంగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు.
అందుకు దారితీసిన బలమైన కారణం ఏమై ఉంటుంది? ‘‘మట్టి ఆరోగ్యంపైనే మనుషులు సహా సకల జీవరాశి ఆరోగ్యం, జీవావరణం శ్రేయస్సు ఆధారపడి ఉన్నాయని గ్రహించా. పరిశోధన కొనసాగించి అధ్యాపకుడిగా జీవించే కన్నా.. నేలతల్లికి ప్రణమిల్లి.. ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకుంటూ మట్టిని నెమ్మదిగా బాగు చేసుకుంటూనే ఆయురారోగ్య సిరులనిచ్చే చిరు(సిరి)ధాన్యాలను సాగు చేస్తున్నా..’’ అంటున్నారు కిశోర్ చంద్ర (38).
శిక్షణ పొంది ప్రకృతి సేద్యంలోకి..
ఆంగ్ల సాహిత్యంలో ఎమ్.ఎ, ఎంఫిల్, బీఈడీ చేసి దేశ విదేశాల్లో ఐదేళ్లు అధ్యాపకుడిగా పనిచేసి.. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ‘ఇఫ్లూ’లో పరిశోధన విద్యార్థిగా చేరారు. ఆ కొత్తలోనే అమీర్‌ఖాన్ ‘సత్యమేవ జయతే’ టీవీ షోలో విషతుల్య ఆహారంపై స్ఫూర్తి పొందారు. ఒకవైపు ఆంగ్ల భాషా బోధనపై పరిశోధనను కొనసాగిస్తూనే.. అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ సంస్థలో పర్మాకల్చర్‌లో, భూమి కాలేజీ (బెంగళూరు)లో ఆహారం–వ్యవసాయంపైన, మనసబు ఫుకుఓకా ప్రకృతి వ్యవసాయంపైన శిక్షణ పొంది అవగాహనను పరిపుష్టం చేసుకున్నారు. 2015 ఏప్రిల్‌లో తన జీవితాన్ని అర్థవంతమైన మలుపుతిప్పే నిర్ణయం తీసుకున్నారు! నాలుగేళ్లు కొనసాగించిన పరిశోధనకు స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. ఉన్నత విద్యావంతులైన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు ఆయన నిర్ణయాన్ని స్వాగతించి తోడ్పాటునందించడం విశేషం.
రసాయనిక వ్యవసాయానికి స్వస్తి
కిశోర్‌చంద్ర స్వస్థలం డా. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు. తండ్రి డాక్టర్ పాతకోట చిన్నగురివిరెడ్డి ఆంత్రోపాలజీలో పీహెచ్‌డీ చేసి, శ్రీహరికోట ‘ఇస్రో’లో కొంతకాలం యానాదులపై పరిశోధన చేశారు. కుటుంబ కారణాల వల్ల ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రొద్దుటూరులోనే ఉంటున్నారు. అక్కడికి సమీపంలోని తాళ్లమాపురం గ్రామంలో వారికి మెట్ట భూమి ఉంది. పదేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేయిస్తున్నారు. ఆరేడేళ్ల క్రితం వారి పొలంలో పురుగులమందు పిచికారీ చేసిన ఇద్దరు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురైతే.. రూ. 50 వేల ఖర్చుతో వైద్యం చేయించి వారి ప్రాణాలను కాపాడారు. రసాయనిక వ్యవసాయం కొనసాగింపు సరికాదన్న భావం బలపడడానికి ఈ సంఘటన కూడా ఒక కారణమని కిశోర్ చంద్ర వివరించారు. ఆ నేపథ్యంలో రసాయన రహిత సేద్యం వైపు మళ్లిన ఆయన తండ్రితో కలసి గత రెండున్నరేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు.
అండుకొర్రల సాగుపై దృష్టి
సాగునీటి వసతి లేని తమ పొలాన్ని అందుబాటులోని ప్రకృతి వనరులతోనే సారవంతం చేసుకుంటూనే తమ ప్రాంతానికి అనువైన చిరుధాన్యాల సాగును కిశోర్ చంద్ర చేపట్టారు. పచ్చిరొట్ట ఎరువులతోపాటు ‘రామబాణం’ పద్ధతిలో భూసారాన్ని పెంపొందిస్తున్నారు. జీవామృతం, పంచగవ్యలతో కొర్రలు, ఊదలతోపాటు అరుదైన సిరిధాన్య పంట అండుకొర్రలు(బ్రౌన్‌టాప్ మిల్లెట్) సాగు చేస్తూ.. తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో ఏకపంటగా అండుకొర్రలు సాగు చేశారు. ఇది 80–90 రోజుల పంట. పంట మూడు అడుగుల ఎత్తు పెరిగింది. కోతకు వచ్చే దశలో ఎడతెగని వర్షాల వల్ల దిగుబడి ఎకరానికి 9 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్లకు తగ్గింది. అండుకొర్ర ధాన్యం క్వింటాల్‌కు రూ. 3,500కు అమ్మారు. రబీలో 14 ఎకరాల్లో అండుకొర్రలను సాగు చేస్తున్నారు. డిసెంబర్ 15న చాడ గట్టి(బోరు నీటిని పారగట్టి్ట) గొర్రుతో ఇరుసాళ్లు విత్తనం విత్తారు. ఎకరానికి రెండుంపావు కిలోల విత్తనం వాడారు. దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి, 100 కిలోల ఆముదం పిండి చల్లారు.
విత్తిన ఐదు వారాలకు బోరు నీటితోపాటు జీవామృతం పారగట్టారు. 8 వారాలకు ఎకరానికి రెండున్నర లీటర్ల పంచగవ్యను వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశారు. మార్చిలో నూర్పిడి చేయనున్నారు. రబీ పంట వేశాక వర్షం పడకపోవడం వల్ల పంట అడుగున్నర ఎత్తు మాత్రమే ఎదిగింది. ఎకరానికి 6 క్వింటాళ్ల అండుకొర్రల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది ఊదలు, కొర్రలు, జొన్నలు సాగు చేసినప్పుడు.. ఊదలను సగం వరకు పక్షులు తిన్నాయని, అండుకొర్రలకు పక్షుల బెడద లేదన్నారు. సిరిధాన్యాల్లోకెల్లా అత్యధికంగా 12.5% పీచు కలిగి ఉండటం అండుకొర్రల విశిష్టత.
ఇంటిల్లిపాదికీ సిరిధాన్యాలే ఆహారం..
ప్రొద్దుటూరులో జన్మించి మైసూరులో స్థిరపడిన సుప్రసిద్ధ స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలి సూచనల మేరకు 8 నెలలుగా తమ 8, 2 ఏళ్ల పిల్లలతోపాటు ఇంటిల్లిపాదీ సిరిధాన్యాలనే ప్రధాన ఆహారంగా తింటూ ఆరోగ్యంగా ఉన్నామని కిశోర్ చంద్ర ఆనందంగా తెలిపారు. జలవనరులు తక్కువగా ఉన్న తమ పొలంలో అతి తక్కువ నీటితో పండే సిరిధాన్యాలను సాగు చేయడంతోపాటు.. వాటినే ప్రధాన ఆహారంగా తినటం ద్వారా విద్యాధిక రైతు కిశోర్‌చంద్ర యువ రైతాంగానికి ఆదర్శంగా నిలవడం విశేషం. ఇటీవల సేంద్రియ గ్రామసభలో కిశోర్‌చంద్రను అధికారులు ఘనంగా సత్కరించారు.
బాధ్యతగల రైతుగా సిరిధాన్యాలు పండిస్తున్నా..
వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం మట్టిని, నీటిని, వాతావరణాన్ని, మొత్తం జీవావరణాన్ని నాశనం చేసే రసాయనిక సేద్యమేనని.. అతిగా నీటిని తాగే పంటలేనని అర్థం చేసుకున్నా. మనకూ భూమి ఉంది కదా. బాధ్యతగల పౌరుడిగా ఏం చేయొచ్చు? ఏం చేయగలం? అని ఆలోచించా. నాన్నతో కలిసి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టా. తినే పంటలనే పండిస్తున్నాం. తినగా మిగిలినది అమ్ముతున్నాం. నిదానంగా భూమి సారవంతమవుతోంది. సీతాకోకచిలుకలు, తేనెటీగలు, వానపాములు, పీతలు కనిపిస్తుంటే సంతోషంగా ఉంది. సిరిధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయలూ పండించి నలుగురికీ అందించాలన్నది లక్ష్యం.
– పాతకోట కిశోర్‌చంద్ర (94900 28642), ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా
– కుడుముల వీరారెడ్డి, సాక్షి, ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా
Comments
Please login to add a commentAdd a comment