ఈ వ్యవసాయం ఓ ఆశాకిరణం | Natural Agriculture Farming Guest Column By Devinder Sharma | Sakshi
Sakshi News home page

ఈ వ్యవసాయం ఓ ఆశాకిరణం

Published Mon, Oct 25 2021 1:37 AM | Last Updated on Mon, Oct 25 2021 1:37 AM

Natural Agriculture Farming Guest Column By Devinder Sharma - Sakshi

పురుగుమందులను, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఒక సరికొత్త సామాజిక ఉద్యమంలా ఆవిర్భవించింది. ఈ నూతన వ్యవసాయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఛిన్నాభిన్నమైపోయిన ఆహార వ్యవస్థను ఇది చక్కదిద్దుతోంది. ప్రకృతి వ్యవసాయంతో పంటలకు పట్టే తెగుళ్ల కేసులు 86 శాతం పడిపోయాయి. ప్రతి రైతు కుటుంబం ఆరోగ్య ఖర్చులకు పెడుతున్న మొత్తంలో 50 శాతం దాకా తగ్గిపోయింది. వ్యవసాయ ఖర్చులు 68 శాతం తగ్గిపోయాయి, పంట దిగుబడుల్లో 88 శాతం పెరుగుదల నమోదైంది. పంటల రకాలను బట్టి, రాబడి 8 నుంచి 111 శాతం వరకు పెరిగింది. ఇది భవిష్యత్‌ సమాజ ఆహారానికి నిలకడైన మార్గంవైపుగా జరుగుతున్న మౌలిక పరివర్తన.

దేశంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకంతో ఛిన్నాభిన్నమైపోయిన ఆహార వ్యవస్థను ప్రకృతి వ్యవసాయం ఎలా చక్కదిద్దుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంపై స్పష్టత కోసం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌కి నేను కాల్‌ చేసి, కమ్యూనిటీ నేతృత్వంలో వ్యవసాయం సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ లోని కొన్ని గ్రామాలను సందర్శించాల్సిందిగా అభ్యర్థించాను. పురుగుమందులను వాడకుండా నడుస్తున్న ఈ నూతన వ్యవసాయ వ్యవస్థ ఏపీలో ఒక సరికొత్త సామాజిక ఉద్యమంలా ఆవిర్భవించిందని చెప్పాను. ఆయన నా మాటలు ఓపిగ్గా విన్నారు.

పురుగుమందులు లేని వ్యవసాయ వ్యవస్థ ఏపీ రైతులను ఎలా ఆకట్టుకుందీ, ఒక సురక్షితమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానం వైపుగా రైతుల పరివర్తన ఎలా జరిగిందీ వివరంగా తెలుసుకోదలిచినట్లు ఆయన చెప్పారు. నా కాల్‌ ముగించిన వెంటనే ఆయన హైదరాబాద్‌ లోని ఐసీఏఆర్‌ డైరెక్టరేట్‌ను సంప్రదించారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రాథమిక అంచనా నిమిత్తం, ఏపీలోని కొన్ని గ్రామాలను సందర్శించడానికి శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలని ఆయన ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత ఆయన నాకు కాల్‌ చేసి ఈ అంశంపై తానందుకున్న నివేదిక చాలా సానుకూలంగా ఉందనీ, ఇప్పటికే అమలవుతున్న వ్యవసాయ విధానాల నుంచి కొత్త పద్ధతికి మారడానికి రైతాంగం ఆలోచనల్లోనే సమూల మార్పులు అవసరమనీ తెలిపారు.

పురుగుమందుల అవసరం లేని సాగు వ్యవస్థ వైపు మళ్లడానికి ఉన్న అపారమైన అవకాశాలను ఎంత త్వరగా చూడగలం అని చెప్పడానికే నేను ఈ కథనాన్ని ఇక్కడ పొందుపర్చాను. ఈ నూతన వ్యవసాయ వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ఆశాకిరణంగా కనిపిం చడానికి ముందుగా, ఒక చిన్న చొరవ ద్వారా ప్రారంభమైందని తెలుసుకుంటే మన హృదయాలు ఉప్పొంగుతాయి. కమ్యూనిటీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ (సిఎమ్‌ఎన్‌ఎఫ్‌) కార్యక్రమం అని మనం చెప్పుకుంటున్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లోని 13 జిల్లాల్లోని 3,780 గ్రామాలకు విస్తరించింది.

దాదాపు 7 లక్షలమంది రైతులు ఇప్పుడు ఈ మార్గంలో పయనిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయ పర్యావరణ వ్యవస్థగా ఆవిర్భవించింది. గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఫుడ్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘నిజమైన విలువ : ఆహార వ్యవస్థ పరివర్తన సానుకూల ప్రభావాల వెల్లడి’ అనే నివేదిక ఈ కార్యక్రమాన్ని, ఛిన్నాభిన్నమైన ఆహార వ్యవస్థలను సమర్థంగా చక్కదిద్దగల ఆరు అంతర్జాతీయ ప్రేరణల్లో ఒకటిగా పేర్కొంది. ప్రపంచం ఎదురుచూస్తున్న గొప్ప మార్పునకు ఇది ఒక నాందీవాచకమై నిలిచిందని ఈ నివేదిక ప్రశంసించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సహజ వ్యవసాయ విధానం 8 లక్షల హెక్టార్లలో అమలవుతోంది. వికేంద్రీకరించిన వ్యవసాయ వ్యవస్థ కింద నడుస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వ యాజమాన్యంలోని లాభాలతో నిమిత్తం లేని రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్‌) ద్వారా కొనసాగుతోంది. ఒక్కొక్కటి 2 వేల కుటుంబాలను పర్యవేక్షిస్తున్న 12,500 గ్రామ కౌన్సిళ్లతో విజయవంతమైన ఈ కార్యక్రమం పరస్పర అనుసంధానంతో నడుస్తోంది. దీంట్లో స్థానికంగా గుర్తింపు పొందిన ఒక రైతు నిపుణుడు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు, వ్యవసాయ నిపుణుడితో కూడిన ముగ్గురు ముఖ్యమైన రైతుల బృందం నిత్యం ఈ విధానంలో సాగు చేస్తున్న తోటి రైతులకు సూచనలు అందిస్తూ మార్గదర్శకత్వం వహిస్తుంటుంది.

పై నివేదిక పేర్కొన్నట్లుగా స్థానికంగా ప్రకృతి వ్యవసాయ సూత్రాల అమలులో మహిళా బృందాలు గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. మహిళా శక్తి ఒక సమాజాన్ని ఎలా మార్చివేయగలదో తెలుసుకోవాలంటే ఏపీలో 70 లక్షల మంది మహిళలు 6,52,440 స్వయం సహాయక బృందాలను ఏర్పర్చి నిర్వహిస్తున్న వైనాన్ని మీరు స్వయంగా వచ్చి చూడాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి ‘ఆధ్యాత్మిక పెట్టుబడి’లాగా పేరొందిన ఈ మహిళా బృందాలు నిర్ణయాలను తీసుకోవడంలో ముందంజ వేస్తున్నాయి. నా పర్యటనల సందర్భంగా మహిళా శక్తి సామర్థ్యాలను చూసి నిజంగానే ఆశ్చర్యపోయాను.

రుణాలను పంపిణీ చేయడంలో, పంట దిగుబడి సరఫరాలను నిర్వహించడంలో, ఆహార ధాన్యల నిల్వల నిర్వహణ, ప్రాసెస్‌ చేయడంలో, తమకు తెలిసిన జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంలో వీరి ప్రతిభ అసాధారణం. ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ఏది ముందుకు తీసుకెళుతోందో, నూతన వ్యవసాయ శక్తి కేంద్రాలుగా మహిళలు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు స్వయం సహాయక బృందాల సమావేశాలకు తప్పకుండా హాజరై పరిశీలించాల్సి ఉంది.

హైదరాబాద్‌ లోని సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ కార్యనిర్వాహక డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీ రామాంజనేయులు ఈ పురుగుమందుల రహిత వ్యవసాయానికి సమర్థ ప్రచారకర్త. వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలపై అపార విశ్వాసం ఉన్న ఈయన, మహిళా స్వయం సహాయక బృందాల సమావేశాలకు నన్ను తీసుకెళ్లారు. కమ్యూనిటీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 38 ఎన్జీవోలలో ‘సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌’ తలమానికంలా ఉంది. ఈ సంస్థ వరంగల్‌ జిల్లాలోని ఒక గ్రామం మొత్తాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మరల్చడమే కాకుండా, ఈ గ్రామంలో వ్యవసాయ కో ఆపరేటివ్‌ను కూడా ఏర్పర్చింది. అప్పటి నుంచి మరో ఆరు సేంద్రియ వ్యవసాయ గ్రామాలు తయారయ్యాయి.

పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేయడంతోపాటు, రసాయనిక ఎరువులను తగ్గించి వాడటంతో పంటలకు పట్టే తెగుళ్ల కేసులు 86 శాతం పడిపోయాయి. అంతే కాకుండా ప్రతి రైతు కుటుంబం ఆరోగ్య ఖర్చులకు పెడుతున్న మొత్తంలో 50 శాతం దాకా తగ్గిపోయింది. వైద్య ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడం, దేశంలో రైతుల ఆత్మహత్యల పెరుగుదలకు కారణమైంది. ఈ నేపథ్యంలో రైతులను రుణాల విషవలయం నుంచి తప్పించడమే ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం లక్ష్యం. పైగా ప్రకృతి వ్యవసాయంతో రైతులకు వ్యవసాయ ఖర్చులు 68 శాతం తగ్గిపోయాయి, పంట దిగుబడుల్లో 88 శాతం పెరుగుదల నమోదైంది. వ్యవసాయ పంటల రకాలను బట్టి వ్యవసాయ రాబడి 8 నుంచి 111 శాతం వరకు పెరిగింది. 

ప్రకృతి వ్యవసాయంలో పంటలకు 55 శాతం నీళ్లు, విద్యుత్‌ మాత్రమే అవసరమవుతాయి. దీనివల్ల కాలుష్య ఉద్గారాలు 55 నుంచి 99 శాతం దాకా తగ్గిపోయే అవకాశముంది. నేల క్షయాన్ని నిరోధించడం ద్వారా ఏటా రూ. 12.3 లక్షల కోట్ల ఖర్చును ఆదా చేయవచ్చు కూడా! తమ భూముల్లో 43 శాతం దాకా వానపాములు పెరిగినాయని, 52 శాతం దాకా నేల గుల్ల అయిందని, పచ్చదనం 36 దాకా పెరిగిందని రైతులు చెప్పారు. పైగా తాము పండించిన పంటల రుచి ఎంతో మెరుగైందని 95 శాతం రైతులు చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. రసాయనాలు లేని ఆహారాన్ని 70 శాతం దాకా స్థానికంగా వాడుతున్నారు. దీంతో పీచుపదార్థం సమృద్ధిగా ఉన్న పోషకాహారం తీసుకోవడం బాగా పెరిగింది. 

ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రకృతి వ్యవసాయం కోసం ఒక విధానపరమైన చట్రాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ జనాభాను మొత్తంగా రసాయన రహిత సేద్యం వైపు మళ్లించేందుకు బడ్జెట్‌లో మద్దతు కూడా అవసరం. ప్రపంచంలో ప్రతి విజయవంతమైన మార్పు వెనుక ఒక శక్తిమంతమైన ఉత్ప్రేరకం ఉంటుంది.

ప్రస్తుతం ఆర్‌వైఎస్‌ఎస్‌కో చైర్మన్‌గా ఉంటున్న సీనియర్‌ రిటైర్డ్‌ ప్రభుత్వాధికారి విజయకుమార్‌ థిల్లామ్‌... ఏపీలో ప్రకృతి వ్యవసాయ పరంగా జరుగుతున్న అద్భుతమైన పరివర్తనకు ప్రేరణ. ఏపీలో స్మార్ట్‌ వ్యవసాయం పేరిట జరుగుతున్న గొప్ప పరివర్తనకు ఈయనే మూలకర్తగా ఉన్నారు. ఇది ఏపీకి గర్వకారణమే కాదు.. భవిష్యత్‌ సమాజ ఆహారానికి నిలకడైన మార్గం వైపుగా జరుగుతున్న మౌలిక పరివర్తన కూడా!

-దేవీందర్‌ శర్మ
వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు

ఈ–మెయిల్‌: hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement