భారతదేశంలో వ్యవసాయ వాణిజ్య కంపెనీలను పైకి తీసుకురావడానికి కమీషన్ ఏజెంట్లను నిందించే ప్రక్రియను పద్ధతి ప్రకారం కొనసాగిస్తున్నారు. వ్యవసాయరంగంలో మధ్య దళారీలను నియంత్రించాల్సిందే. కానీ, మాంస పరిశ్రమను బలోపేతం చేయాలని తలపెట్టిన ప్రయత్నం, కొన్ని కంపెనీల చేతుల్లో మార్కెట్ కేంద్రీకృతం అవడానికి కారణమయ్యిందని అమెరికన్ అనుభవం చెబుతోంది. మార్కెట్ చలన సూత్రాలు అమెరికా రైతులకు ప్రశాంతమైన జీవితాన్ని అందించడంలో మళ్లీ విఫలమయ్యాయి. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలనే కీలక సమస్యను గుర్తించడంలో విఫలమవుతున్నందునే అంతర్జాతీయంగా రైతులు నిరంతర నష్టాలు అనే పెను భారాన్ని మోయవలసి వస్తోంది.
అమెరికా వ్యవసాయ రంగంలో గత అర్ధ శతాబ్ధంపైగా ప్రవేశపెడుతూ వచ్చిన మార్కెట్ సంస్కరణల వైఫల్యం నుంచి మన విధాన నిర్ణేతలు, ఆర్థిక వేత్తలు ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోవడం లేదు. చివరకు ఇటీవలే వివా దాస్పదమైన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దుచేసిన తర్వాత కూడా, సరఫరా–డిమాండ్ మధ్య సమతౌల్యమే ధరలను నిర్ణయిస్తుందని ఇప్పటికీ వీరు పాత పాటే వల్లె వేస్తున్నారు. మార్కెట్ చలన సూత్రాలు అమెరికా రైతులకు ప్రశాంతమైన జీవితాన్ని అందిం చడంలో మరోసారి విఫలమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వాస్తవాన్ని చక్కగా గుర్తిం చారు. ఇటీవలే ఒక ప్రకటనలో యాభై ఏళ్లకు ముందు అమెరికా రైతులు మాంసాహార ఉత్పత్తులపై సంపాదించిన రాబడుల్లో సగం కూడా ఇప్పుడు వారికి లభించడం లేదని బైడెన్ చెప్పారు. ‘‘50 ఏళ్ల క్రితం అమెరికాలో రైతులు, బీఫ్ ఉత్పత్తిపై వెచ్చించిన ప్రతి డాలర్‌కి 60 సెంట్ల రాబడిని సంపాదించేవారు. ఈరోజు వారికి 39 సెంట్లు మాత్రమే దక్కుతోంది. అలాగే 50 ఏళ్ల క్రితం పందుల్ని పెంచిన రైతులు వెచ్చించిన ప్రతి డాలర్ ఖర్చుకు 48 నుంచి 50 సెంట్ల రాబడి సాధించేవారు. కానీ ఈరోజు వారి రాబడి 19 సెంట్లకు పడిపోయింది. అదే సమయంలో బడా కంపెనీలు మాత్రం భారీ లాభాలను సాధిస్తున్నాయి.’’ ఒక సంవత్సర కాలంలో బీఫ్ ధరలు 21 శాతం, పంది మాంసం ధర 17 శాతం, చికెన్ ధర 8 శాతం పెరిగినట్లు అమె రికా వ్యవసాయ విభాగం (యూఎస్‌డీఏ) అంచనా వేసిన సమయం లోనే రైతుల రాబడి ఇంతగా పడిపోయిందని గ్రహించాలి.
‘‘వ్యవసాయ వాణిజ్య సంస్థల లాభాలు పెరిగే కొద్దీ దుకాణాల్లో సరకుల ధరలు కూడా భారీగా పెరుగుతూ వచ్చాయి. కానీ మార్కె ట్లకు తమ ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతులకు దక్కాల్సిన ధరలు మాత్రం పడిపోయాయి’’ అంటూ అమెరికా అధ్యక్షుడు మరిన్ని వివ రాలు తెలిపారు. అమెరికా వ్యవసాయ శాఖ కార్యదర్శి టామ్ విల్‌సక్ దీనికి బలం చేకూరుస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఈ వేసవిలో, లోవా రాష్ట్రంలో ఒక రైతును కలిశాను. ‘ఒక పశువును 150 డాలర్లకు అమ్మి నేను నష్టపోయాను. కానీ దాని మాంసాన్ని ప్రాసెస్ చేసి అమ్మినవాడు మాత్రం ఒక్కో పశువుకు 1,800 డాలర్ల లాభం సంపాదించాడు’ అని ఆ రైతు వాపోయాడు.’’ ఒకవైపు రైతుల ఆదాయాన్ని హరిస్తూ, మరో వైపు లాభాలు ఆర్జిస్తున్న మాంసాహార ప్రాసెసింగ్ కంపెనీల లాభాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో ఈ ఒక్క ఉదాహరణ నుంచే ఊహించు కోవచ్చని టామ్ చెప్పారు.
భారతదేశంలో, రైతులను నిలువుదోపిడీ చేస్తున్నందుకు వ్యాపా రులను, లాభాలు దండుకుంటున్న కమిషన్ ఏజెంట్లను మనం కచ్చి తంగా నిందించాల్సిందే. అమెరికాలో 85 శాతం మాంస పరిశ్రమను నియంత్రిస్తున్న నాలుగు మాంసాహార దిగ్గజ సంస్థలను వాస్తవానికి భారీస్థాయి దళారీలనే చెప్పాలి. వీళ్లు సముద్ర సొరచేపలకు ఏమాత్రం తక్కువ కాదు. భారతదేశంలో వ్యవసాయ వాణిజ్య కంపెనీలను పైకి తీసుకురావడానికి కమీషన్ ఏజెంట్లపై నిందమోపే ప్రచారాన్ని పద్ధతి ప్రకారం చేస్తూ వస్తున్నారు. మధ్య దళారీలను నియంత్రించాల్సిందే. కానీ, మాంస పరిశ్రమను బలోపేతం చేయాలని తలపెట్టిన ప్రయత్నం, కొన్ని కంపెనీల చేతుల్లో మార్కెట్ కేంద్రీకృతం అవడానికి కారణమయ్యిందని అమెరికన్ అనుభవం చెబుతోంది. మాంస ఉత్ప త్తుల ధరలు పడిపోవడంతో తరాలుగా పశువులు, పందులు, కోళ్లను పెంచుతున్న రైతు కుటుంబాలు కుప్పగూలిపోయాయి.
వ్యవసాయంలో స్వేచ్ఛా మార్కెట్ల రాకతో జరిగిన విధ్వంసం అమెరికా వ్యవసాయరంగం కుప్పగూలిపోయిన తీరుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అదే క్రమంలో రైతులకు న్యాయమైన ధరలను కల్పించడంలో సరఫరా–డిమాండ్ సమతౌల్యం మరింత చెత్త ఫలితాలను తీసుకొచ్చింది. మొదట్లో ఈ పతనం వ్యవసాయ సరు కులు, పాల పరిశ్రమలో సంభవించగా ఇప్పుడు పశుమాంస వ్యవ సాయం దాని బారినపడింది. వ్యవసాయ దిగుబడుల నుంచి రిటైల్ మార్కెట్ దాకా సప్లయ్ చైన్ క్రమం మొత్తంగా బలపడుతూ వచ్చింది. నిజానికి ఈ కేంద్రీకరణ గుత్తాధిపత్యానికి, బలప్రదర్శనకు దారి తీసింది. వ్యవసాయ వాణిజ్య కంపెనీలు, సిండికేట్‌గా ఏర్పడిన క్రమం అనేది అటు వ్యవసాయ ఉత్పత్తిదారులనూ, ఇటు వినియోగ దారులనూ నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేయడంతో ముగిసింది. తమ రక్త మాంసాలను బహుళజాతి కార్పొరేషన్లు పీల్చేస్తుండటానికి వ్యతిరే కంగా అమెరికా జాతీయ రైతుల యూనియన్ దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ గుత్తాధి పత్యాన్ని బద్దలు చేసి రైతులకు న్యాయం చేయడం, యాంటీ–ట్రస్ట్ చట్టాలను కఠినంగా అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం రైతుల డిమాండ్ల పట్ల స్పందించింది. ధరలను భారీగా పెంచేలా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న కొన్ని వ్యవసాయ వాణిజ్య దిగ్గజ సంస్థలపై వేటు వేయాలని దేశాధ్యక్షుడు బైడెన్ పిలుపునిచ్చారు. పరిశ్రమలోని దిగ్గజాలతో పోటీ పడేందుకు చిన్నతరహా మాంసాహార ప్రాసెసింగ్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులను ప్రభుత్వం ఆమోదించింది. ఇది సమగ్ర పరి ష్కారం కానప్పటికీ, ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇరువు రిపై తీవ్ర ప్రభావం చూపుతున్న కార్పొరేట్ గుత్తసంస్థల విధ్వంసాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రభుత్వ చర్య తోడ్పడింది. వ్యవసాయ సరు కులు, పశుసంపదను ఉత్పత్తి చేసే రైతులకు మద్దతు ధర కల్పించడమే ఉత్తమమార్గం. భారతీయ రైతులు కూడా కనీస మద్దతు ధరకు చట్ట బద్ధతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మద్దతు ధరకు దిగువన ఎలాంటి వ్యాపార లావాదేవీలూ సాగవద్దన్నదే రైతుల డిమాండ్. యూరప్‌లో కూడా తమను వెంటాడుతున్న వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడేయడానికి న్యాయమైన ధరలకు హామీ కల్పించాలని రైతులు పదేపదే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ రంగ ఆదాయాలు పడి పోతుం డటమే... ప్రపంచ వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం. వ్యవ సాయ సంక్షోభం, పరిష్కారాలపై కెనడా జాతీయ రైతుల యూనియన్ 2005లో ఒక నివేదికను సమర్పించింది. గత 20 ఏళ్లుగా వ్యవసాయ ఆదాయాల్లో కనీవినీ ఎరుగని సంక్షోభానికి కారణాలను ఈ నివేదిక వివరించింది. 1985, 2005 మధ్య వ్యవసాయ ఆదాయాలు తిరోగ మన ధోరణిలో కొనసాగాయి. గత 20 ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత వ్యవసాయ పంటల ధరలు స్తబ్దతలో ఉండిపోయిన వైనాన్ని అంక్టాడ్ (యూఎన్‌సీటీఏడీ) కూడా స్పష్టంగా పేర్కొంది. 1930లలో మహా మాంద్య సంవత్సరాల్లో కంటే 2005లో రైతుల పంటలు మరింతగా పతనమయ్యాయని కెనడియన్ ఎన్‌ఎఫ్‌యు పేర్కొంది. ప్రపంచం ఆర్థికాభివృద్ధి దిశలో పయనిస్తున్న, స్టాక్ మార్కెట్ చెలరేగుతున్న సమయంలో రైతు రాబడులు ఇంతగా పతనం చెందడం గమనార్హమని ఎన్‌ఎఫ్‌యూ చెప్పింది. ఈ సంక్షోభ నివారణకు అది చేసిన 16 ప్లాన్ ప్యాకేజీలో రైతుకు మద్దతు ధర అనేది తొలి స్థానంలో నిలబడింది.
రైతులు తమ పంటలకు పెడుతున్న పెట్టుబడుల్లో 95 శాతానికి హామీ ఇచ్చేలా వ్యవసాయ ఆదాయ మద్దతు కార్యక్రమాన్ని అమలు చేయాలని ఎన్‌ఎఫ్‌యూ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే శ్రమశక్తి, యాజమాన్య నిర్వహణ, పెట్టుబడులకు కూడా న్యాయమైన రాబడిని కల్పించాలని కోరింది. కానీ అమెరికా లాగే కెనడా ప్రభుత్వం కూడా మద్దతు ధరపై రైతుల చట్టబద్ధమైన డిమాండును విస్మరించింది. రైతులు కనీసంగా జీవించడానికి అనువైన ఆదాయం వారికి కల్పిం చడం అత్యవసరం అవుతున్న సమయంలో ప్రపంచం మొత్తంగా కేంద్రస్థానంలో ఉంటున్న బలమైన ఆర్థిక చింతన రైతుల ప్రాణాధార సమస్యను గుర్తించడంలో విఫలమవుతోంది. దీని ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా రైతులు నిరంతర నష్టాలతో ఆహార ఉత్పత్తి చేయడం అనే పెను భారాన్ని మోయవలసి వస్తోంది.
వ్యాసకర్త: దేవీందర్ శర్మ
ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment