Bethamcherla: Radhaswami Nagari People special Natural Spirituality Life - Sakshi
Sakshi News home page

టీవీ చూడరు, మద్యం, మాంసం ముట్టరు.. ప్రత్యేక జీ‘వనం’ 

Published Fri, Nov 12 2021 8:27 AM | Last Updated on Fri, Nov 12 2021 10:23 AM

Radhaswami Nagari People special Natural Spirituality Life At Bethamcherla In AP - Sakshi

అందరూ కలిసి వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తూ

భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో వారంతా సంఘటితమయ్యారు. యాంత్రిక జీవనాన్ని వీడి ప్రకృతి వైపు అడుగులు వేశారు. పలువురికి స్ఫూర్తి కలిగేలా ప్రత్యేక జీవనం గడుపుతున్నారు. ఉరుకులపరుగుల మనుషుల మధ్య కాకుండా ఆహ్లాదకర వాతావరణంలో నివాసముంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే బేతంచెర్ల పట్టణానికి కిలో మీటరు దూరంలో కొలుములపల్లె రహదారిలోని రాధాస్వామి నగరిని సందర్శించాల్సిందే. 

బేతంచెర్ల: ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఇరుగుపొరుగు అనేది కనుమరుగవుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేదు.. అంతటా ఇదే పరిస్థితి. ఎవరి జీవితం వారిది అన్నట్లుగా మారుతోంది. ఆత్మీయతలు, ఆప్యాయతలు మసకబారుతున్నాయి. బేతంచెర్లలోని రాధాస్వామి నగరి ప్రజలు వీటికి అతీతం. అందరిదీ ఒకే మాట. ఒకే బాట. వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నా.. పర్యావరణ రక్షణ, ఆరోగ్య సంరక్షణకు రాధాస్వామి ధార్మిక సంస్థ వైపు అడుగులు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పట్టణానికి చెందిన ఈ సంస్థ ప్రస్తుతం 8వ గురువు పరమ గురువు ప్రేమ్‌శరన్‌ సత్సంగి సాహెబ్‌ వారి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే పలు కాలనీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, ఆసుపత్రులు అనుబంధంగా కొనసాగుతున్నాయి.


                         చిరు తిండ్లను తయారు చేస్తున్న మహిళలు

ఈ క్రమంలో బేతంచెర్ల పట్టణానికి చెందిన ప్రేమ స్వరూప్‌ అధ్యక్షతన 14 కుటుంబాలు ప్రత్యేక జీవనం అలవర్చుకున్నాయి. వీరికి స్ఫూర్తిగా రామళ్లకోట, కొలుములపల్లె, ముద్దవరం ప్రాంతాల్లో మరో 20 కుటుంబాలు వీరి బాటలో పయనిస్తున్నాయి. కర్నూలు నగరంలో కూడా దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. ఈ ధార్మిక సంస్థలో సభ్యులుగా ఉన్నవారంతా గురువు ఆదేశాల ప్రకారం కొన్ని నియమాలు తప్పక పాటిస్తున్నారు.

పర్యావరణానికి హాని కలిగించే ఏసీలు వినియోగించడం లేదు. వ్యవసాయంలో రసాయన, పురుగు మందులకు దూరంగా ఉంటున్నారు. అలాగే మద్యం, మాంసం తీసుకోవడం లేదు. ఉదయం వ్యాయామం తప్పక చేస్తున్నారు. ఏ ఇంట్లో కూడా టీవీలు కనిపించవు. ప్రతి ఒక్కరూ తెల్లవారు జామున 3.30 గంటల నుంచి ప్రార్థన, సత్సంగంతో వారి దిన చర్య ప్రారంభమవుతోంది. కష్టపడి పనిచేస్తూ జీవన విధానం కొనసాగిస్తూ, సేవా మార్గంలో నడవాలనేది వారి అభిమతం. 

సమష్టిగా వ్యవ‘సాయం’ 
బేతంచెర్ల రాధాస్వామి కాలనీలో నివాసం ఉంటున్న దాదాపు 100 మంది పెద్దలు, పిల్లలు, వృద్ధులు  సామూహికంగా వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఎకరాల్లో సపోట, జామ, సీతాఫలం పండ్ల మొక్కలతో పాటు రోజు వినియోగించుకునేందుకు ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు.

ఉదయం, సాయంత్రం వ్యవసాయ పనులు చేస్తారు. ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అలాగే నాణ్యమైన వస్తువులు (కాటన్‌ దుస్తులు, దోమ తెరలు, దుప్పట్లు, పాదరక్షలు) తయారు చేసి సేవాదృక్పథంతో ఏడాదికోసారి లాభాపేక్ష లేకుండా విక్రయిస్తారు. స్వయం ఉపాధిని పెంపొదించుకునేందుకు మహిళలు ఖాళీ సమయంలో చిరుతిండ్లను తయారు చేసి విక్రయిస్తున్నారు.     
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement