ఊరికి ముందే 101 గుడులు, 101 బావులు | Gulladurti Temples Spirituality Kurnool District | Sakshi
Sakshi News home page

ఊరికి ముందే 101 గుడులు, 101 బావులు

Published Tue, Oct 12 2021 9:15 PM | Last Updated on Tue, Oct 12 2021 9:35 PM

Gulladurti Temples Spirituality Kurnool District - Sakshi

సాక్షి, కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ రహదారిలో పట్టణానికి పది కిమీ దూరంలో ఉన్న గుళ్లదూర్తి గుడులకు నిలయంగా మారింది. లక్కుమాంపురి పేరుతో వెలసిన గ్రామం కాలక్రమేణ బ్రాహ్మణ అగ్రహారం(చిన్నకాశీ), గుడులదూర్తిగా పిలువబడుతూ ప్రస్తుతం గుళ్లదూర్తిగా పేరుగాంచింది. గ్రామం ఉద్భవించేనాటికి గ్రామంలో 101 గుడులు, 101 బావులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.  గ్రామంలో  వెలసిన ఆలయాలు, పీర్లచావిళ్లు, చర్చిలు మత సామరస్యానికి ప్రతీకగా అద్దం పడుతున్నాయి.  కొన్ని ఆలయాలు, బావులు  కాలగమనంలో కలిసి పోగా ఇంకా అనేక పురాతన ఆలయాలు, నూతనంగా వెలసిన ఆలయాలతో గ్రామం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.



చిన్నమ్మ ఆశ్రమంలో దేవుళ్ల కొలువు
1927వ సంవత్సరంలో భర్తను కోల్పోయిన చిన్నమ్మ అనే మహిళ గ్రామానికి చెందిన వెంకటమ్మ చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతోపాటు కుందూనది ఒడ్డున బండలపై మొలచిన సీతారాముల ప్రతిమలకు పూజలు చేస్తూ భక్తురాలిగా మారింది. పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఈమెకు భక్తులుగా మారటంతో కుందూనది ఒడ్డున చిన్నమ్మ ఆశ్రమాన్ని నెలకొల్పింది. ఈ ఆశ్రమంలో 1948వ సంవత్సరం కేరళకు చెందిన వ్యాస ఆశ్రమ పీఠాధిపతి మళయాలస్వామి ఉప సభ నిర్వహించారు. ఈ సభతో ఆశ్రమ పేరు ప్రతిష్టలు దేశ నలుమూలలా వ్యాపించాయి. 1956వ సంవత్సరంలో చిన్నమ్మ మృతి చెందటంతో ప్రతి ఏటా ఆశ్రమ వార్షికోత్సవం, చిన్నమ్మ ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ ఆశ్రమంలో సీతారాముల ఆలయంతోపాటు కృష్ణ మందిరం, వీరబ్రహ్మేంద్ర ఆలయం, దక్షిణామూర్తి, చిన్నమ్మ మందిరం  ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజుల్లో నిర్వహించే వార్షికోత్సవం రాష్ట్రంలోని వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలకు చెందిన ఉపన్యాసకులు హాజరవుతుండటం విశేషం. శ్రీరామ నవమి పండుగను పురష్కరించుకుని సీతారాముల కల్యాణం, మూడు రోజులపాటు తిరుణాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో నిత్యం శ్రీరామతీర్థ సత్సంగం, ఆధ్యాత్మిక విచారణ, ధాన్యం, ప్రతి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ.



మత సామరస్యానికి ప్రతీక
గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా దస్తగిరిస్వామి, మౌలాలి స్వామి దర్గాలు వెలిశాయి. పూర్వీకుల కథనం మేరకు  కోడి కూత, రోకలిపోటు వినిపించని సమయంలో గ్రామానికి చెందిన మాబుసాని అనే భక్తుడు చేతిలో నిప్పులు పోసుకుని వెండిని కరిగించగా ఆచారి అనే  మరో భక్తుడు  దస్తగిరి స్వామి పీరును తయారు చేశారు. అనేక మహిమలు ఉన్న స్వామికి ప్రతిఏటా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకునేవారు. స్వామి మహిమలు తెలుసుకున్న  ఒక దొంగల ముఠా పీరును దొంగలించి నొస్సం కొండల్లో వెండిని కరిగించేందుకు ప్రయత్నించగా ఆ దొంగల  కళ్లు పోవడంతో  పీరును అక్కడే వదిలేసి పారిపోరినట్లు చరిత్ర.

నొస్సం కొండల్లో పీరు ఉందని వెంటనే వెళ్లి తీసుకుని వచ్చి దర్గాలో ప్రతిష్టించాలని దస్తగిరిస్వామి మాబుసానికి కలలో కనిపించి చెప్పగా  భక్తులు అక్కడికి చేరుకోగా  స్వామి కలలో చెప్పిన మాటలు నిజం కావడంతో పీరును తీసుకొచ్చి  తిరిగి  ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మొహర్రం పండుగను పురష్కరించుకుని  నిర్వహించే జియారత్‌ వేడుకలకు  ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామి మహిమలకు ఆకర్షితులైన అప్పటి భక్తులు  విరాళాలు సేకరించి స్వామి వారికి ప్రత్యేకంగా దర్గా నిర్మించారు. అనంతరం కొంత కాలానికి మౌలాలి స్వామి పీరును తయారు చేసి మాబుసాని వంశస్తుల ఆధ్వర్యంలో జార్తలను నిర్వహిస్తున్నారు. 



జంబుకేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర
గ్రామంలో వెలసిన జంబుకేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. కలియుగం ఆరంభంలో పరిచిత మహారాజు( అభిమన్యుడి కుమారుడు) జన్మేజయుడు తన తండ్రి చేసిన  సర్పయాగ దోశ నివారణకు దేశవ్యాప్తంగా 101 బ్రాహ్మణ గడపలు కలిగిన గ్రామాల్లో పశ్చిమాభిముఖంగా ఒకే రోజు శివాలయాలు ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా గుళ్లదూర్తిలో జంబుకేశ్వరస్వామి ఆలయం నిర్మితమైంది. ఆలయం నిర్మించి వంద సంవత్సరాలకు పైబడటంతో పదేళ్లక్రితం ఆలయ జీర్ణోద్దరణ పచేలు చేపట్టారు. ఆలయంలో ప్రతి ఏకాదశి రోజున పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 



గ్రామంలో వెలసిన మరిన్ని  ఆలయాలు
గ్రామంలో పురాతన ఆలయాలతోపాటు మరిన్ని ఆలయాలు వెలశాయి. మూడు ఆంజనేయస్వామి, మూడు శివాలయాలు, సాయిబాబాగుడి, విఘ్నేశ్వర, వీరభద్ర, చెన్నకేశవ, లక్ష్మి నరసింహ ఆలయాలు, కర్రెమ్మ, అంకాలమ్మ, లింగమయ్య, సుంకులమ్మ,  పేరంటాలమ్మ, పెద్దమ్మ గుడులున్నాయి. 2007వ సంవత్సరంలో దాతల సహకారంతోగ్రామ బస్టాఫ్‌ సమీపంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ప్రతి రోజు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, గురుపౌర్ణమి, శ్రీరామ నవమి, దత్తజయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చెన్నకేశవ(చెన్నుడు) ఆలయంలో దళితులు పూజారులుగా వ్యవహరిస్తూ పూజలు చేస్తున్నారు. గ్రామం ఆవిర్భావం తర్వాత కొన్ని ఆలయాలు కనుమరుగు కాగా గ్రామంలో ఇప్పటికి 30 ఆలయాల్లో దేవుళ్లు భక్తులచే పూజలందుకుంటూ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement