ఆ ముగ్గురు.. మూడు రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌  | Man Arrested For Burglary In 22 Temples At Kurnool | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు.. మూడు రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌ 

Published Sun, Oct 18 2020 12:42 PM | Last Updated on Sun, Oct 18 2020 12:48 PM

Man Arrested For Burglary In 22 Temples At Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : జాతీయ రహదారి  పక్కన తాళం వేసి ఉన్న ఆలయాన్ని ఎంచుకుని ముందుగా రెక్కీ నిర్వహిస్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా తనతో పాటు భార్యను వెంట తీసుకెళ్లి వ్యూహం పన్నుతాడు. బయట భార్యను కాపలాగా పెట్టి అవకాశం చూసుకుని వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్ల సాయంతో తాళాలను బద్దలుకొట్టి గుడిలో చోరీకి తెగబడతాడు. అందినంత దోచుకుని వచ్చిన దారిలోనే తాపీగా వెళ్లిపోతాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ఆలయాలను కొల్లగొట్టిన ఎరుకల నల్లబోతుల నాగప్ప ఎట్టకేలకు ఆళ్లగడ్డ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

నాగప్పతో పాటు అతని భార్య లావణ్య, సహజీవనం చేస్తున్న ప్రమీలను మహానంది మండలం గాజులపల్లి బుచ్చమ్మతోపు వద్ద అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ వివరాలను అంతకు ముందు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ ఫక్కీరప్ప విలేకరులకు వెల్లడించారు. పదకొండు రోజుల క్రితం శిరివెళ్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని వెంకటాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, ఎర్రగుంట్ల గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం, ఆళ్లగడ్డ రూరల్‌ పీఎస్‌ పరిధిలోని బత్తులూరు చెన్నకేశవస్వామి ఆలయాల్లో ఒకే రాత్రి చోరీలు జరిగాయి.  (నెల్లూరు జిల్లాలో సంచలన హత్యలు)

గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగులగొట్టి హుండీల్లోని డబ్బు, విగ్రహాలపై ఉన్న వెండి నగలు దొంగలించినట్లు నిర్వాహకులు ఆయా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలాలను పోలీసులు పరిశీలించి మూడు చోరీలు ఒకేలా జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇంతకీ ఆ దొంగ ఎవరన్న కోణంలో ముందుగా వేలిముద్రలను సేకరించారు. వాటిని పాత నేరస్తుల వేలిముద్రలతో సరిపోల్చగా ఎరుకల నల్లబోతుల నాగప్పవిగా తేలింది.  

దొరికాడు ఇలా.. 
చోరీకి గురైన ఆలయాలు జాతీయ రహదారికి సమీపంలోనే ఉండటంతో నిందితుడు ఆ మార్గం గుండా వెళ్లి ఉండవచ్చని భావించి శిరివెళ్ల నుంచి తాడిపత్రి వరకు ఉన్న చెక్‌పోస్టు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. నాగప్ప తన భార్యతో ద్విచక్ర వాహనంపై అదేరోజు రాత్రి(ఈ నెల 6న) తాడిపత్రికి వెళ్లినట్లు గుర్తించారు. ఆలయం వద్దనున్న సీసీ కెమెరాల ఫుటేజీలతో వాటిని సరిపోల్చి చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. స్వగ్రామం గాజులపల్లెలోని బుచ్చమ్మతోపు వద్ద వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.   (ఎమ్మెల్యే గారు మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా)

20 ఏళ్లుగా చోరీలు.. 
అనంతపురం జిల్లా పామిడి మండలం ఖాజీపేట గ్రామానికి చెందిన ఎరుకల నల్లబోతుల నాగప్ప అలియాస్‌ నాగరాజు 20 ఏళ్ల క్రితం గాజులపల్లె గ్రామానికి చెందిన లావణ్యను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. కుటుంబ పోషణ నిమిత్తం మొదట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి పలుమార్లు జైలు జీవితం గడిపాడు. అయినప్పటికీ ఇతనిలో మార్పు రాలేదు. బెయిల్‌పై బయటికొచ్చి రెండేళ్లుగా భార్య లావణ్యతో కలిసి కర్నూలు, అనంతపురం, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో మొత్తం 22 ఆలయాల్లో విగ్రహాలపై ఉన్న వెండి, బంగారు ఆభరణాలు, హుండీల్లోని డబ్బులను కొల్లగొట్టాడు. భార్యతో పాటు సహజీవనం చేస్తున్న ప్రమీలతో కలిసి ఈ ఏడాదిలోనే 23 దొంగతనాలు చేసినట్లు పోలీసు విచారణలో బయటపడింది.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా నాగప్ప దంపతులు పోలీసు రికార్డులకెక్కారు. ఇతర రాష్ట్రాల్లో వీరిపై సుమారు 22 కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. దర్యాప్తును వేగవంతం చేసి నిందితుల నుంచి రూ.12.30 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును రికవరీ చేసినందుకు ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, శిరివెళ్ల సీఐ చంద్రబాబు, ఎస్‌ఐలు సూర్యమౌళి, నిరంజన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వరప్రసాద్, మారుతి తదితరులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కొమ్మిప్రతాప్‌ శివకిశోర్, స్పెషల్‌ బ్రాంచ్, ఫింగర్‌ప్రింట్స్‌ డీఎస్పీలు వెంకటాద్రి, శివారెడ్డి పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement