koilkuntla
-
హమ్మయ్య.. దాహం తీరింది!
మండుతున్న ఎండలకు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. గ్రీష్మతాపంతో ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరడం లేదు. కోవెలకుంట్ల పట్టణంలో ఓ వానరం దాహం తీర్చుకునేందుకు పడరాని పాట్లు పడింది. గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ పూలవ్యాపారి దాహం తీర్చుకునేందుకు వాటర్ బాటిల్ తోపుడు బండిపై ఉంచుకున్నాడు. గమనించిన వానరం ఆ బాటిల్‌ను ఎత్తుకెళ్లింది. బాటిల్‌కు మూత ఉండటంతో పలుమార్లు ప్రయత్నించి.. చివరకు అతికష్టం మీద మూత తొలగించి బాటిల్లోని నీరు తాగి మెల్లగా జారుకుంది. – కోవెలకుంట్ల -
ఊరికి ముందే 101 గుడులు, 101 బావులు
సాక్షి, కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో పట్టణానికి పది కిమీ దూరంలో ఉన్న గుళ్లదూర్తి గుడులకు నిలయంగా మారింది. లక్కుమాంపురి పేరుతో వెలసిన గ్రామం కాలక్రమేణ బ్రాహ్మణ అగ్రహారం(చిన్నకాశీ), గుడులదూర్తిగా పిలువబడుతూ ప్రస్తుతం గుళ్లదూర్తిగా పేరుగాంచింది. గ్రామం ఉద్భవించేనాటికి గ్రామంలో 101 గుడులు, 101 బావులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. గ్రామంలో వెలసిన ఆలయాలు, పీర్లచావిళ్లు, చర్చిలు మత సామరస్యానికి ప్రతీకగా అద్దం పడుతున్నాయి. కొన్ని ఆలయాలు, బావులు కాలగమనంలో కలిసి పోగా ఇంకా అనేక పురాతన ఆలయాలు, నూతనంగా వెలసిన ఆలయాలతో గ్రామం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. చిన్నమ్మ ఆశ్రమంలో దేవుళ్ల కొలువు 1927వ సంవత్సరంలో భర్తను కోల్పోయిన చిన్నమ్మ అనే మహిళ గ్రామానికి చెందిన వెంకటమ్మ చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతోపాటు కుందూనది ఒడ్డున బండలపై మొలచిన సీతారాముల ప్రతిమలకు పూజలు చేస్తూ భక్తురాలిగా మారింది. పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఈమెకు భక్తులుగా మారటంతో కుందూనది ఒడ్డున చిన్నమ్మ ఆశ్రమాన్ని నెలకొల్పింది. ఈ ఆశ్రమంలో 1948వ సంవత్సరం కేరళకు చెందిన వ్యాస ఆశ్రమ పీఠాధిపతి మళయాలస్వామి ఉప సభ నిర్వహించారు. ఈ సభతో ఆశ్రమ పేరు ప్రతిష్టలు దేశ నలుమూలలా వ్యాపించాయి. 1956వ సంవత్సరంలో చిన్నమ్మ మృతి చెందటంతో ప్రతి ఏటా ఆశ్రమ వార్షికోత్సవం, చిన్నమ్మ ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో సీతారాముల ఆలయంతోపాటు కృష్ణ మందిరం, వీరబ్రహ్మేంద్ర ఆలయం, దక్షిణామూర్తి, చిన్నమ్మ మందిరం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజుల్లో నిర్వహించే వార్షికోత్సవం రాష్ట్రంలోని వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలకు చెందిన ఉపన్యాసకులు హాజరవుతుండటం విశేషం. శ్రీరామ నవమి పండుగను పురష్కరించుకుని సీతారాముల కల్యాణం, మూడు రోజులపాటు తిరుణాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో నిత్యం శ్రీరామతీర్థ సత్సంగం, ఆధ్యాత్మిక విచారణ, ధాన్యం, ప్రతి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. మత సామరస్యానికి ప్రతీక గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా దస్తగిరిస్వామి, మౌలాలి స్వామి దర్గాలు వెలిశాయి. పూర్వీకుల కథనం మేరకు కోడి కూత, రోకలిపోటు వినిపించని సమయంలో గ్రామానికి చెందిన మాబుసాని అనే భక్తుడు చేతిలో నిప్పులు పోసుకుని వెండిని కరిగించగా ఆచారి అనే మరో భక్తుడు దస్తగిరి స్వామి పీరును తయారు చేశారు. అనేక మహిమలు ఉన్న స్వామికి ప్రతిఏటా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకునేవారు. స్వామి మహిమలు తెలుసుకున్న ఒక దొంగల ముఠా పీరును దొంగలించి నొస్సం కొండల్లో వెండిని కరిగించేందుకు ప్రయత్నించగా ఆ దొంగల కళ్లు పోవడంతో పీరును అక్కడే వదిలేసి పారిపోరినట్లు చరిత్ర. నొస్సం కొండల్లో పీరు ఉందని వెంటనే వెళ్లి తీసుకుని వచ్చి దర్గాలో ప్రతిష్టించాలని దస్తగిరిస్వామి మాబుసానికి కలలో కనిపించి చెప్పగా భక్తులు అక్కడికి చేరుకోగా స్వామి కలలో చెప్పిన మాటలు నిజం కావడంతో పీరును తీసుకొచ్చి తిరిగి ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మొహర్రం పండుగను పురష్కరించుకుని నిర్వహించే జియారత్ వేడుకలకు ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామి మహిమలకు ఆకర్షితులైన అప్పటి భక్తులు విరాళాలు సేకరించి స్వామి వారికి ప్రత్యేకంగా దర్గా నిర్మించారు. అనంతరం కొంత కాలానికి మౌలాలి స్వామి పీరును తయారు చేసి మాబుసాని వంశస్తుల ఆధ్వర్యంలో జార్తలను నిర్వహిస్తున్నారు. జంబుకేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర గ్రామంలో వెలసిన జంబుకేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. కలియుగం ఆరంభంలో పరిచిత మహారాజు( అభిమన్యుడి కుమారుడు) జన్మేజయుడు తన తండ్రి చేసిన సర్పయాగ దోశ నివారణకు దేశవ్యాప్తంగా 101 బ్రాహ్మణ గడపలు కలిగిన గ్రామాల్లో పశ్చిమాభిముఖంగా ఒకే రోజు శివాలయాలు ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా గుళ్లదూర్తిలో జంబుకేశ్వరస్వామి ఆలయం నిర్మితమైంది. ఆలయం నిర్మించి వంద సంవత్సరాలకు పైబడటంతో పదేళ్లక్రితం ఆలయ జీర్ణోద్దరణ పచేలు చేపట్టారు. ఆలయంలో ప్రతి ఏకాదశి రోజున పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో వెలసిన మరిన్ని ఆలయాలు గ్రామంలో పురాతన ఆలయాలతోపాటు మరిన్ని ఆలయాలు వెలశాయి. మూడు ఆంజనేయస్వామి, మూడు శివాలయాలు, సాయిబాబాగుడి, విఘ్నేశ్వర, వీరభద్ర, చెన్నకేశవ, లక్ష్మి నరసింహ ఆలయాలు, కర్రెమ్మ, అంకాలమ్మ, లింగమయ్య, సుంకులమ్మ, పేరంటాలమ్మ, పెద్దమ్మ గుడులున్నాయి. 2007వ సంవత్సరంలో దాతల సహకారంతోగ్రామ బస్టాఫ్ సమీపంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ప్రతి రోజు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, గురుపౌర్ణమి, శ్రీరామ నవమి, దత్తజయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చెన్నకేశవ(చెన్నుడు) ఆలయంలో దళితులు పూజారులుగా వ్యవహరిస్తూ పూజలు చేస్తున్నారు. గ్రామం ఆవిర్భావం తర్వాత కొన్ని ఆలయాలు కనుమరుగు కాగా గ్రామంలో ఇప్పటికి 30 ఆలయాల్లో దేవుళ్లు భక్తులచే పూజలందుకుంటూ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. -
దేశస్థాయిలో రేనాటి ఖ్యాతి
కోవెలకుంట్ల(కర్నూలు): కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన ఇద్దరు నేతలు రేనాటి ఖ్యాతిని రాష్ట్ర, దేశస్థాయిలో చాటారు. సంజామలకు చెందిన దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య ఏడు పర్యాయాలు ఎంపీగా, కర్నాటక, బీహార్ రాష్ట్రాల గవర్నర్‌గా, కేంద్రహోం సహాయశాఖ మంత్రి దేశానికి సేవలందించారు. కోవెలకుంట్లకు చెందిన దివంగత బీవీ సుబ్బారెడ్డి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్‌గా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలరించారు. సంజామలకు చెందిన దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య 1921 సంవత్సరం జూన్16వ తేదీన జన్మించాడు. 1942వ సంవత్సరంలో సంజామల సర్పంచ్‌గా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1957నుంచి 1984 సంవత్సరాల మధ్యకాలంలో ఏడు పర్యాయాలు నంద్యాల ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రహోం సహాయక మంత్రిగా, 1984 నుంచి 1986వరకు బీహార్ రాష్ట్ర గవర్నర్‌గా, 1987నుంచి 1990 వరకు కర్నాటక గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన బీవీ కోవెలకుంట్లకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత బీవీ సుబ్బారెడ్డి 1903 జులై 4వ తేదీన జన్మించారు. లా కోర్సుచేసిన బీవీ స్వాతంత్య్ర సమరోద్యమమంలో సత్యగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని దాదాపు మూడున్నర సంవత్సరాలపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించారు. 1955లో కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోదిగి ఎమ్మెల్యేగా, అనంతరం 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హ్యాట్రిక్ సాధించటమేకాక ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1962వ సంవత్సరం నుంచి 1970 వరకు స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం 1971వ సంవత్సరంలో ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు.1974 జూన్ 7వ తేదీన మృతి చెందారు. విద్యుత్, రోడ్ల నిర్మాణాలకు ప్రముఖ ప్రాముఖ్యత ఇచ్చి కోవెలకుంట్ల ఖ్యాతిని రాష్ట్రం, దేశస్థాయిలో చాటారు. -
సబ్సిడీ శనగల దొంగ దొరికాడు
కోవెలకుంట్ల: గోదాము నుంచి సబ్సిడీ శనగ ప్యాకెట్లను దొంగలించిఽఽన వ్యక్తిని సంజామల పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం సీఐ శ్రీనివాసరెడ్డి నిందితుడు వివరాలను మీడియాకు వివరించారు. సంజామల మండలానికి మంజూరైన సబ్సిడీ శనగ విత్తన ప్యాకెట్లను గ్రామంలోని కో ఆపరేటీవ్ సహకార సంఘ గోదాములో నిల్వ ఉంచారు. గత నెల3వ తేదీ నుంచి అదే నెల 22వ తేదీ వరకు రైతులకు సబ్సిడీ శనగలను పంపిణీ చేశారు. విత్తన పంపిణీ సమయంలో రైతులకు శనగ ప్యాకెట్లను అందజేసేందుకు 20 రోజులపాటు గోదాములో గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య హమాలీగా చేరాడు. హమాలీగా ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా తోటి హమాలీలు, గోదాము సిబ్బంది, రైతులు పసిగట్టకుండా గోదాములోని కొన్ని శనగ ప్యాకెట్లను పక్కన దాచిపెట్టి రాత్రి సమయాల్లో ఇంటికి తెచ్చుకునేవాడు. విత్తన పంపిణీ ప్రక్రియ ముగిశాక శనగలకు సంబంధించి రికార్డులు, స్టాక్‌ను పరిశీలించగా 44 శనగ ప్యాకెట్లకు లెక్క తేలకపోవడంతో కో ఆపరేటీవ్ సహకార సంఘం సీఈఓ రవీంద్ర గుప్త హమాలీలను గోదాములకు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ విచారణకు వెంకటసుబ్బయ్య హాజరు కాకపోవడంతో అనుమానం వచ్చి గత నెల 31వ తేదీన సంజామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విజయభాస్కర్ విచారణకు హాజరుకాని హమాలీ వెంకటసుబ్బయ్య కదలికలపై నిఘా వేశారు. గోదాములో దొంగలించిన శనగ ప్యాకెట్లను హమాలీ ఇదే మండలంలోని కానాల గ్రామానికి చెందిన ఓ రైతుకు రూ. లక్షకు విక్రయించాడు. పోలీస్‌స్టేషన్‌లో హమాలీపై కేసు నమోదు కావడంతో భయాందోళనకు గురైన రైతు శనగలను వెనక్కు తీసుకోవాలని లేకపోతే పోలీసులకు చెబుతానని హమాలీపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో వెంకటసుబ్బయ్య సొంత ఆటో వేసుకుని రైతు వద్ద ఉన్న శనగ ప్యాకెట్లను వెనక్కు తీసుకుని కోవెలకుంట్లలో విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 44 ప్యాకెట్ల శనగలు, ఆటోను సీజ్‌చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
-గుంటూరు జిల్లాలో ఘటన –మృతులు కోవెలకుంట్ల వాసులు కోవెలకుంట్ల: గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. పట్టణంలోని శ్రీవిద్యహైస్కూల్ అధినేత ధాయేపులే అశ్వర్థరావు(65), సంజామలకు చెందిన కారు డ్రైవర్ ప్రతాప్(35) అక్కడికక్కడే మృతి చెందగా అశ్వర్థరావు భార్య, నాగలక్ష్మీబాయి తీవ్రంగా గాయపడ్డారు. సంజామలకు చెందిన అశ్వర్థరావు 1983వ సంవత్సరం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టు సాధించి శ్రీశైలం ప్రాజెక్టులో గణితం ఉపాధ్యాయుడిగా చేరారు. అనంతరం2000వ సంవత్సరంలో ఎంఈఓగా పదోన్నతి పొంది దొర్నిపాడు మండలంలో ఐదేళ్ల పాటు ఎంఈఓగా పనిచేసి 2010 జూన్ నెలలో పదవీ విరమణపొందారు. 20 సంవత్సరాల నుంచి పట్టణంలోని ఎస్‌ఎల్‌వీటీ సినిమా టాకీస్ వెనుక వైపు శ్రీవిద్యహైస్కూల్ నడుపుతున్నారు. ఈయనకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె హరిత సోనీ వివాహం చేసుకుని చెన్నైలో భర్త వద్ద ఉంటోంది. కుమారుడు సాయి చైతన్యకిషోర్ విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి ఏటా దసరా పండగకు కుమారుడు కుటుంబ సమేతంగా కోవెలకుంట్లకు వచ్చేవారు. ఈ ఏడాది పండుగకు ఇక్కడికి రాకపోవడంతో అశ్వర్థరావు దంపతులు నాలుగు రోజుల క్రితం కారులో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. పండుగ ముగించుకుని తిరుగు ప్రయాణంలో తిమ్మాపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని తిరిగి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొటింది. అశ్వర్థరావు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా నాగలక్ష్మీబాయికి రెండు కాళ్లు విరిగాయి. డ్రైవర్‌కు భార్య, రాములమ్మ, పదవ తరగతి చదువుతున్న వేణు, ఏడో తరగతి చదువుతున్న వినోద్ సంతానం. విషయం తెలిసిన వెంటనే అశ్వర్థరావు తమ్ముడు సుబ్బారావు హుటాహుటినా సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. శ్రీవిద్యస్కూల్ అధినేత మృతి వార్త తెలియడంతో కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. -
నమాజ్ చేస్తూనే..
కోవెలకుంట్ల: పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఇస్మాయిల్(60) అనే వ్యక్తి మంగళవారం గుండెపోటుతో మతి చెందాడు. బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ చేసుకునేందుకు ముదిగేడు చౌరస్తాలోని ఈద్గా వద్దకు వెళ్లి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి ముస్లింలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపు మతి చెందాడు. మతుడికి భార్య, ముగ్గురు కుమారులు సంతానం. పండుగ రోజున ఈద్గాకు వెళ్లిన ఇస్మాయిల్ మత్యువాత పడటంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నాటుసారా తాగి ఇద్దరి మృతి
కోయిలకుంట్ల (కర్నూలు) : బంధువుల ఇంట్లో దశ దినకర్మలకు వెళ్లిన ఇద్దరు యువకులు నాటుసారా పూటుగా తాగి మృతిచెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దినం(దశదినకర్మ) జరుగుతుండటంతో.. అక్కడికి వెళ్లిన చంద్రయ్య(27), దాసరిమద్ది(28) అనే ఇద్దరు యువకులు నాటుసారా తాగడంతో.. అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
30 మంది విద్యార్థినులకు అస్వస్థత
కోవెలకుంట్ల (కర్నూలు) : కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండల కేంద్రంలోని గురుకుల బాలికల వసతి గృహంలో విష జ్వరాలు ప్రబలి 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గుర్తించిన హాస్టల్ వార్డెన్ వైద్య అధికారులను సంప్రదించడంతో.. ఆదివారం వసతిగృహం ఆవరణలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేసి విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. -
తల్లిని నదిలో తోసేసిన ప్రబుద్ధుడు
కర్నూలు: కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని కుందూనదిలోకి తోసేశాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో ఆమె కుందూనదిలో పడిపోయింది. అనంతరం కొడుకు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికలు వెంటనే నదిలో నుంచి ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి... ప్రాధమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిని తన పేరిట రాయాలని గత కొంత కాలంగా కొడుకు.... కన్న తల్లిని వేధించసాగాడు. ఆ క్రమంలో తరచుగా ఇంట్లో గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు ఉదయం పని ఉంది రమ్మంటూ తనను బయటకు తీసుకువెళ్లాడని .... కుందూనది వద్దకు చేరుకోగానే ... ఒక్కసారిగా తనను నదిలోకి తోసేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. పోలీసులు పరారైన కోడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.