రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
Published Thu, Oct 13 2016 12:38 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
-గుంటూరు జిల్లాలో ఘటన
–మృతులు కోవెలకుంట్ల వాసులు
కోవెలకుంట్ల: గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. పట్టణంలోని శ్రీవిద్యహైస్కూల్ అధినేత ధాయేపులే అశ్వర్థరావు(65), సంజామలకు చెందిన కారు డ్రైవర్ ప్రతాప్(35) అక్కడికక్కడే మృతి చెందగా అశ్వర్థరావు భార్య, నాగలక్ష్మీబాయి తీవ్రంగా గాయపడ్డారు. సంజామలకు చెందిన అశ్వర్థరావు 1983వ సంవత్సరం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టు సాధించి శ్రీశైలం ప్రాజెక్టులో గణితం ఉపాధ్యాయుడిగా చేరారు. అనంతరం2000వ సంవత్సరంలో ఎంఈఓగా పదోన్నతి పొంది దొర్నిపాడు మండలంలో ఐదేళ్ల పాటు ఎంఈఓగా పనిచేసి 2010 జూన్ నెలలో పదవీ విరమణపొందారు. 20 సంవత్సరాల నుంచి పట్టణంలోని ఎస్‌ఎల్‌వీటీ సినిమా టాకీస్ వెనుక వైపు శ్రీవిద్యహైస్కూల్ నడుపుతున్నారు. ఈయనకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె హరిత సోనీ వివాహం చేసుకుని చెన్నైలో భర్త వద్ద ఉంటోంది. కుమారుడు సాయి చైతన్యకిషోర్ విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి ఏటా దసరా పండగకు కుమారుడు కుటుంబ సమేతంగా కోవెలకుంట్లకు వచ్చేవారు. ఈ ఏడాది పండుగకు ఇక్కడికి రాకపోవడంతో అశ్వర్థరావు దంపతులు నాలుగు రోజుల క్రితం కారులో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. పండుగ ముగించుకుని తిరుగు ప్రయాణంలో తిమ్మాపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని తిరిగి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొటింది. అశ్వర్థరావు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా నాగలక్ష్మీబాయికి రెండు కాళ్లు విరిగాయి. డ్రైవర్‌కు భార్య, రాములమ్మ, పదవ తరగతి చదువుతున్న వేణు, ఏడో తరగతి చదువుతున్న వినోద్ సంతానం. విషయం తెలిసిన వెంటనే అశ్వర్థరావు తమ్ముడు సుబ్బారావు హుటాహుటినా సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. శ్రీవిద్యస్కూల్ అధినేత మృతి వార్త తెలియడంతో కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement