సబ్సిడీ శనగల దొంగ దొరికాడు
Published Thu, Nov 10 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
కోవెలకుంట్ల: గోదాము నుంచి సబ్సిడీ శనగ ప్యాకెట్లను దొంగలించిఽఽన వ్యక్తిని సంజామల పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం సీఐ శ్రీనివాసరెడ్డి నిందితుడు వివరాలను మీడియాకు వివరించారు. సంజామల మండలానికి మంజూరైన సబ్సిడీ శనగ విత్తన ప్యాకెట్లను గ్రామంలోని కో ఆపరేటీవ్ సహకార సంఘ గోదాములో నిల్వ ఉంచారు. గత నెల3వ తేదీ నుంచి అదే నెల 22వ తేదీ వరకు రైతులకు సబ్సిడీ శనగలను పంపిణీ చేశారు. విత్తన పంపిణీ సమయంలో రైతులకు శనగ ప్యాకెట్లను అందజేసేందుకు 20 రోజులపాటు గోదాములో గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య హమాలీగా చేరాడు. హమాలీగా ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా తోటి హమాలీలు, గోదాము సిబ్బంది, రైతులు పసిగట్టకుండా గోదాములోని కొన్ని శనగ ప్యాకెట్లను పక్కన దాచిపెట్టి రాత్రి సమయాల్లో ఇంటికి తెచ్చుకునేవాడు. విత్తన పంపిణీ ప్రక్రియ ముగిశాక శనగలకు సంబంధించి రికార్డులు, స్టాక్‌ను పరిశీలించగా 44 శనగ ప్యాకెట్లకు లెక్క తేలకపోవడంతో కో ఆపరేటీవ్ సహకార సంఘం సీఈఓ రవీంద్ర గుప్త హమాలీలను గోదాములకు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ విచారణకు వెంకటసుబ్బయ్య హాజరు కాకపోవడంతో అనుమానం వచ్చి గత నెల 31వ తేదీన సంజామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విజయభాస్కర్ విచారణకు హాజరుకాని హమాలీ వెంకటసుబ్బయ్య కదలికలపై నిఘా వేశారు. గోదాములో దొంగలించిన శనగ ప్యాకెట్లను హమాలీ ఇదే మండలంలోని కానాల గ్రామానికి చెందిన ఓ రైతుకు రూ. లక్షకు విక్రయించాడు. పోలీస్‌స్టేషన్‌లో హమాలీపై కేసు నమోదు కావడంతో భయాందోళనకు గురైన రైతు శనగలను వెనక్కు తీసుకోవాలని లేకపోతే పోలీసులకు చెబుతానని హమాలీపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో వెంకటసుబ్బయ్య సొంత ఆటో వేసుకుని రైతు వద్ద ఉన్న శనగ ప్యాకెట్లను వెనక్కు తీసుకుని కోవెలకుంట్లలో విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 44 ప్యాకెట్ల శనగలు, ఆటోను సీజ్‌చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.
Advertisement
Advertisement