టీటీడీ గోడౌన్‌లో జీడిపప్పును పరిశీలిస్తున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతి అలిపిరి: శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందున.. సంబంధిత కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని అధికారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి సిద్ధంగా ఉంచిన జీడిపప్పును పరిశీలించారు.
ప్రస్తుతం 3 కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా.. అందులో ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పులో నాణ్యత లోపించినట్లు గుర్తించారు. దుమ్ము, విరిగిపోయినవి ఉన్నట్లు తేల్చారు. వెంటనే సదరు సంస్థ కాంట్రాక్టు రద్దు చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. అనంతరం యాలకులను పరిశీలించారు. వాసన తక్కువగా ఉండటంతో.. నాణ్యతను తేల్చేందుకు ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు.
ఆవు నెయ్యి వాసన కూడా సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ప్రసాదాల తయారీ కోసం ఏటా రూ.500 కోట్ల ఖర్చుతో జీడిపప్పు, నెయ్యి, యాలకులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే వీటిలో నాణ్యత లోపిస్తోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. సరుకులను టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించడంతో పాటు సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్‌కు పంపించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆయన వెంట మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment