సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో పట్టుబడ్డ బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు వెలుగుచూస్తున్నాయి. బంగారంపై టీటీడీ ద్వంద్వ వైఖరి, తమిళనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను బెదిరించి, పలు రకాలుగా ఒత్తిడి చేసి బంగారాన్ని విడిపించుకుపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తమిళనాడులో ఈ నెల 18న ఎన్నికల పోలింగ్ జరగనుండగా 17 రాత్రి తిరువళ్లూరు జిల్లా సరిహద్దు పూందమల్లి తహశీల్దారు పరిధిలో రూ.400 కోట్లకు పైగా విలువైన 1,381 కిలోల బంగారు కడ్డీలను అక్కడి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. సీక్వెల్ గ్లోబల్ క్రిటికల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన వాహనంలో బంగారం తరలిస్తుండగా ఈ వాహనానికి ముందు, వెనుక రెండు వాహనాలు ఉన్నాయి.
ఒక వాహనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రైవేటు సాయుధ బందోబస్తు ఉంది. పట్టుబడ్డప్పుడు టీటీడీకి చెందిన బంగారమని వాహనాల్లోని వ్యక్తులు మౌఖికంగా చెప్పారేగానీ అందుకు తగిన ఆధారాలు వారి వద్ద లేవు. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మొత్తం మూడు వాహనాలు కాగా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం రెండే వాహనాలని రికార్డు చేశారు. మరి మూడో వాహనం ఏమైనట్లు? అది ఎవరికి చెందినది? బంగారం ఉన్న వాహనానికి ముందు, వెనక ఉన్న వాహనాల్లో ఒకటి అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమైనదో ఆ ఏడుకొండలవాడికే తెలియాలి. బంగారం పట్టుబడగానే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రెవెన్యూ శాఖాధికారులకు అప్పగించారు. రెవెన్యూ శాఖ బంగారాన్ని ట్రెజరీలో భద్రపరిచి ఆదాయపన్ను (ఐటీ) శాఖాధికారులకు సమాచారం ఇచ్చింది.
టీటీడీ నిర్లక్ష్యంపై ఐటీ శాఖ అనుమానాలు
చెన్నై నుంచి తిరుపతికి రోడ్డు మార్గంలో బంగారం రవాణాలోనూ, పొందడంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల అంతులేని నిర్లక్ష్యంపై ఐటీ శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బంగారం పట్టుబడ్డప్పుడు ఈ అంశంపై అనేక ప్రశ్నలను సంధించింది. వాహనంలోని వారు బంగారం టీటీడీకి చెందినదని చెప్పారు. అయితే, అధికారులు వాకబు చేయగా తమకేమీ సంబంధం లేదని టీటీడీ బదులిచ్చింది. అంతలోనే మరికొద్దిసేపటికి బంగారం తమదేనని, తీసుకోవడానికి అధికారులు వస్తున్నారంటూ మాటమార్చింది. బంగారం తమదే అయితే టీటీడీకి ఈ తడబాటు ఎందుకని ఐటీ శాఖ ప్రశ్నిస్తోంది. వందల కోట్ల విలువైన బంగారం టీటీడీకి చేరుకుంటున్నప్పుడు దాన్ని పొందేందుకు టీటీడీ ఈవో ప్రత్యేక అధికారుల బృందాన్ని తగిన పత్రాలతో ముందుగానే సిద్ధం చేయాల్సి ఉంది.
ఫలానా రోజు బంగారం వస్తుందనే సమాచారాన్ని కూడా సదరు బృందానికి ముందురోజే తెలియజేయాల్సి ఉంది. అంతేకాకుండా బంగారాన్ని భద్రం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, బంగారం పట్టుబడ్డాక తమిళనాడు అధికారులు తెలియజేసిన తర్వాత కూడా ఆ బంగారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం.. ఆ తర్వాత తేరుకుని తమదేనని చెప్పడంపై ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా విలువ చేసే బంగారంపై టీటీడీ ఇంత నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈసీపై టీటీడీ ఈవో ఒత్తిడి
బంగారం తమకు చేరే వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకుదే బాధ్యత అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వాదిస్తున్నారు. ఇది నిజమే అనుకున్నా బంగారం ఎప్పుడు వస్తోంది? ఎలా వస్తోంది? అనే అవగాహన లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఖరీదైన సరుకును రవాణా చేసే క్రమంలో పంపేవారు, పత్రాలు ఎంత ముఖ్యమో పొందుతున్న వ్యక్తులు లేదా సంస్థలు కూడా అంతే ముఖ్యం. అయితే, బంగారం విషయంలో పంపుతున్నవారి పత్రాలు ఉన్నాయి కానీ టీటీడీకి చెందిన బంగారమే అనే విషయంలో స్పష్టత లేదని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. పట్టుబడ్డ బంగారం అధిక మొత్తంలో ఉండటంతో ఈ కేసు ఐటీ పరిధిని దాటి డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) చేతుల్లోకి వెళ్లిందని చెబుతున్నారు.
డీఆర్‌ఐ అధికారులు కస్టమ్స్ క్లియరెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు పత్రాలను తనిఖీ చేశారు. మొత్తం వ్యవహారాన్ని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయానికి వదిలేశారు. దీంతో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయి. ‘ఇది టీటీడీకి చెందినదని తెలుసా.. దేవుడి బంగారానికి కూడా తనిఖీలా.. నేను కూడా ఐఏఎస్ అధికారినే.. చెబితే వినిపించుకోరా?’ అంటూ పరుష పదజాలంతో ఈసీని బెదిరించినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పలుకోణాల్లో ఈసీపై ఒత్తిడి పెంచడంతో తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించి బంగారం అప్పగించినట్లు తెలుస్తోంది. బంగారం తమదే అయినప్పుడు టీటీడీ హడావిడిగా ఇంత హైరానా పడటం, ఈసీని బెదిరించడం, ఒత్తిళ్లకు గురిచేయడంలోని ఔచిత్యం ఏమిటనే వాదన ఐటీ వర్గాల్లో వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment