దోపిడీ దొంగలు కొట్టేసుంటే..! | Illigal Trasportaion Of Gold Errors are Exposed | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగలు కొట్టేసుంటే..!

Published Thu, Apr 25 2019 4:23 AM | Last Updated on Thu, Apr 25 2019 4:23 AM

Illigal Trasportaion Of Gold Errors are Exposed - Sakshi

బంగారం తరలించిన వాహనం

సాక్షి, అమరావతి: తమిళనాడులోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి తిరుపతికి 1,381 కిలోల బంగారాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను దొంగలు దోపిడీ చేసుంటే పరిస్థితి ఏమిటి? దోపిడీ దొంగలే పోలీస్‌ దుస్తుల్లో వచ్చి తనిఖీ చేసి బంగారానికి రశీదులు లేనందున దొంగ బంగారం సీజ్‌ చేస్తున్నామని తీసుకెళ్లుంటే ఏమయ్యేది? దురదృష్టవశాత్తూ ఇలా జరిగుంటే ఎంత ఉపద్రవం కలిగేది? కలియుగ వైకుంఠ దైవమైన శ్రీవారి కోట్లాది మంది భక్తులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లోనూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ బంగారం విలువ రూ.415 కోట్లే కావచ్చు. ఇది శ్రీవారికి పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ స్వామి వారి బంగారమే దోపిడీ అయితే భక్తుల, ప్రజల మనోభావాల మాటేమిటి? అని అధికారులు అంతర్మథనం చెందుతున్నారు.

తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలకు ముందు రోజు ఈనెల 17న ఎన్నికల కమిషన్‌ అధికారులు (రెవెన్యూ, పోలీసు సిబ్బంది) తనిఖీ సందర్భంగా వాహనంలో తరలిస్తున్న 1,381 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం.. తర్వాత అది తిరుమల – తిరుపతి దేవస్థానం (టీటీడీ)ది అని చెప్పడంతో వారికి ఇచ్చిన విషయం విదితమే. ఇంత విలువైన స్వామి వారి బంగారానికి సరైన రక్షణ, ఆధార పత్రాలు లేకుండా ఎలా తరలిస్తారు? ఇది అసలు టీటీడీదేనా? మరెవరిదైనా దొంగ బంగారమైతే స్వామి వారిదని కథ అల్లారా? అనే అనుమానాలు కూడా భక్తుల మదిని తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఆయన దీనిని పరిశీలించి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), పోలీసు, బ్యాంకింగ్, టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

టీటీడీది బాధ్యతారాహిత్యం కాదా?
తాము డిపాజిట్‌ చేసిన స్వామి వారి బంగారాన్ని టీటీడీ ఖజానాకు చేర్చాల్సిన బాధ్యత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుదేనని కార్యనిర్వహణాధికారి (ఈఓ) అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పేర్కొనడాన్ని అన్ని వర్గాలు తప్పు పడుతున్నాయి. అధికార వర్గాలు ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామి వారి బంగారాన్ని అగ్రిమెంట్లతో ముడి పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. డిపాజిట్‌ గడువు ఎప్పుడు ముగుస్తుంది? మా బంగారాన్ని ఎప్పుడు ఎలా తరలించి మాకు అప్పగిస్తారు? మీరు అప్పగింతకు ఎప్పుడు.. ఎవరు వస్తున్నారు? తరలింపునకు అనుసరిస్తున్న రక్షణ చర్యలేమిటి? ఏమేమి పత్రాలు కావాలి? వాటిని తెస్తున్నారా? మేము ఎలాంటి పత్రాలు ఇవ్వాలి? అనే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కచ్చితంగా టీటీడీ అధికారుల తప్పిదమే. శ్రీవారి బంగారం తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత పీఎన్‌బీదే అనే విషయం వాస్తవమే. మార్గంమధ్యలో ఏదైనా జరగరానిది జరిగి ఈ బంగారం మాయమైతే.. అనే కనీస ఊహ కూడా లేకుండా వ్యవహరించడం తప్పు. బంగారం పోతే ఇన్సూరెన్సు ఉందా? లేదా? అనేది ఇక్కడ ప్రశ్నే కాదు. మొన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది ఎన్నికల కమిషన్‌ అధికారులు కాకుండా పోలీసులు/ విజిలెన్స్‌ అధికారుల ముసుగులో ఉన్న దోపిడీ దొంగలైతే పరిస్థితి ఏమిటి? కేసులు, పోలీసు జాగిలాలు, దర్యాప్తు బృందాలు పరుగులు తీయాల్సి వచ్చేది. అదే జరిగితే స్వామి వారి భక్తుల్లో అలజడి వస్తే దానికి బాధ్యులెవరు? అసలు ఈ ప్రశ్నలు ఊహించడానికే భయమేస్తోంది’ అని ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు.

పీఎన్‌బీదీ అవగాహన రాహిత్యమా?
ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని వ్యాన్‌లో తరలిస్తుంటే మధ్యలో ఎవరైనా తనిఖీ చేస్తే పత్రాలు చూపించాల్సి వస్తుందన్న కనీస అవగాహన పీఎన్‌బీ అధికారులకు ఎలా లేకుండా పోయిందన్నది వేయి డాలర్ల ప్రశ్నగా మారింది. ఇది అనుమానాలకు తావిస్తోంది. ‘బంగారాన్ని బ్యాంకు నుంచి టీటీడీకి తరలిస్తున్నట్లు అధికారిక ధ్రువపత్రాలు వాహనంలోని అధికారులు వెంట పెట్టుకుని వెళ్లాల్సి ఉంది. ఇలా పత్రాలు తీసుకెళ్లక పోవడం తీవ్ర తప్పిదం. అలాగే స్వామివారి బంగారాన్ని ప్రయివేటు లాజిస్టిక్‌ వాహనాల్లో సాధారణంగా బ్యాంకు నగదు తీసుకెళ్లినట్లు తీసుకెళ్లడం లోపభూయిష్ట విధానం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాల్సి ఉండగా.. సాదాసీదాగా కూరగాయలను తీసుకెళ్లినట్లు తరలించడం దారుణం’ అని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యవహారం వివాదానికి దారితీసినా మొత్తంమీద మంచే జరిగినట్లు చెప్పక తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. దీనివల్లే స్వామి వారికి చెందిన 1,381 కిలోల బంగారం తరలింపులో భద్రత డొల్లేనని తేలిందని, భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మార్గం ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement