తిరుపతి అర్బన్ : చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి తిరుపతికి తీసుకొస్తూ పట్టుబడ్డ 1,381 కిలోల బంగారం వ్యవహారంలో టీటీడీకి ఎలాంటి సంబంధంలేదని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఈవో మీడియాతో మాట్లాడారు. 2000వ సంవత్సరం ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు.. 2015కు చెందిన రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు టీటీడీ బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 2016 ఏప్రిల్ 18న పంజాబ్ నేషనల్ బ్యాంకులో టీటీడీకి చెందిన 1,311 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకుగానూ ఈనెల 18తో గడువు ముగిసే ఆ డిపాజిట్‌కు వడ్డీతో కలిపి పీఎన్‌బీ అధికారులు టీటీడీకి 1,381 కిలోల బంగారాన్ని అప్పగించాల్సి ఉందన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమిళనాడు పోలీసుల జరిపిన తనిఖీల్లో ఆ బంగారం పట్టుబడడం, అనంతరం పూర్తి విచారణ, పరిశీలన తర్వాత ఎన్నికల అధికారులు దానిని విడుదల చేసినట్లు ఈవో వివరించారు.
ఈ కారణంగానే రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 20న రాత్రి తిరుపతిలోని టీటీడీ ఖజానాకు బంగారం చేరిందన్నారు. ఈ సమయంలో తమ బంగారు విభాగం నిపుణులు, సంబంధిత అధికారులు నాణ్యత, పరిమాణం అంశాలను పరిశీలించాకే 1,381 కిలోలను తీసుకోవడం పూర్తిచేశామన్నారు. కానీ, తాము బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారాన్ని వడ్డీతో కలిపి తిరిగి తమకు అప్పగించే వరకు పూర్తి బాధ్యత పీఎన్‌బీ అధికారులదేనని ఈవో వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో బంగారం తరలింపు విషయంలో చోటుచేసుకున్న వివాదానికి టీటీడీ ఏమాత్రం బాధ్యత వహించబోదన్నారు. టీటీడీకి చెందిన బంగారం డిపాజిట్ విషయంలో పూర్తిగా ఆర్‌బీఐ నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు.
అందుకే అయితే ‘బోర్డు మీటింగ్’ అక్కర్లేదు
చెన్నై పీఎన్‌బీ నుంచి తిరుపతికి తరలించిన బంగారం వివాదం కోసమే అయితే టీటీడీ బోర్డు మీటింగ్ అక్కర్లేదని ఈవో సింఘాల్ స్పష్టంచేశారు. ఈ విషయంలో టీటీడీ పూర్తి పారదర్శకంగానే వ్యవహరించిందన్నారు. అయితే, ఈ వివాదం అంశంపై త్వరలో బోర్డు మీటింగ్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారన్న అంశానికి ఈవో పైవిధంగా స్పందించారు. గడువు ముగిసిన బంగారం డిపాజిట్లను తిరిగి ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, లేదా ఇతరత్రా నిర్ణయాలు మాత్రం బోర్డుతో పాటు ఆయా సబ్ కమిటీల నిర్ణయాల మేరకే ఉంటాయన్నారు. ఈ విషయంపై స్వామీజీలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈ ప్రెస్‌మీట్ ద్వారా సమాధానం లభించినట్లేనని ఈవో తెలిపారు.
సూచనలిచ్చేందుకే సీఎస్ విచారణకు ఆదేశం
ఇదిలా ఉంటే.. 1,381 కిలోల బంగారం విషయంలో నాలుగు రోజులుగా రగులుతున్న వివాదం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం టీటీడీ అధికారులకు ఏమైనా సూచనలు ఇచ్చేందుకే విచారణకు ఆదేశించి ఉంటారని ఈవో పేర్కొన్నారు. టీటీడీ పాలనతోపాటు ఇతర అనేక విషయాల్లో సంపూర్ణ అవగాహన కలిగిన ఆయన విచారణను తాము స్వాగతిస్తామన్నారు.
బంగారం వివాదంలో..టీటీడీకి సంబంధమే లేదు
Published Tue, Apr 23 2019 4:00 AM | Last Updated on Tue, Apr 23 2019 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment