బంగారం తరలింపు: గోల్‌మాలేనా.. గోవిందా! | Special CS Report On TTD Gold Transportation | Sakshi
Sakshi News home page

గోల్‌మాలేనా.. గోవిందా!

Published Wed, Apr 24 2019 2:44 AM | Last Updated on Wed, Apr 24 2019 11:43 AM

Special CS Report On TTD Gold Transportation - Sakshi

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, లేదంటే బ్యాంకుల నుంచి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా మరో చోటుకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తం కావడానికి టీటీడీతో పాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా అవకాశం కలిగించిందని మన్మోహన్‌సింగ్‌ విచారణ నివేదికలో చెప్పినట్లు సమాచారం.

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బంగారం వివాదంపై ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వాదన సరికాదని ఈ అంశంపై విచారణ చేసిన రాష్ట్ర రెవెన్యూ(దేవాదాయ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ తేల్చిచెప్పారు. బంగారం వ్యవహారంలో అటు బ్యాంకు గానీ, ఇటు ఈవో గానీ పాటించాల్సిన నియమ నిబంధనలేవీ పాటించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. మన్మోహన్‌సింగ్, దేవాదాయ శాఖ కమిషనర్‌ పద్మ సచివాలయంలో ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంను కలిశారు. టీటీడీ బంగారం తరలింపులో చోటుచేసుకున్న లోపాలను వివరించారు. ఆ బంగారం తరలింపు బాధ్యత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుదేనని, అది టీటీడీకి చేరే వరకూ తనకు సంబంధం లేదని ఈవో సింఘాల్‌ వ్యాఖ్యానించడం సరికాదని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా ఈ విషయంలో నిబంధనలను పాటించలేదనే నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. 

ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా? 
బ్యాంకులో పెట్టిన బంగారం గడువు తీరిపోయి టీటీడీ ట్రెజరీకి తరలిస్తున్న నేపథ్యంలో.. ఆ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదేనని లేఖ ఇవ్వాల్సి ఉందని, కానీ, ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా? అనే సందేహాలున్నాయని విచారణ నివేదికలో మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ఏ రోజున బ్యాంకులో బంగారం పెట్టిందీ.. గడువు తీరాక ఎంత బంగారం టీటీడీకి జమ చేయాలో కూడా ఆ లేఖలో టీటీడీ ఈవో వివరించాల్సి ఉంటుందని, సదరు లేఖతో సహా బంగారం తరలింపునకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, అయితే ఇవేమీ పాటించలేదని నివేదికలో తేల్చిచెప్పినట్లు సమాచారం. 

ఆభరణాల్లోని రాళ్లు, రత్నాలను ఏం చేస్తున్నారు? 
స్వామి వారికి కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను పలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తారని, అయితే అలా డిపాజిట్‌ చేసిన బంగారం గడువు తీరాక తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా? అనే దానిపై తాజా ఘటన తరువాత సందేహాలు తలెత్తుతున్నాయనే అభిప్రాయాన్ని విచారణ నివేదికలో మన్మోహన్‌సింగ్‌ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల నియామవళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, లేదంటే బ్యాంకుల నుంచి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా మరో చోటుకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తం కావడానికి టీటీడీతో పాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులు అవకాశం కలిగించాయని చెప్పినట్లు   సమాచారం.

స్వామి వారికి ఆభరణాల రూపంలోనే భక్తులు బంగారం సమర్పిస్తారని, ఆ బంగారాన్ని కరిగించి కడ్డీలుగా మార్చడానికి ముందు ఆ ఆభరణాల్లో ఉన్న విలువైన రాళ్లు, రత్నాలను ఎక్కడ భద్రపరుస్తారో కూడా విచారించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘డిపాజిట్‌ చేసిన బంగారం బ్యాంకు నుంచి టీటీడీ ట్రెజరీకి చేరే వరకూ తనకు సంబంధం లేదంటూ ఈవో చేసిన వాదన సరిగా లేదు. ఆయన పాటించాల్సిన నియమ నిబంధనలను పాటించలేదు. అలాగే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా నిబంధనలు పాటించలేదు. తగిన భద్రత లేకుండా బంగారాన్ని తరలించడం ఏమిటి? ఇందులో టీటీడీ ఈవో, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తప్పిదాలకు పాల్పడ్డారు. భవిష్యత్తులో స్వామి బంగారం, ఆభరణాల విషయంలో మరింత పారదర్శకతతో వ్యవహరించాలి. దీనిపై ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి’’ అని విచారణ నివేదికలో మన్మోహన్‌సింగ్‌ సిఫార్సు చేసినట్లు సమాచారం. 

భక్తుల మనోభావాలతో వ్యాపారమా? 
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే బంగారాన్ని టీటీడీ పాలక మండలి వ్యాపార వస్తువుగా మార్చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హుండీ ద్వారా వచ్చే బంగారాన్ని అధికారులు కడ్డీలుగా మార్చి, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నారు. బ్యాంకులేమో ఆ బంగారాన్ని విక్రయించి, వచ్చిన సొమ్మును వడ్డీలకు ఇచ్చుకుంటున్నాయి. టీటీడీ డిపాజిట్‌ చేసిన బంగారంపై బ్యాంకులు చెల్లించే వడ్డీ 2 శాతంలోపే. అదే బంగారాన్ని అమ్మేసి, వచ్చిన సొమ్మును ప్రజలకు అప్పుగా ఇచ్చి 7 నుంచి 9 శాతం దాకా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అంటే బ్యాంకులు ఏ స్థాయిలో లాభపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గడువు తీరిన తర్వాత తమ వద్ద ఉండే ఇతర బంగారం, లేదంటే దేశవిదేశాల్లో కొనుగోలు చేసి టీటీడీకి బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తున్నాయి. అంటే భక్తులు సమర్పించిన బంగారం అచ్చంగా అదే తిరిగి రాదు. ఇలా బంగారం డిపాజిట్లతో టీటీడీ ప్రతిఏటా రూ.60 కోట్ల దాకా వడ్డీ ఆర్జిస్తున్నట్లు అంచనా. 

శ్రీవారి ఖజానాలో 9,259 కిలోల బంగారం 
తమిళనాడులో తనిఖీల్లో పట్టుబడ్డ 1,381 కిలోల బంగారంపై భక్తుల్లో అనుమానాలు వెంటాడుతున్నాయి. దాన్ని ప్రస్తుతం టీటీడీ ఖజానాకు చేర్చారు. ఆ బంగారాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసి, విమానంలో భారత్‌కు తరలించినట్లు సమాచారం. టీటీడీ ఖజానాలో ప్రస్తుతం కడ్డీల రూపంలో 9,259 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు అంచనా. ఈ మొత్తం బంగారాన్ని నగదు రూపంలోకి మార్చాలని టీటీడీ పాలక మండలి యోచిస్తున్నట్లు సమాచారం. బంగారం డిపాజిట్లపై బ్యాంకులిచ్చే వడ్డీ 2 శాతం లోపే ఉండడం, నగదు డిపాజిట్లపై వడ్డీ 8 శాతానికి పైగానే ఉండడంతో బంగారాన్ని నగదు రూపంలో మారిస్తే అదనంగా 6 శాతం వడ్డీ వస్తుందని భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement