![Common Good Fund For Reconstruction of temples Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/23/TEMPLE-1.jpg.webp?itok=ZRHqIf1X)
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం ద్వారా మూడేళ్లలో 547 పురాతన, శిధిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం సోమవారం మరికొన్నింటికి అనుమతి ఇవ్వనుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది.
దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లతో పాటు టీటీడీ ఈవో సభ్యులుగా కొనసాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ఆలయాల పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 4వతేదీన నాడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.31.40 కోట్లతో 60 ఆలయాల పునఃనిర్మాణానికి అనుమతి తెలిపారు. ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద సుమారు 160 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
సీజీఎఫ్‌కు నిధులు పెంచుతూ చట్టం
ఆదాయం లేని పురాతన, శిధిలావస్థకు చేరుకున్న ఆలయాల పునఃనిర్మాణం కోసం వినియోగించే కామన్‌గుడ్ ఫండ్‌కు ఏడాది కిత్రం వరకు టీటీడీ తన వాటాగా ఏటా రూ. 1.25 కోట్లు ఇవ్వగా శ్రీశైలం, విజయవాడ దుర్గగుడి సహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఇతర పెద్ద ఆలయాల నుంచి అధిక మొత్తంలో నిధులు అందేవి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏటా రూ.40 కోట్లు చొప్పున కామన్‌గుడ్ ఫండ్‌కు కేటాయించేలా గతేడాది ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో కామన్‌గుడ్ ఫండ్ కింద రూ.130 కోట్లు దాకా నిధులు సమకూరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment