టీటీడీ బంగారంపై చీకట్లో నివేదిక! | Many Doubts Over Caught Gold Which Belongs To TTD | Sakshi
Sakshi News home page

టీటీడీ బంగారంపై చీకట్లో నివేదిక!

Published Fri, May 3 2019 2:40 AM | Last Updated on Fri, May 3 2019 10:08 AM

Many Doubts Over Caught Gold Which Belongs To TTD - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి బంగారంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన విచారణ నివేదిక ఏమైందనే ప్రశ్న అధికార వర్గాలు, కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో చర్చనీ యాంశంగా మారింది. టీటీడీ బంగారం తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అసలు అది టీటీడీకి చెందిన బంగారమేనా? లేక మరొకరిదా? అనే సందేహాలు కలుగుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చెన్నైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి బంగారం తరలింపు గురించి తనకు తెలియదని తొలుత టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించడం వీటికి బలం చేకూర్చుతోంది. బంగారం తరలింపుపై ప్రత్యేక సీఎస్‌ మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ గత నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపడం తెలిసిందే.

వారం గడుస్తున్నా చర్యలేవి?
బంగారం తరలింపుపై ఉన్నతాధికారులిచ్చిన నివేదిక చంద్రబాబుకు వద్దకు చేరి వారం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బుధవారం సీఎం నిర్వహించిన మీడియా సమావేశంలోసీఎస్‌ విచారణకు ఆదేశించడాన్ని తప్పుబట్టడం గమనార్హం. సీఎస్‌ ఓవర్‌ యాక్షన్‌ చేశారంటూ నిందించారు. ఏదో జరిగిపోయిందంటూ విచారణకు అదేశించడం ఏమిటంటూ సీఎం ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలను గమనిస్తే ఇందులో కచ్చితంగా ఏదో గోల్‌మాల్‌ జరిగి ఉంటుందనే అనుమానం బలపడుతోందని సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.  

సీఎస్‌పై చంద్రబాబు చిందులు
అసలు ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు వెల్లడించకుండా అసలు సీఎస్‌ విచారణకు ఆదేశించడమే తప్పు అన్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రవర్తించడంపై పలు సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయని మరో సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. చైన్నై బ్యాంకు నుంచి టీటీడీకి చెందిన బంగారాన్ని తిరుమలకు తరలిస్తుంటే ఆ విషయం తనకు తెలియదని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారని, సీఎస్‌ విచారణకు ఆదేశించిన మరుసటి రోజే హడావుడిగా ఈవో విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించారనేది అనుమానాలకు తావు ఇస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈవో చెబుతున్న విషయాలనే ముఖ్యమంత్రి కూడా మీడియాతో ప్రస్తావిస్తున్నారంటే ఇందులో ఏదో మతలబున్నట్లు బోధపడుతోందని పేర్కొంటున్నారు. బంగారం తరలింపును సీఎం చాలా తేలిగ్గా కొట్టిపారేయడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈవో తప్పిదాలను ప్రస్తావించిన నివేదిక
టీటీడీ బంగారం వివాదానికి సంబంధించి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వాదన సరికాదని, బ్యాంకుతోపాటు ఈవో నిబంధనలు పాటించలేదని విచారణ నివేదికలో మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈమేరకు సీఎస్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. బంగారం తరలింపులో లోపాలను అందులో ప్రస్తావించారు. బంగారం టీటీడీకి చేరే వరకు తనకు సంబంధం లేదని ఈవో పేర్కొనడం సరికాదన్నారు. గడువు తీరిన బంగారాన్ని బ్యాంకు నుంచి టీటీడీ ట్రెజరీకి తరలించే సమయంలో ఈవో లేఖ ఇవ్వకపోవడం ఉద్దేశపూర్వకంగానేనా? అనే విషయంలో సందేహాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకులో బంగారం భద్రపరచిన తేదీతోపాటు గడువు తీరాక ఎంత జమ చేయాలో కూడా లేఖలో ప్రస్తావిస్తూ తరలించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఈవో అవేమీ పాటించలేదని నివేదికలో స్పష్టం చేశారు.

స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను పలు బ్యాంకుల్లో  డిపాజిట్‌ చేస్తారని, అయితే తాజా ఉదంతంతో గడువు తీరాక అదంతా తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న తరుణంలో పోలీసుల తనిఖీల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ఆభరణాల బంగారాన్ని కరిగించే ముందు విలువైన స్టోన్స్‌ ఎక్కడ భద్రపరుస్తున్నారో కూడా విచారించాలనే అభిప్రాయాన్ని నివేదికలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత పారదర్శకంగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement