సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1,381 కిలోల బంగారం వ్యవహారంలో అనేక గుట్టుమట్లు దాగి ఉన్నాయన్న అనుమానాలు బలపడుతు న్నాయి. మామూలుగా అయితే నిర్ణీత పరిమాణం దాటిన ఏ వస్తువునైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే వేబిల్లు తప్పనిసరి. ఇది లేకుండా రవాణా జరిగేవన్నీ దొంగ సరుకు కిందే లెక్కగడతారు. అయితే, ఈ 1,381 కిలోల బంగారం తరలింపులో ‘ఈ–వేబిల్లు’ జాడ ఎక్కడా కనిపిం చడం లేదు. వాస్తవానికి బంగారం గోల్డ్ డిపాజిట్ స్కీం కింద పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాచిన శ్రీవారి బంగారానికి వడ్డీతో కలిపి 1,381 కిలోల బంగారాన్ని బ్యాంకు (పీఎన్‌బీ) టీటీడీకి అప్పగించాల్సి ఉంది.
ఇదే సమయంలో పీఎన్‌బీ 1,381 కిలోల బంగారాన్ని స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్లు కొన్ని డాక్యుమెంట్లను టీటీడీ అధికారులు బయటపెడుతున్నారు. బంగారం కడ్డీలను 56 బాక్సుల్లో జ్యురిచ్ ఎయిర్‌పోర్టు నుంచి ఈనెల 12న విమానం మార్గంలో చెన్నైకు చేరవేసేలా ఒక కార్గో సంస్థతో ఒప్పందం జరిగింది. ఇందుకు సంబంధించి జ్యురిచ్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు బంగారం తరలించే ఎయిర్ వే బిల్లులను టీటీడీ అధికారులు చూపుతున్నారు కానీ.. చెన్నై నుంచి టీటీడీకి ఆ బంగారాన్ని తరలించడానికి సంబంధించిన ఈ–వేబిల్లు గురించి టీటీడీ ఉన్నతాధికారులను అడిగితే.. పీఎన్‌బీ అధికారులు ఆ వేబిల్లు తమకివ్వలేదని చెబుతున్నారు.
వారం రోజుల ముందు తేదీలతో ఇన్‌వాయిస్
కాగా, గడువు ముగిసిన బంగారం డిపాజిట్లను తిరిగి టీటీడీకి అప్పగించడానికే బ్యాంకు అధికారులు 1,381 కిలోల బంగారాన్ని స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేశారని టీటీడీ అధికారులు చెబుతుంటే.. ఎయిర్ వే మార్గంలో దేశానికి తరలించిన బంగారానికి సంబంధించిన కమర్షియల్ ఇన్‌వాయిస్ (బంగారం ఎవరిదన్నది తేల్చే పత్రాలు)లో కనీసం టీటీడీ అన్న పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాక.. ఆ కమర్షియల్ ఇన్‌వాయిస్‌లో తిరుపతిలోని ‘జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థ’కు అని పేర్కొన్నారు. దీనికితోడు 12వ తేదీన విమాన మార్గంలో చెన్నై వచ్చిన బంగారానికి తిరుపతిలో డెలివరీ చేయడానికి 11వ తేదీనే కమర్షియల్ ఇన్‌వాయిస్ తీసుకోవడం మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి.. టీటీడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఏప్రిల్ 18వ తేదీతో బ్యాంకులో స్వామివారి బంగారం డిపాజిట్ గడువు ముగుస్తుంది. కానీ, తిరుపతిలోని జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థకు బంగారాన్ని అప్పగించడానికి ఏప్రిల్ 11వ తేదీన ఇన్‌వాయిస్ తీసుకున్నారు. తమిళనాడులో బంగారం పట్టుబడి, తర్వాత టీటీడీ ఖజనాకు అది చేరాక ఇప్పుడు ఆ బంగారం, ఈ బంగారం ఒక్కటేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
గతంలోనూ అనేక ఆరోపణలు
కాగా, స్వామి వారి అతి పురాతనమైన ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్తున్నాయని గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలొచ్చాయి. తిరుమల ఆలయ ప్రధానార్చకులుగా పనిచేసిన రమణదీక్షితులు సైతం ఇలాంటి అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుబడ్డ బంగారం వ్యవహారంతో.. తిరుమల శ్రీవారి బంగారం పేరుతో అక్రమ లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రశ్నలకు జవాబేది?
– బంగారం పట్టుబడిన సమయంలో అది తమదేనని టీటీడీ అధికారులు ఎవ్వరూ వివరణ ఇవ్వలేదంటున్న ఈవో సింఘాల్.. ఐటీ శాఖ వివరాలు అడిగితే ఆ బంగారంతో తమకు సంబంధంలేదని చెప్పకుండా పీఎన్‌బీలో డిపాజిట్ చేసిన వివరాలను ఎందుకిచ్చారు?
– బంగారం తరలింపునకు సంబంధించి రెండు కాగితాలను ఇచ్చిన టీటీడీ అధికారులు.. కీలకమైన ఈ–వేబిల్లుల వివరాలు ఎందుకు దాచిపెట్టారు?
– ఏప్రిల్ 18న డిపాజిట్ల గడువు ముగిశాక తరలించే బంగారం కోసం వారం రోజుల ముందుగానే అంటే ఏప్రిల్ 11నే ఇన్‌వాయిస్ తీయడం.. ఈ ఇన్‌వాయిస్‌లో ఎక్కడా టీటీడీ పేరు లేకపోవడం ఏమిటి?
– ఈ ఇన్‌వాయిస్‌లో చెన్నై మింట్ రోడ్డులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తిరుపతిలోని జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థకు పంపుతున్నట్లు మాత్రమే ఎందుకు ఉంది?
– స్విట్జర్లాండ్‌లోని బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ఏప్రిల్ 12న బంగారాన్ని కొరియర్ చేసినట్లు రికార్డులు స్పష్టంచేస్తుంటే దానికంటే ఒకరోజు ముందే ఏప్రిల్ 11నే ఇన్‌వాయిస్ ఎందుకు తీసారు?
కాగా, ఇంత భారీ విలువ కలిగిన బంగారాన్ని చెన్నై నుంచి తిరుపతి ట్రెజరీకి పంపుతుంటే దానికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని సింఘాల్ చెప్పడం అనుమానాలను మరింత పెంచుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment